- పందిళ్ల శివారులో ఘటన
హుస్నాబాద్, వెలుగు: పండుగ పూట హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా ఎదురెదురుగా కారు, ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో తండ్రీకూతుళ్లు స్పాట్లో మృతిచెందగా, మరో ఇద్దరికి గాయాలైన ఘటన సోమవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిళ్ల శివారులో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్‌కు చెందిన పైడిపల్లి శ్రీకాంత్ (33), భార్య స్వాతి, కూతురు మహాన్వి (9), కొడుకు శ్రీహాన్‌తో కలిసి హైదరాబాద్ నుంచి కారులో స్వగ్రామానికి బయలుదేరారు.
పందిళ్ల శివారుకు రాగానే ఎదురుగా వచ్చిన ట్రాక్టర్‌ను కారు బలంగా ఢీకొట్టింది. కారులో ఇరుక్కుపోయిన శ్రీకాంత్, మహాన్వి తీవ్ర గాయాలతో స్పాట్లో మృతి చెందారు. గాయపడిన స్వాతిని స్థానికులు, పోలీసులు కరీంనగర్‌కు తరలించారు. శ్రీహాన్ స్వల్ప గాయాలయ్యాయి. ట్రాక్టర్ డ్రైవర్ గణేశ్‌కు కాలు విరిగినట్లు సమాచారం. సమాచారం అందుకున్న హుస్నాబాద్ సీఐ శ్రీధర్, ఎస్సై లక్ష్మారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుడి అన్న సతీశ్ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన స్వాతికి మెరుగైన వైద్యం అందించాలని ఆఫీసర్లను కోరారు.
