- ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం
- డేటా ఇంటెలిజెన్స్, ఏఐ రంగాల్లో సేవలు.. 275 మందికి ఉద్యోగాలు
- రాబోయే 5 నుంచి 7 ఏండ్లలో 100 మిలియన్ డాలర్ల పెట్టుబడి
- వచ్చే ఏడాది మరో 100 జీసీసీల ఏర్పాటే లక్ష్యమని వెల్లడి
- హైదరాబాద్‌లో స్ప్లాష్ బీఐ జీసీసీ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి
హైదరాబాద్, వెలుగు: ఐటీ, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) హబ్‌గా హైదరాబాద్ జోరు కొనసాగిస్తోంది. తాజాగా అమెరికాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ సంస్థ ‘స్ప్లాష్ బీఐ’ తన నూతన జీసీసీ ఆఫీస్‌ను ఏర్పాటు చేసింది. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో సుమారు 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ఈ కేంద్రాన్ని సోమవారం ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం హైదరాబాద్‌లో 515కు పైగా జీసీసీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయని, వీటి ద్వారా దాదాపు మూడు లక్షల మందికి పైగా టెక్ నిపుణులు ఉపాధి పొందుతున్నారని తెలిపారు. గతేడాది దేశంలోనే అత్యధికంగా 70కి పైగా కొత్త జీసీసీలు హైదరాబాద్‌లోనే ప్రారంభం కావడం నగర సత్తాకు నిదర్శనమన్నారు. ఇదే ఊపును కొనసాగిస్తూ, వచ్చే ఏడాదిలో కొత్తగా మరో 100 జీసీసీలను హైదరాబాద్‌కు రప్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు. నగరంలోని జీసీసీలను కేవలం సంప్రదాయ బ్యాక్ -ఆఫీస్ సేవలకు మాత్రమే పరిమితం చేయబోమని పేర్కొంటూ.. ప్రపంచ స్థాయి ఉత్పత్తుల రూపకల్పన, ఉన్నత స్థాయి పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణలకు కేంద్రాలుగా వాటిని తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.
హైదరాబాద్‌లో 100 మిలియన్ డాలర్ల పెట్టుబడి..
అమెరికాలోని జార్జియా రాష్ట్రం డులూత్ కేంద్రంగా సేవలందిస్తున్న స్ప్లాష్‌బీఐ.. ప్రపంచవ్యాప్తంగా 39 దేశాల్లో 500కు పైగా ఎంటర్‌ప్రైజ్ సంస్థలకు ఎంటర్‌ప్రైజ్ డేటా ఇంటెలిజెన్స్, బిజినెస్ అనలిటిక్స్, ఏఐ సేవలను అందిస్తోందని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. రాబోయే 5 నుంచి 7 ఏండ్లలో హైదరాబాద్‌లో ఈ సంస్థ 100 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.840 కోట్లకు పైగా) పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం హర్షణీయమన్నారు.
హైదరాబాద్ కేంద్రంగా అత్యాధునిక డేటా ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్‌తో పాటు ‘స్ప్లాష్ ఏఐ’ సామర్థ్యాలనూ అభివృద్ధి చేయనున్నారని, దీని ద్వారా స్థానికంగా 275 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, స్ప్లాష్ బీఐ సీఈవో నవీన్ మిగ్లానీ, సంస్థ ప్రెసిడెంట్, సీటీవో కిరణ్ రెడ్డి పాశం, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.
