చలికాలంలో పెదాలు పగులుతున్నాయా ? ముఖం రఫ్‌గా మారుతోందా ? క్రీములు కాకుండా ఈ చిట్కాలు పాటిస్తే చాలు!

చలికాలంలో పెదాలు పగులుతున్నాయా ? ముఖం రఫ్‌గా మారుతోందా ? క్రీములు కాకుండా ఈ చిట్కాలు పాటిస్తే చాలు!

చల్లచల్లని గాలులు.. అందమైన వాతావరణం చలికాలానికే సొంతం. అందుకే ఈ సీజన్ కోసం అందరూ వేచి చూస్తారు. కానీ ఎక్కువగా స్కిన్ ప్రాబ్లమ్స్ తెచ్చే సీజన్ కూడా ఇదే. చలి వల్ల చర్మం పొడిబారిపోతుంది. పెదవులు, ముఖం, చేతులు, పాదాలపై దాని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే సీజన్ మొదలైనప్పుడే కేర్ తీసుకోవాలని చెబుతున్నారు ఎక్స్పర్ట్స్,

పొడిబారకుండా..
'చలికాలంలో చలి పెరుగుతున్నకొద్దీ స్కిన్  ప్రాబ్లమ్స్ పెరుగుతుంటాయి. చర్మం పొడిబారడం, ముఖం రఫ్ గా మారడం, దురద, పెదాల పగుళ్లు, ముఖం మీద పొక్కులు, బ్లాక్, వైట్ హెడ్స్ రావడం.. లాంటి సమస్యలు వస్తుంటాయి. అందుకే ముందే జాగ్రత్త పడి.. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మృదువైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు..

ఫాలో అవ్వాల్సినవి..
ఈ కాలంలో ఏ ఫుడ్ తిన్నా సరైన టైమ్ కి తినాలి. లేదంటే డైజెషన్ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. అందుకే కొంచెం.. కొంచెం.. ఎక్కువసార్లు తినాలి. రోజూ అరగంట వర్కవుట్స్ చేయాలి. మందంగా ఉండే బట్టలు వేసుకోవాలి. దానివల్ల చర్మంపై నేరుగా వింటర్ ఎఫెక్ట్ పడదు.

డీ-హైడ్రేషన్
చలికాలంలో నీళ్లు ఎక్కువగా తాగనవసరం లేదనుకుంటే పొరపాటు. ఈ కాలంలోనూ నీళ్లు ఎక్కువగా తాగాలి. శరీరంలో నీళ్ల క్వాంటిటీ ఎక్కువగా లేకపోతే చర్మం పొడిబారిపోతుంది. దాంతో దురద సమస్యలు తలెత్తుతాయి. అందుకే రోజూ కనీసం నాలుగు లీటర్లకు పైనే నీళ్లు తాగాలి. దీనివల్ల చర్మం హెల్దీగా, ఫ్రెష్ గా ఉంటుంది.

తగినంత నిద్ర
క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు ఎక్కువగా నిద్రపోవాలి. రాత్రిళ్లు త్వరగా నిద్రపోయి, త్వరగా లేవాలి. ఇలా చేస్తే శరీరం అలిసిపోదు. పైగా రోజంతా యాక్టివ్గా ఉండొచ్చు. సరైన నిద్ర లేకపోతే ఫేస్ డల్ అవుతుంది. కళ్ల కింద నల్లని వలయాలు ఏర్పడతాయి. ఇమ్యూనిటీని పెంచడంలోనూ నిద్ర చాలా ఉపయోగపడుతుంది. అందుకే సరైన నిద్ర చాలా అవసరం.

ALSO READ : సైనస్ సమస్యలకి చెక్ పెట్టండిలా...! 

పండ్లతో..
చలికాలంలో ఎక్కువగా హాట్ అండ్ స్పైసీ ఫుడ్ తినాలని ఉంటుంది. కానీ ఈ సీజన్లో వీటికి దూరంగా ఉంటే బెటర్ అంటున్నారు ఎక్స్పర్డ్స్. వాటికి బదులుగా సలాడ్స్ తీసుకోవడం మంచిది. హెల్దీ, ఫిట్ బాడీ  కావాలనుకుంటే ప్రతి రోజూ రకరకాల పళ్లు తినాలి. ముఖ్యంగా సిట్రస్ ఉండే పళ్లు తినడం వల్ల చర్మ సమస్యలు రావు.

గోరు వెచ్చని నీళ్లతోనే
చలికాలంలో వేడి నీళ్లతో స్నానం చేయాలనిపిస్తుంది. కానీ, వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల చర్మం పొడి బారి, దురద పెడుతుంది. అందుకే గోరు వెచ్చని నీళ్లతోనే స్నానం చేయాలి. కుదిరితే ఆ నీళ్లలో రెండు చుక్కల వెనిగర్ వేసుకోవచ్చు. ఈ సీజన్ లో సబ్బుకంటే సున్నిపిండి మంచిది. చర్మానికి నువ్వులనూనె పట్టించి సున్నిపిండితో స్నానం చేస్తే చర్మం స్మూత్ గా ఉంటుంది. సబ్బు వాడాలనుకుంటే గ్లిజరిన్ సబ్బులు వాడటం బెటర్. 

లోషన్ మస్ట్
*రెగ్యులర్ గా వ్యాజిలీన్ లేదా పెట్రోలియం జెల్లీ వాడాలి.
*స్నానం చేసిన వెంటనే బాడీ లోషన్ రాసుకోవాలి.
*తడిగా ఉన్న చర్మం మీద లోషన్ రాయడం వల్ల చర్మం ఎక్కువసేపు తేమగా ఉంటుంది.
*విటమిన్-ఇ క్రీములు వాడినా చాలా మంచిది.
* టాల్కమ్ పౌడర్లు వాడకుండా బేబీ పౌడర్ వాడితే బెటర్. వ్యాజిలీన్ వాడితే పగుళ్లకు దూరంగా ఉండొచ్చు.
*వారానికి ఒకసారైనా వేడి నూనెతో మసాజ్ చేసుకోవాలి.
*రాత్రి పడుకునే ముందు చేతులకు, కాళ్లకు వ్యాజిలీన్ రాసుకోవాలి.
*రాత్రిపూట కాళ్లకు సాక్స్ వేసుకుంటే ఇంకా మంచిది. పాదాలు పగలవు.

-డాక్టర్ స్వప్నప్రియ, డెర్మటాలజిస్ట్