సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరు వైరల్ అవుతారో చెప్పడం కష్టం. ఒక్క వీడియోతోనో, ఒక్క ఫొటోతోనో రాత్రికి రాత్రే సెలబ్రిటీలుగా మారిపోతుంటారు. ఇప్పుడు బృందావన్‌కు చెందిన 19 ఏళ్ల యువ ఆధ్యాత్మిక వక్త కూడా ఇలాగే ఇంటర్నెట్లో సెన్సేషన్ గా మారారు. తన యవ్వన రూపం, అందమైన కళ్లు, ఆధ్యాత్మిక ప్రసంగాలతో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు. దీంతో సోషల్ మీడియా ఆయనకు 'జెన్ జెడ్ బాబా' అనే పేరు పెట్టింది.
అయితే ఆయనకు వస్తున్న కామెంట్లన్నీ ప్రశంసలే కాదు. కొంతమంది నెటిజన్లు హద్దులు దాటి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారట. ఈ కామెంట్ల వల్ల తాను తీవ్ర అసౌకర్యానికి గురయ్యానని, లైంగిక వేధింపులకు గురైనట్లు అనిపించిందని ఆయన తాజాగా వెల్లడించారు. తనపై వస్తున్న సోషల్ మీడియా కామెంట్ల గురించి తొలిసారి బహిరంగంగా స్పందించారు. అంతేకాదు, మహిళలు బయటకు వెళ్లినప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు ఎదురైతే ఎంత బాధపడతారో కూడా వివరించారు.
సోషల్ మీడియా కామెంట్లపై స్పందించిన జెన్ జెడ్ బాబా
బృందావన్‌కు చెందిన శ్రీ స్వామి శాశ్వత్ ఆచార్య జీ మహారాజ్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు ఎదురైన అనుభవాలను చెప్పుకున్నారు. సోషల్ మీడియాలో చాలామంది తన రూపాన్ని, ముఖ్యంగా తన కళ్లను ప్రశంసిస్తున్నారని చెప్పారు. అయితే కొందరు మాత్రం వ్యక్తిగత హద్దులు దాటి కామెంట్లు చేస్తున్నారని తెలిపారు. మొదట్లో ఇలాంటి వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోకపోయినా, కొంతమంది చేసే కామెంట్లు మర్యాద పరిధిని దాటిపోతున్నాయని చెప్పారు. దీంతో తాను అసౌకర్యంగా ఫీలయ్యానని వెల్లడించారు.
ALSO READ : మేనకోడలిపై అత్యాచారం చేసి చంపిన వ్యక్తిని...
'నా కళ్ల గురించి కూడా హద్దులు దాటి కామెంట్లు చేస్తున్నారు'
ఇంటర్వ్యూలో యాంకర్ ఆయన రూపం గురించి సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లను ప్రస్తావించారు. ముఖ్యంగా ఆయన కళ్లను ఉద్దేశించి కొంతమంది 'పద్మ నేత్రాలు' అంటూ కామెంట్లు చేస్తున్న విషయాన్ని అడిగారు. అప్పుడు యాంకర్ ఒక ఆసక్తికరమైన ప్రశ్న వేశారు. బహిరంగ ప్రదేశాల్లో మహిళలు ఇలాంటి కామెంట్లు, వెకిలి మాటలు ఎదుర్కొన్నప్పుడు ఎంత ఇబ్బందిగా ఫీలవుతారో ఇప్పుడు మీకు అర్థమవుతోందా ? అని ప్రశ్నించారు.
దీనికి శాశ్వత్ ఆచార్య స్పందిస్తూ.. తాను ఎదుర్కొన్న అనుభవాలతో పోలిస్తే, బయట రోడ్లపై మహిళలు ఎదుర్కొనే వేధింపులు చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పారు. తనపై వస్తున్న కామెంట్లలో కొన్నింటికే తాను ఇంత ఇబ్బందిగా ఫీలవుతున్నానని, మరి మహిళలు ప్రతిరోజూ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటే ఎంత బాధపడతారో అర్థం చేసుకోవచ్చని అన్నారు. మహిళలపై బహిరంగ ప్రదేశాల్లో చేసే అసభ్యకరమైన వ్యాఖ్యలు చాలా బాధాకరమని పేర్కొన్నారు. తనకు ఎదురైన అనుభవం మహిళలు ఎదుర్కొనే వేధింపుల్లో చాలా చిన్నవి మాత్రమేనని అభిప్రాయపడ్డారు.
