69 ఏళ్ల వయసులో అదిరిపోయే సాహసం.. ఒంటికి నిప్పంటించుకుని.. 60 అడుగుల ఎత్తు నుంచి దూకిన వృద్ధుడు!

69 ఏళ్ల వయసులో అదిరిపోయే సాహసం.. ఒంటికి నిప్పంటించుకుని.. 60 అడుగుల ఎత్తు నుంచి దూకిన వృద్ధుడు!

వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమేనని నిరూపిస్తున్నారు ఉత్తరప్రదేశ్‌కు చెందిన 69 ఏళ్ల రామ్‌ప్రసాద్ తివారీ. వృద్ధాప్యంలో సాధారణంగా విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో ఆయన ప్రదర్శించిన సాహస విన్యాసం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లా ఖుర్జాలో జరిగిన రామ్‌లీలా కార్యక్రమంలో తివారీ ఒళ్లు గగుర్పొడిచే ఫైర్ స్టంట్ చేశారు. తన ఒంటికి నిప్పంటించుకుని, సుమారు 60 అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకారు. ఈ సాహస విన్యాసానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తివారీ ప్రదర్శించిన ఈ విన్యాసం చూస్తుంటే ఆయన ధైర్యం, సాహసంపై చూసేవారిని ఆశ్చర్య పర్చింది. 69 ఏళ్ల వయసులోనూ ఇంతటి సాహసం చేయడం సాధారణ విషయం కాదని అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ విన్యాసం వెనుక దశాబ్దాల అనుభవం, సాధన, సంప్రదాయం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఆచారం దాదాపు 70 ఏళ్లుగా కొనసాగుతోందని, కార్యక్రమంలో నిర్దేశించిన భద్రతా ప్రమాణాలన్నీ పాటించామని బులంద్‌షహర్ పోలీసులు చెబుతున్నారు. 

నేటి యువతకు ఈ ఘటన ఒక సందేశాన్ని ఇస్తోంది. వయసు పెరిగిందని కలలను వదులుకోవాల్సిన అవసరం లేదని, పట్టుదలతో ముందుకు సాగితే ఏ వయసులోనైనా తమ ప్రతిభను ప్రదర్శించవచ్చని తివారీ ఉదాహరణ చెబుతోంది. జీవితంలో సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం, క్రమశిక్షణ, నిరంతర సాధన ఎంత ముఖ్యమో గుర్తుచేస్తోంది. అయితే, ఇలాంటి ఫైర్ స్టంట్స్ అత్యంత ప్రమాదకరమైనవి. సరైన శిక్షణ, నిపుణుల పర్యవేక్షణ, భద్రతా ఏర్పాట్లు లేకుండా ఎవరూ చేయకూడనివని కూడా గుర్తుంచుకోవాలి.