సమ్మర్‌లో ఐపీఎల్ వద్దు.. జనవరిలో జరపాలి.. కేకేఆర్ సహ యజమాని పోస్ట్ వైరల్!

సమ్మర్‌లో ఐపీఎల్ వద్దు.. జనవరిలో జరపాలి.. కేకేఆర్ సహ యజమాని పోస్ట్ వైరల్!

ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ లీగ్ అయిన ఐపీఎల్ (IPL 2027) సమయాన్ని మార్చాలనే డిమాండ్ ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో సంచలనంగా మారింది. సాధారణంగా మార్చి చివరి వారం నుంచి మే నెలాఖరు వరకు కొనసాగే ఈ మెగా లీగ్‌ను వేసవికాలం నుంచి తీసి జనవరి నెలకే మార్చాలంటూ ప్రముఖుల నుంచి ప్రతిపాదనలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా, తాజాగా కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knight Riders) సహ యజమాని, ప్రముఖ నటి జూహీ చావ్లా (Juhi Chawla) చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.

జూహీ చావ్లా సోషల్ మీడియా పోస్ట్: 

భారత్‌లో తీవ్రమైన వేసవి ఉక్కపోత, ఎండల నడుమ ఆటగాళ్లు, ఫ్యాన్స్ పడే ఇబ్బందుల గురించి ప్రస్తావిస్తూ జూహీ చావ్లా ఐసీసీ (ICC), బీసీసీఐ (BCCI) విండోపై కీలక వ్యాఖ్యలు చేశారు. క్రికెట్ క్యాలెండర్‌లో తన స్థానాన్ని వెతుక్కోవాల్సిన అవసరం ఐపీఎల్‌ (IPL)కు లేదు.. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుని దక్కించుకుంది. ఈ మెగా టోర్నీ.. మరి ఇంత పెద్ద టోర్నమెంట్‌ను ఎండాకాలంలో ఎందుకు నిర్వహించాలి? ఏప్రిల్ - మే నెలలకు బదులు జనవరిని ఎందుకు ఎంచుకోకూడదు? జనవరి అయితే మంచి వాతావరణ పరిస్థితులు ఉంటాయి.. మెరుగైన క్రికెట్ సాధ్యమవుతుంది.. అందరికీ అద్భుతమైన అనుభవం లభిస్తుంది. ఐపీఎల్ పరిమాణం పెరిగినప్పుడు క్యాలెండర్ కూడా మారాల్సిందేనని జూహీ చావ్లా డిమాండ్ చేసింది. 

లలిత్ మోడీ నుంచి జూహీ చావ్లా వరకు.. ఎందుకీ డిమాండ్:
 
* ఆటగాళ్ల ఫిట్‌నెస్, గాయాలు: ఏప్రిల్, మే నెలల్లో భారత్‌లో ఉష్ణోగ్రతలు 40°C దాటుతాయి. ఈ తీవ్రమైన వేడిలో 60 రోజులకు పైగా మ్యాచ్‌లు ఆడటం వల్ల ఆటగాళ్లు డీహైడ్రేషన్‌కు గురికావడంతో పాటు గాయాల పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

* జనవరి విండో అనుకూలతలు: జనవరి నెలలో భారతదేశం అంతటా ఆహ్లాదకరమైన చల్లని వాతావరణం ఉంటుంది. ఇది ఫాస్ట్ బౌలర్లకు, బ్యాటర్లకు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి అనుకూలిస్తుంది.

* ఐసీసీ షెడ్యూల్ సవాల్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ (FTP) ప్రకారం జనవరిలో విదేశీ బోర్డుల ద్వైపాక్షిక సిరీస్‌లు, ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్ (BBL), సౌతాఫ్రికా T20 (SA20) లీగ్‌లు ఉంటాయి. దీంతో జనవరికి ఐపీఎల్‌ను మార్చడం బీసీసీఐకి అతిపెద్ద సవాలుగా మారనుంది. వేసవి వేడికి చెక్ పెడుతూ బీసీసీఐ నిజంగానే ఐపీఎల్ విండోను జనవరికి మారుస్తుందో లేదా అనేది చూడాల్సి ఉంది. 

మరిన్ని వార్తలు