హైదరాబాద్ లో నీటిసమస్యకు పరిష్కారం: గోదావరి అదనపు జలాల పనులు పరిశీలన

హైదరాబాద్ లో నీటిసమస్యకు పరిష్కారం:  గోదావరి అదనపు జలాల పనులు పరిశీలన

హైదరాబాద్ లో నీటి సమస్య పరిష్కారం కోసం గోదావరి అదనపు జలాల అను సంధాన పనులను ఈ నెల 15 లోగా పూర్తి చేయాలని అధికారులకు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి  సూచించారు.  సింగూరు, మంజీరా జలాలు తగ్గుతున్నందున  ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై జలమండలి అధికారులు దృష్టి సారించారు. 

హైదరాబాద్‌కు రోజుకు 40 ఎంజీడీల గోదావరి అదనపు జలాల తరలింపునకు చర్యలు తీసుకుంటున్నారు.  ఘన్‌పూర్ వద్ద పైప్‌లైన్ అనుసంధాన పనులను జలమండలి ఎండీ అశోక్ రెడ్డి పరిశీలించారు.   రెండు వైపుల నుంచి సమాంతరంగా పైప్‌లైన్ నిర్మాణ పనులు చేపట్టాలని ఆదేశించారు. 24 గంటల పాటు నిరంతరాయంగా పనులు నిర్వహించాలని సూచించారు. 

రాత్రివేళ పనుల కోసం ఫ్లడ్‌లైట్లు  ఏర్పాటు చేయాలని ఆదేశించారు.  పైప్‌లైన్ అనుసంధానానికి కీలకమైన రోడ్డు క్రాసింగ్ పనులకు ప్రాధాన్యత ఇస్తున్నారు.  రెండు మూడు రోజుల్లో రోడ్డు క్రాసింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.  అదనంగా రెండు మూడు ప్రత్యేక కార్మిక బృందాలను రంగంలోకి దించాలని ఎండీ అశోక్ రెడ్డి సూచిస్తున్నారు.మిషన్ భగీరథ, అటవీశాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే ఇతర ప్రాంతాల్లో పనులు తాత్కాలికంగా నిలిపివేసి యంత్రాలు, సిబ్బందిని వినియోగించాలన్నారు.