హింస జరుగుతుంటే జనాభా లెక్కలేంటి.. 2027 వరకు సెన్సస్ వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశం

హింస జరుగుతుంటే జనాభా లెక్కలేంటి.. 2027 వరకు సెన్సస్ వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశం

ఒకవైపు తీవ్రమైన హింస జరుగుతోంది. ఊర్లకు ఊర్లే ఖాళీ అయ్యాయి.. కొన్ని కుటుంబాలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి. ఇలాంటి సందర్భంలో జనాభా లెక్కలేంటి.. వాయిదా వేయండి అంటూ మణిపూర్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2027 ఏప్రిల్ 30 వరకు సెన్సస్ వాయిదా వేయాల్సిందిగా ఆదేశించింది. 

వచ్చే ఏప్రిల్ 30 వరకు జనాభా లెక్కలు వాయిదా వేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వంతో పాటు జనాభా లెక్కల కమిషనర్, రిజస్ట్రార్ జనరల్ కు  ఆదేశాలు జారీ చేసింది. 

మణిపూర్ లో అల్లర్ల కారణంగా రోజూ వారి జీవితాలు చెల్లాచెదురయ్యాయి. కుటుంబాలు వలసలు వెళ్లాయి. గ్రామాల పరిస్థితులే మారిపోయాయి. కొన్ని ప్రాంతాలు నిర్మాణుష్యంగా మారిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో జనభా లెక్కలు తీసి డేటాను ఎలా ప్రజెంట్ చేస్తారని ప్రశ్నించింది. 

మణిపూర్ లో గ్రామాలు విడిపోయాయి.. ఇండ్లు మూతపడ్డాయి.. రోడ్లు డ్యామేజ్ అయ్యాయి.. కొన్ని ప్రదేశాల్లో జనాలు ఉన్నారా లేరా అనే పరిస్థితి. ఇలాంటి సంద్భంలో జనాభా లెక్కలు తీస్తే సరైన కౌంట్ వస్తుందా అని వాధించారు. దీనితో ఏకీభవించిన కోర్టు.. లెక్కలను వాయిదా వేయాలని సూచించింది. 

అల్లర్ల కారణంగా గ్రామాలు, పట్టణాల నుంచి వెళ్లి కొందరు కొండ ప్రాంతాల్లో అనధికారికంగా గ్రామాలను ఏర్పాటు చేసుకున్నారు. మరోవైపు బంగ్లా దేశ్ వలసవాదులు ప్రవేశించారు. స్థానిక మహిళలను పెళ్లి చేసుకున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకోకుండా లెక్కలు తీయడం సరైన పద్ధతి కాదని కోర్టు పేర్కొంది. 

మరోవైపు మణిపూర్ లో జనాభా లెక్కలను వ్యతిరేకిస్తూ గత కొన్నాళ్లుగా ఆందోళనలు చేస్తున్నారు స్థానికులు. తమ జీవితాలు ఛిన్నాభిన్నం అయ్యాయని.. గ్రామాలు చాలా వరకు ఖాళీ అయ్యాయని పేర్కొంటున్నారు. మణిపూర్ లో శాంతి స్థాపన చేసి లెక్కలు తీయాలని డిమాండ్ చేస్తున్నారు.