Mythological Roles: తరాలు మారినా మారని కష్టం.. ఎన్టీఆర్, యశ్ పౌరాణిక గెటప్స్ వెనుక ఇంత శ్రమ ఉందా?

Mythological Roles: తరాలు మారినా మారని కష్టం.. ఎన్టీఆర్, యశ్ పౌరాణిక గెటప్స్ వెనుక ఇంత శ్రమ ఉందా?

ఒకప్పుడు దుర్యోధనుడిగా ఎన్టీఆర్ ధరించిన మూడు కిలోల భారీ కిరీటం.. 35 కేజీల వరకు బరువున్న ఆభరణాలు, వస్త్రధారణను (Costumes) ధరించేవారు. ఇప్పుడు రామాయణంలో రావణుడిగా యశ్ ధరించిన 33 కిలోల బరువైన వస్త్రాభరణాలు.. కిరీటం ఒక్కటే 1.8 కిలోలు. ఇలా సినిమా కోసం, తమ పాత్రల రాజసం కోసం, ప్రేక్షకులను మైమరపించేలా కనిపించే పౌరాణిక పాత్రల వెనుక నటీనటులు పడే శ్రమ అంతా ఇంతా కాదు. ఒకప్పటి తెలుగు పౌరాణిక చిత్రాల్లో ఎన్టీఆర్ తనదైన ముద్ర వేస్తే.. ఇప్పుడు నితేశ్ తివారీ తెరకెక్కించిన ‘రామాయణం’లో రావణుడిగా యశ్ తనదైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకుంటున్నారు. తాజాగా యశ్ రావణుడి కాస్ట్యూమ్స్‌ బరువు, కిరీటం తయారీ వెనుక ఉన్న కష్టాన్ని కాస్ట్యూమ్ డిజైనర్ సానియా సర్ధారియా బయటపెట్టడంతో ఈ రెండు తరాల నటుల పౌరాణిక గెటప్స్ మరోసారి చర్చనీయాంశంగా మారాయి.

33 కిలోల వరకు రావణుడి వస్త్రాభరణాలు..

నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రామాయణం: పార్ట్ 1’లో యశ్ రావణుడిగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన లుక్ కోసం మేకర్స్ భారీ స్థాయిలో కసరత్తు చేశారు. ముఖ్యంగా రావణుడి రాజసం, వ్యక్తిత్వం, శక్తిసామర్థ్యాలు తెరపై ప్రతిబింబించేలా కాస్ట్యూమ్స్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. తాజాగా ఇండియా టుడేతో మాట్లాడిన కాస్ట్యూమ్ డిజైనర్, స్టైలిస్ట్ సానియా సర్ధారియా ఈ లుక్ వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను వెల్లడించారు. యశ్ ధరించిన చాలా కాస్ట్యూమ్స్ ఆభరణాలతో కలిపి 16 నుంచి 20 కిలోల వరకు బరువు ఉండేవని తెలిపారు.

అయితే కొన్ని ప్రత్యేకమైన అవుట్‌ఫిట్స్ మాత్రం ఏకంగా 30 నుంచి 33 కిలోల వరకు బరువు ఉండేవని చెప్పారు. ముఖ్యంగా లంకకు సంబంధించిన రావణుడి లుక్, ఆయన పెళ్లి దుస్తులు, శూర్పణఖ పెళ్లి సందర్భంగా ధరించిన కాస్ట్యూమ్స్ అత్యంత భారీగా రూపొందించారట. వీటిలోని ఆభరణాలు, అలంకరణలు, ఇతర డిజైన్ ఎలిమెంట్స్ అన్నీ కలిపి బరువును మరింత పెంచాయని సానియా వెల్లడించారు.

కిరీటం ఒక్కటే 1.8 కిలోలు.. తగ్గించడానికి ఎన్ని ప్రయోగాలో!

రావణుడి గెటప్‌లో అందరి దృష్టిని ఆకర్షించే ప్రధానమైన అంశం కిరీటం. యశ్ కోసం రూపొందించిన ఈ కిరీటం బరువు తగ్గించేందుకు డిజైనింగ్ టీమ్ చాలా ప్రయోగాలు చేసిందట. ముందుగా 3D మాక్ కిరీటాలను తయారు చేసి డిజైన్‌ను ఫైనలైజ్ చేశారట. ఆ తర్వాత అసలు రూపానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా బరువు తగ్గించేందుకు రివర్స్ ఇంజనీరింగ్ పద్ధతిలో అనేక మార్పులు చేశారు. అయినప్పటికీ కిరీటాన్ని 1.8 కిలోల కంటే తక్కువ బరువుకు తీసుకురావడం సాధ్యం కాలేదని సానియా చెప్పారు. తలపై నిరంతరం అంతటి బరువును మోయడం నటుడికి పెద్ద సవాలేనని ఆమె వివరించారు.