కామెంట్లు అన్ని హద్దులు దాటాయి..
గతంలో తనపై వస్తున్న కొన్ని కామెంట్ల గురించి మాట్లాడుతూ తాను వేధింపులకు గురైనట్లు భావించానని శాశ్వత్ ఆచార్య పేర్కొన్నారు. తాజాగా ఇదే విషయంపై యాంకర్ మరోసారి ప్రశ్నించగా ఆయన స్పష్టంగా స్పందించారు. కొంతమంది నెటిజన్లు చేసే వ్యాఖ్యలు సాధారణ ప్రశంసల పరిధిని దాటి పోయాయని చెప్పారు. అవి తనను తీవ్ర అసౌకర్యానికి గురిచేశాయని, మర్యాదకు సంబంధించిన అన్ని హద్దులను దాటేశాయని వెల్లడించారు.
సోషల్ మీడియాలో ఎవరి గురించి ఏ కామెంట్ పడితే అది చేయడం సరైన పద్ధతి కాదని ఆయన మాటల ద్వారా స్పష్టమవుతోంది. ఒక వ్యక్తి పాపులర్ అయ్యారని, అందరూ తమకు నచ్చినట్లు వ్యాఖ్యలు చేయవచ్చని అనుకోవడం తప్పని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.
అసలు ఎవరీ శాశ్వత్ ఆచార్య?
శ్రీ స్వామి శాశ్వత్ ఆచార్య జీ మహారాజ్ ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌కు చెందిన యువ ఆధ్యాత్మిక వక్త. తన ఇన్స్టాగ్రామ్ బయోలో తనను తాను 'యువ భాగవత కథా వాచక్'గా పరిచయం చేసుకున్నారు. అలాగే బృందావన్‌లోని శ్రీధామ్ గోదా విహార్ మందిర్ పీఠాధీశ్వరుడిగా కూడా ఆయన గుర్తింపు పొందారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, మతపరమైన సమావేశాలు, భాగవత ప్రవచనాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.
ఆయనకు యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. అందులో ఆధ్యాత్మిక ప్రసంగాలు, మతపరమైన అంశాలపై ప్రవచనాలు, వివిధ కోర్సులకు సంబంధించిన వీడియోలు ఉన్నాయి. వీటి ద్వారా తన ఫాలోవర్స్ కి ఆధ్యాత్మిక విషయాలను వివరిస్తుంటారు.
జెన్ జెడ్ బాబా అని ఎందుకు పిలుస్తున్నారు?
సాధారణంగా బాబాలు, ఆధ్యాత్మిక గురువులు అంటే వయసు పైబడినవారే గుర్తుకొస్తారు. కానీ శాశ్వత్ ఆచార్య వయసు కేవలం 19 ఏళ్లు మాత్రమే. ఇంత చిన్న వయసులో ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తూ, మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటుండటంతో ఆయన ప్రత్యేకంగా నిలిచారు. దీనికి తోడు ఆయన యవ్వన రూపం, ఆకర్షణీయమైన కళ్లు సోషల్ మీడియాలో నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి. ఆయన ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లు సరదాగా 'జెన్ జెడ్ బాబా' అని పిలవడం మొదలుపెట్టారు.
ఆయన పోస్టుల కింద కొందరు ప్రశంసలు కురిపిస్తుంటే, మరికొందరు సరదా కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరు ఆయనను చూసి తమకు కూడా ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతోందంటూ చమత్కరిస్తున్నారు. అయితే ఈ సరదా కామెంట్ల మధ్య కొందరు వ్యక్తిగత హద్దులు దాటి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
సోషల్ మీడియాలో ఒక వ్యక్తి పాపులర్ అయితే అతనిపై ప్రశంసలు, విమర్శలు రావడం సహజం. కానీ వ్యక్తిగత హద్దులు దాటి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం మాత్రం సరైనది కాదు. శాశ్వత్ ఆచార్యకు ఎదురైన అనుభవం కూడా ఇదే విషయాన్ని మరోసారి చర్చకు తెచ్చింది. మహిళలు ఎదుర్కొనే వేధింపుల తీవ్రతను కూడా ఆయన తన అనుభవంతో పోల్చి వివరించడం ఇప్పుడు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
