- ఏఐతో పలు రకాల సేవలు
- మళ్లీ క్యాన్సర్ కవర్, హెల్త్ షీల్డ్ పాలసీలు
- సీఈఓ దొరైస్వామి వెల్లడి
న్యూఢిల్లీ: రాబోయే ఐదేళ్లలో సంస్థ మరింత వేగంగా ఎదిగేందుకు ఎల్ఐసీ ఏర్పాట్లు చేస్తోంది. ఏఐ, డిజిటల్ టెక్నాలజీలతో ఆధునీకరించడంతో పాటు వినియోగదారుల అవసరాలకు ప్రాధాన్యం ఇచ్చేలా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది. సంస్థ విశ్వసనీయత, మార్కెట్లో అగ్రస్థానాన్ని కొనసాగిస్తూనే ఈ మార్పులు చేపట్టనున్నట్లు ఎండీ, సీఈఓ దొరైస్వామి తెలిపారు. ప్రైవేటు బీమా సంస్థల నుంచి పోటీ పెరుగుతున్న నేపథ్యంలో కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా కొత్త పాలసీలను అందించడంపై దృష్టి సారించనుంది.
ప్రస్తుతం పొదుపు, పెన్షన్, రక్షణ, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ (యులిప్స్) విభాగాల్లో ఎల్ఐసీకి చాలా పాలసీలు ఉన్నాయి. యువతలో హామీతో కూడిన రాబడులు, స్థిరమైన ఆదాయం అందించే పాలసీలకు ఆదరణ పెరుగుతోందని దొరైస్వామి పేర్కొన్నారు. టర్మ్ ఇన్సూరెన్స్ సహా రక్షణ బీమా విభాగాన్ని మరింత విస్తరించనున్నారు. మధ్యతరగతి ప్రజల కోసం ప్రత్యేక టర్మ్ పాలసీని తీసుకొచ్చినట్లు తెలిపారు. క్యాన్సర్ కవర్, హెల్త్ షీల్డ్ పాలసీలను కూడా తిరిగి ప్రవేశపెట్టారు.కస్టమర్ సేవలు, అండర్ రైటింగ్, మోసాల గుర్తింపు, క్లెయిమ్‌ల పరిష్కారంలో ఏఐని వాడనున్నారు.
