- టాటా మోటార్స్ టాప్
- మహీంద్రాకు రెండో స్థానం
న్యూఢిల్లీ: దేశంలో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ జోరందుకుంటోంది. పెరుగుతున్న ఇంధన ధరలు, పర్యావరణంపై అవగాహన, కొత్త మోడళ్ల రాకతో వినియోగదారులు విద్యుత్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. 2026 అక్టోబర్‌లో దేశవ్యాప్తంగా మొత్తం 37,049 ఎలక్ట్రిక్ కార్లు రిజిస్టర్ అయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో నమోదైన 20,994 యూనిట్లతో పోలిస్తే 76.47 శాతం వృద్ధి నమోదైంది. సెప్టెంబర్‌లో నమోదైన 36,108 యూనిట్లతో పోల్చినా 2.61 శాతం పెరుగుదల కనిపించింది. దీంతో దేశీయ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ వరుసగా వృద్ధి బాటలో పయనిస్తోంది. ఈ విభాగంలో టాటా మోటార్స్ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది.
అక్టోబర్‌లో 14,669 కార్లను విక్రయించి అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. గత ఏడాది ఇదే నెలలో అమ్మిన 8,259 యూనిట్లతో పోలిస్తే 77.61 శాతం వృద్ధి సాధించింది. సెప్టెంబర్‌తో పోలిస్తే అమ్మకాల్లో స్వల్పంగా 0.82 శాతం తగ్గుదల నమోదైంది. మహీంద్రా 8,538 కార్ల విక్రయాలతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. వార్షికంగా 85.65 శాతం, నెలవారీగా 9.74 శాతం వృద్ధి నమోదు చేసింది. ఎంజీ మోటార్ 5,939 కార్ల అమ్మకాలతో మూడో స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే 10.80 శాతం, సెప్టెంబర్‌తో పోలిస్తే 13.30 శాతం వృద్ధి సాధించింది.
విన్‌ఫాస్ట్.. వెరీ ఫాస్ట్
భారత మార్కెట్లోకి ఇటీవలే ప్రవేశించిన వియత్నాం ఎలక్ట్రిక్ వెహికల్స్ కంపెనీ విన్‌ఫాస్ట్ అక్టోబర్‌లో 2,571 కార్లను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో నమోదైన 142 యూనిట్లతో పోలిస్తే భారీ వృద్ధి సాధించింది. అయితే నెలవారీగా అమ్మకాలు 13.26 శాతం తగ్గాయి. కియా 1,395 కార్లతో 85.50 శాతం వార్షిక వృద్ధి నమోదు చేసింది. మారుతీ సుజుకీ 1,200 కార్లను విక్రయించగా, సెప్టెంబర్‌తో పోలిస్తే 8.70 శాతం పెరుగుదల సాధించింది.
హ్యుందాయ్ 760, బీవైడీ 737 కార్ల అమ్మకాలు నమోదు చేశాయి. లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో బీఎండబ్ల్యూ 462 కార్ల విక్రయాలతో ముందుండగా, టెస్లా 291 కార్లను విక్రయించింది. గత ఏడాది అక్టోబర్‌తో పోలిస్తే టెస్లా అమ్మకాలు 627.50 శాతం పెరిగాయి. మొత్తంగా చూస్తే దేశంలో ఎలక్ట్రిక్ కార్లకు పెరుగుతున్న ఆదరణ వాహన తయారీ సంస్థలకు కొత్త అవకాశాలను కల్పిస్తోంది. రాబోయే రోజుల్లో కొత్త మోడళ్లు, మెరుగైన ఛార్జింగ్ సదుపాయాలు, బ్యాటరీ ధరల తగ్గింపు ఈ మార్కెట్ వృద్ధికి మరింత దోహదపడే అవకాశం ఉంది.
