ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనురుధ్ రవిచందర్, సన్ రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారణ్ ల పెళ్లి సందడి మొదలైంది. గ్రీస్ వేదికగా నవంబర్ 10, 11 తేదీల్లో ఈ జంట ఒక్కటి కాబోతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పెళ్లి వేడుకలకు హాజరయ్యేందుకు ప్రముఖులు విదేశీ ప్రయాణం ప్రారంభించడం హాట్ టాపిక్‌గా మారింది. వారికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సూపర్‌స్టార్ రజనీకాంత్ తన కుటుంబ సభ్యులతో కలిసి గ్రీస్ బయలుదేరారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా విమానాశ్రయంలో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీరికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. సినీ, రాజకీయ, ఆర్థిక రంగాలకు చెందిన ప్రముఖులు ఒకే వేడుకలో సందడి చేయబోతుండటంతో ఈ పెళ్లిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఈ వివాహ వేడుకను గ్రీస్‌లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు, ఎంపిక చేసిన అతిథుల మధ్య నిర్వహిస్తున్నారు. పెళ్లి అనంతరం నవంబర్ 21న చెన్నైలో భారీ రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఇప్పటికే సినీ , రాజకీయ ప్రముఖులకు ఈ తేదీన రిసెష్పన్ కు రావాలని ఆహ్వానాలు అందించారు. కావ్య తల్లిదండ్రులు కళానిధి మారన్, కావేరి మారన్ స్వయంగా ప్రముఖులను కలిసి ఆహ్వానించారు.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ వేడుకల కోసం రూపొందించిన ఐవరీ, పౌడర్ బ్లూ రంగుల ఆహ్వాన పత్రికలు ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించాయి. వీటి రూపకల్పనలో అనిరుధ్, కావ్య స్వయంగా భాగస్వాములయ్యారని డిజైనర్ వెల్లడించారు. అయితే ఈ గ్రీస్ వివాహానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ జంట అధికారికంగా వెల్లడించలేదు. దీంతో అసలు వేడుకలో ఇంకా ఎవరెవరు సందడి చేయనున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
