హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్‌.. 578 మందిపై కేసులు

హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్‌.. 578 మందిపై కేసులు

హైదరాబాద్న సిటీలో మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై పోలీసులు చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో భారీగా పట్టుబట్టారు. నవంబర్ 6, 7 తేదీల్లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఏకంగా 578 మంది వాహనదారులు దొరికారు.

పట్టుబడిన వారిలో అత్యధికంగా ద్విచక్ర వాహనదారులు ఉన్నారు. మొత్తం 578 మందిలో 495 మంది బైక్‌ రైడర్లు, 55 మంది కార్లలో ప్రయాణిస్తున్నవారు, మరో 28 మంది త్రిచక్ర వాహనదారులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

BAC స్థాయిల వారీగా కేసుల వివరాలు

పట్టుబడిన వాహనదారుల్లో రక్తంలో మద్యం శాతం Blood Alcohol Concentration (BAC) ఆధారంగా వివరాలు ఇలా ఉన్నాయి.

  • 30-50 BAC పరిధిలో 115 మంది
  • 51-100 BAC పరిధిలో 257 మంది
  • 101-150 BAC పరిధిలో 111 మంది
  • 151-200 BAC పరిధిలో 52 మంది
  • 201-250 BAC పరిధిలో 27 మంది
  • 251-300 BAC పరిధిలో 11 మంది
  • 300కు పైగా BAC నమోదైన వారు ఐదుగురు.

ఈ వివరాలను పరిశీలిస్తే అత్యధికంగా 51-100 BAC పరిధిలో 257 మంది పట్టుబడటం గమనార్హం.


భారతదేశంలో వాహనాలు నడిపే వారికి అనుమతించిన గరిష్ఠ రక్తంలో మద్యం పరిమితి 100 మిల్లీలీటర్ల రక్తానికి 30 మిల్లీగ్రాములు (0.03 శాతం). ఈ పరిమితిని మించి మద్యం సేవించి వాహనం నడిపితే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ఇతరుల ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మద్యం సేవించిన తర్వాత డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.