ఇక కిరీటంతో పాటు ఛాతీ భాగంలో ధరించే ఆర్మర్, భుజాలపై ఉండే ప్రత్యేక అలంకరణలు కూడా యశ్ కదలికలకు కొంత ఇబ్బంది కలిగించేవట. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో తల తిప్పడం, చేతులు కదపడం, వరుసగా టేక్స్ ఇవ్వడం కష్టంగా ఉండేదని తెలిపారు. అందుకే షూటింగ్ మధ్యలో కొన్ని భాగాలను తొలగించి యశ్‌కు కాస్త విశ్రాంతి కల్పించేవారని వెల్లడించారు.

రావణుడి లుక్‌లో శివభక్తి కనిపించేలా..

కేవలం భారీ ఆభరణాలు, కిరీటంతోనే రావణుడి రూపాన్ని పరిమితం చేయకుండా.. అతడి వ్యక్తిత్వంలోని విభిన్న కోణాలను ప్రతిబింబించేలా కాస్ట్యూమ్స్‌ను రూపొందించారు. ఆభరణాలు, యుద్ధ కవచాల మధ్య తేడా కనిపించకుండా రెండింటినీ కలిపి ప్రత్యేకమైన డిజైన్ చేశారు. రావణుడి శివభక్తిని ప్రతిబింబించేలా నాగుపాము, త్రిశూలం వంటి మోటిఫ్స్‌ను కూడా ఆ కాస్ట్యూమ్స్‌లో ఉపయోగించారు. లంక నిర్మాణ శైలి, శ్రీలంక ఆర్కిటెక్చర్‌ నుంచి సానియా తన పరిశోధనలో పలు అంశాలను తీసుకున్నట్లు చెప్పారు. ఈ డిజైన్స్ రావణుడి రాజసం, యోధుడి స్వభావం రెండింటినీ ప్రతిబింబించేలా ఉన్నాయని సానియా వెల్లడించారు.

యశ్‌పై కాస్ట్యూమ్స్ భారం.. సెట్లో మాత్రం ఫుల్ జోష్!

ఇంతటి బరువైన కాస్ట్యూమ్స్‌తో షూటింగ్ చేయడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే యశ్ మాత్రం ఈ విషయంలో చాలా ఓపికగా వ్యవహరించారని సానియా తెలిపారు. కిరీటం, భుజాలపై ఉండే పదునైన డిజైన్స్ కొన్నిసార్లు చురుక్కుమనిపించినా.. వాటినే సరదాగా మార్చుకుని యూనిట్ సభ్యులను ఆటపట్టించేవారట. తనకు గుచ్చుకున్న డిజైన్ ఇతరులకు కూడా తగిలేలా సరదాగా ఆటపట్టిస్తూ సెట్లో నవ్వులు పూయించేవారని ఆమె గుర్తుచేసుకున్నారు. కాస్ట్యూమ్స్ బరువు, సుదీర్ఘ షూటింగ్ గంటలతో అలసిపోయే పరిస్థితి ఉన్నప్పటికీ యశ్ ఎప్పుడూ టీమ్‌ను ఉత్సాహంగా ఉంచేవారని ప్రశంసించారు.

మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. రావణుడి పాత్రలోని విభిన్న వ్యక్తిత్వాలను ప్రతిబింబించేందుకు యశ్ ప్రతి అంశంపైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టారట. ఒక్కో వ్యక్తిత్వానికి ప్రత్యేకమైన వాయిస్‌ను కూడా సిద్ధం చేసుకున్నట్లు సానియా వెల్లడించారు. కాస్ట్యూమ్స్ విషయంలోనూ యశ్ ఇచ్చిన సూచనలు పాత్రకు మరింత సహజత్వాన్ని తీసుకొచ్చాయని ఆమె చెప్పారు.

రావణుడిగా యశ్‌కు ప్రశంసల వర్షం..

సినిమా విడుదలైనప్పటి నుంచి యశ్ పోషించిన రావణుడి పాత్ర సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, గంభీరమైన లుక్, ఇంటెన్స్ ఎక్స్‌ప్రెషన్స్, డైలాగ్ డెలివరీపై ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా రావణుడి ఇంట్రడక్షన్, జటాయువుతో తలపడే యాక్షన్ సీక్వెన్స్, పది తలల ఎపిసోడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించాయి. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సైతం యశ్ రావణుడి పాత్రలో భయంకరమైన, శక్తిమంతమైన స్క్రీన్ ప్రెజెన్స్ చూపించారని ప్రశంసించారు. సినిమా విజువల్స్‌తో పాటు ప్రధాన నటీనటుల పెర్ఫార్మెన్స్‌పై జక్కన్న ప్రశంసలు కురిపించారు. అయితే సినిమా మొత్తం మీద ఆడియన్స్ నుంచి మిక్సెడ్ టాక్ ఉన్నప్పటికీ.. యశ్ రావణుడి పాత్ర మాత్రం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఆయన పాత్రను ఎలా తీర్చిదిద్దారు? తెరపై ఎలా ఆవిష్కరించారు? అనే అంశాలపై సినీ అభిమానుల్లో ఆసక్తి కొనసాగుతోంది. ఈ క్రమంలోనే డిజైనర్ సానియా కీలక విషయాలు వెల్లడించారు.  

