చైనా స్పై వివాదం: ఎన్వీడియా సీఈఓ అఫైర్ కారణంగా ఇన్వెస్టర్లకు ఒక్క రోజే రూ.17లక్షల కోట్లు లాస్!

చైనా స్పై వివాదం: ఎన్వీడియా సీఈఓ అఫైర్ కారణంగా ఇన్వెస్టర్లకు ఒక్క రోజే రూ.17లక్షల కోట్లు లాస్!

AI ప్రపంచాన్ని శాసిస్తున్న టెక్ దిగ్గజం 'ఎన్వీడియా' షేర్ మార్కెట్లో ఊహించని కుదుపునకు లోనైంది. ఆ కంపెనీ సీఈఓ జెన్సన్ హువాంగ్ పర్సనల్ లైఫ్ చుట్టూ కొనసాగుతున్న వివాదం.. అటు కంపెనీ షేర్లను, ఇటు ఇన్వెస్టర్ల సంపదను క్షణాల్లో ఆవిరి చేశాయి. చైనా గూఢచార సంస్థలతో సంబంధాలున్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ మహిళతో జెన్సన్ హువాంగ్ ఎఫైర్ నడిపారన్న వార్తలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ పరిణామంతో ఒక్కరోజే ఎన్వీడియా ఇన్వెస్టర్లు ఏకంగా రూ.17 లక్షల కోట్ల మేర భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది.

తన అఫైర్ గురించి బహిరంగంగా సీఈఓ అంగీకరించటంతో సోమవారం అమెరికా మార్కెట్లు ప్రారంభం కాగానే ఎన్వీడియా షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. ప్రీ-మార్కెట్ ట్రేడింగ్ నుంచే పతనం ప్రారంభం కాగా.. మార్కెట్ల ఓపెనింగ్ నాటికి షేర్ విలువ సుమారు 8 శాతం పడిపోయి 171.80 డాలర్లకు ట్రేడ్ అయింది. గత అక్టోబర్ నెలలో రికార్డు స్థాయి గరిష్టాలను తాకిన ఈ స్టాక్.. సీఈఓ వివాదం పుణ్యమా అని భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన చిప్‌మేకర్‌గా కొనసాగుతున్న ఎన్వీడియాను ఈ పరిణామాలు ఒక్కసారిగా డిఫెన్స్‌లోకి నెట్టేశాయి. ప్రస్తుత మార్కెట్ అంచనాల ప్రకారం కంపెనీ విలువ సుమారు 4 ట్రిలియన్ డాలర్ల వద్ద ఉంది. దీంతో జెన్సన్ హువాంగ్ పేరు టాప్ 10 రిచ్చెస్ట్ లిస్టు నుంచి మాయమైపోయింది.

ఈ ఊహించని పరిణామానికి ప్రధాన కారణం.. సింగపూర్‌కు చెందిన ఓ డేటా సెంటర్ సంస్థలో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసిన ఆలిస్ హువాంగ్ అనే చైనీస్ మహిళతో జెన్సన్ హువాంగ్‌కు ఉన్న సంబంధమే. ఎన్వీడియాతో వ్యాపార సంబంధాలున్న ఆ మహిళ.. కీలక సమాచారాన్ని బీజింగ్ నిఘా వర్గాలకు చేరవేసిందనే ఆరోపణలు వైరల్ అవుతున్నాయి. అమెరికన్ ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు, హువాంగ్ ఆమెతో సన్నిహిత సంబంధాలు కొనసాగించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే ఈ ఆరోపణలను చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది. ఇది బీజింగ్‌పై కావాలని చేస్తున్న దుష్ప్రచారమని కొట్టిపారేసింది. ఈ వివాదం కారణంగా జెన్సన్ హువాంగ్ విడాకుల కోసం దాదాపు రూ.7 లక్షల కోట్లు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందట.

ఏదేమైనా టెక్ ప్రపంచంలో తిరుగులేని రారాజుగా ఉన్న ఎన్వీడియా సీఈఓపై వచ్చిన ఈ గూఢచార ఆరోపణలు కంపెనీ భవిష్యత్తుపై నీలి నీడలు కమ్మేలా చేశాయి. ఇన్వెస్టర్లలో నెలకొన్న ఆందోళన కారణంగా భారీగా సంపద కరిగిపోయింది. రాబోయే రోజుల్లో ఈ విచారణ ఎన్వీడియా వ్యాపార సామ్రాజ్యాన్ని, మార్కెట్ స్థానాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని వార్తలు