బాక్సాఫీస్ దగ్గర కూడా రామాయణం జోరు..

నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ‘రామాయణం: పార్ట్ 1’ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది.  ఫెమస్ ట్రేడ్ ట్రాకర్ సాక్‌నిల్క్ అంచనాల ప్రకారం.. తొలి ఐదు రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.663.90 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని వెల్లడించింది. ఈ భారీ ఎపిక్ లో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా కనిపించిన ఈ భారీ ప్రాజెక్ట్‌కు నితేశ్ తివారీ దర్శకత్వం వహించారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రానికి రెండో భాగాన్ని 2028 దీపావళి సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

అప్పట్లో ఎన్టీఆర్.. ఇప్పుడు యశ్..

ఇక పౌరాణిక పాత్రల కోసం నటులు పడే శ్రమ గురించి మాట్లాడుకుంటే ముందుగా గుర్తొచ్చే పేరు నందమూరి తారక రామారావు. 1977లో ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘దాన వీర శూర కర్ణ’లో ఆయన కర్ణుడు, శ్రీకృష్ణుడు, దుర్యోధనుడు (సుయోధనుడు)గా త్రిపాత్రాభినయం చేశారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా, రచయితగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ సినిమాలో దుర్యోధనుడి పాత్ర కోసం ఎన్టీఆర్ ప్రత్యేకంగా భారీ కిరీటాన్ని ధరించేవారు. రాగిపై బంగారు పూతతో తయారు చేసిన ఆ కిరీటం సుమారు మూడు కిలోల బరువు ఉండేదట. అంతటి బరువు ఉన్నప్పటికీ షూటింగ్ సమయంలో ఉదయం నుంచి రాత్రి వరకు దాన్ని తీయకుండా సెట్లోనే ఉండేవారని ఎన్టీఆర్ జీవిత చరిత్రకు సంబంధించిన కథనాల్లో ప్రస్తావించారు.

దాదాపు మూడు వారాల పాటు ఇదే విధంగా కొనసాగించారట. కిరీటం అడుగు భాగం నుదుటిపై ఒత్తిడి కలిగించడంతో చివరకు అక్కడ శాశ్వతమైన మచ్చ కూడా ఏర్పడిందని సమాచారం. ఒక్కో పాత్రకు మేకప్ వేయడానికి మూడు గంటలు, తొలగించడానికి రెండు గంటలు పట్టేదని.. అయినప్పటికీ కేవలం 43 రోజుల్లోనే ‘దాన వీర శూర కర్ణ’ను పూర్తి చేయడం అప్పట్లో విశేషంగా నిలిచింది. ముఖ్యంగా దుర్యోధనుడి పాత్రకు ఎన్టీఆర్ ఇచ్చిన రాజసం, గంభీరమైన సంభాషణలు, ఆహార్యం తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశాయి. నేటికీ ఆ పాత్రను గుర్తుచేసుకుంటే ఎన్టీఆర్ రూపమే కళ్లముందు కదలాడుతుంది.

తరాలు మారినా మారని కష్టం..

ఒకప్పుడు ఎన్టీఆర్ మూడు కిలోల కిరీటాన్ని రోజంతా ధరించి దుర్యోధనుడి పాత్రకు ప్రాణం పోస్తే.. ఇప్పుడు యశ్ 33 కిలోల వరకు బరువున్న కాస్ట్యూమ్స్‌తో రావణుడి పాత్రను తెరపై ఆవిష్కరిస్తున్నారు. అప్పట్లో అందుబాటులో ఉన్న టెక్నాలజీతో ఎన్టీఆర్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటే.. ఇప్పుడు మోడ్రన్ 3D డిజైనింగ్, అత్యాధునిక కాస్ట్యూమ్ టెక్నాలజీతో యశ్ లుక్‌ను సిద్ధం చేశారు. కాలం మారింది.. సినిమా మేకింగ్ మారింది.. టెక్నాలజీ మారింది. కానీ తెరపై ఒక పౌరాణిక పాత్రను అద్భుతంగా ఆవిష్కరించేందుకు నటులు పడే శ్రమ మాత్రం మారలేదని ఈ రెండు తరాల గెటప్స్ మరోసారి గుర్తు చేస్తున్నాయి..