సర్కారు స్కూళ్లలో సరికొత్త లైబ్రరీలు.. స్టేట్లో 1,138 బడుల్లో రీడింగ్ రూమ్స్ బలోపేతం

సర్కారు స్కూళ్లలో సరికొత్త లైబ్రరీలు.. స్టేట్లో 1,138 బడుల్లో రీడింగ్ రూమ్స్ బలోపేతం
  • న్యూస్ పేపర్స్, మ్యాగజైన్ల కోసం ఒక్కో బడికి నెలకు రూ.వెయ్యి 
  • వసతులు, పుస్తకాల కోసం రూ.15 వేల వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైమ్ గ్రాంట్  
  • మొత్తం రూ.1.70 కోట్లు విడుదల.. ఏఏపీసీ ఖాతాల్లో జమ 
  • లైబ్రరీ సంస్థల సెస్సు నిధులతో కార్యాచరణ, గైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్స్ రిలీజ్  

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు బడుల్లో విద్యార్థులకు చదువుతోపాటు పఠనాసక్తి, లోకజ్ఞానాన్ని పెంచేందుకు విద్యాశాఖ రీడింగ్ రూమ్స్​ బలోపేతానికి శ్రీకారం చుట్టింది. పబ్లిక్ లైబ్రరీస్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ సహకారంతో ఎంపిక చేసిన 1,138 స్కూళ్లలో సరికొత్తగా లైబ్రరీలను తీర్చిదిద్దాలని నిర్ణయించింది. జిల్లా గ్రంథాలయ సంస్థల వద్ద ఉన్న సెస్సు నిధుల నుంచి బడుల్లోని ‘అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ’ల (ఏఏపీసీ) బ్యాంక్ ఖాతాలకు ఇప్పటికే నిధులను బదిలీ చేశారు. ఈ నిధులతో వెంటనే రీడింగ్ రూమ్స్​ను ఆధునీకరించి అందుబాటులోకి తేవాలని డీఈవోలు, ఆర్జేడీలకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్​డాక్టర్ నవీన్ నికోలస్ తాజాగా గైడ్ లైన్స్ రిలీజ్ చేశారు. 

వన్ టైమ్ గ్రాంట్ రూ.15 వేలు.. 

రీడింగ్ రూమ్స్​లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, పుస్తకాల కొనుగోలు కోసం ఒక్కో బడికి ఒకేసారి రూ.15 వేల చొప్పున మొత్తం రూ.1.70 కోట్ల నిధులను మంజూరు చేశారు. ఈ గ్రాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో లైబ్రరీ గదులకు చిన్నపాటి మరమ్మతులు, పెయింటింగ్ లేదా సున్నం వేయించడం, అవసరమైన చోట విద్యుద్దీపాలు, ఫ్యాన్లు అమర్చడం లాంటి పనులు చేపట్టాలి. విద్యార్థులు, టీచర్లు చదువుకోవడానికి రీడింగ్ టేబుళ్లు, కుర్చీలు, పుస్తకాలను భద్రపరిచేందుకు బుక్ ర్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, అల్మారాలను సమకూర్చుకోవాలి. మిగిలిన నిధులతో విద్యార్థుల వయసుకు తగిన కథల పుస్తకాలు, ప్రముఖుల జీవిత చరిత్రలు, సైన్స్ సాహిత్యం, రిఫరెన్స్ పుస్తకాలతోపాటు టీచర్ల వృత్తిపరమైన అభివృద్ధికి ఉపయోగపడే విజ్ఞాన గ్రంథాలను నిబంధనల ప్రకారం సేకరించాల్సి ఉంటుంది. 

అయితే, లైబ్రరీ గదిలో అందరికీ స్పష్టంగా కనిపించేలా ‘తెలంగాణ పౌర గ్రంథాలయాల శాఖ సహకారంతో..’ అని తప్పనిసరిగా బోర్డు ఏర్పాటు చేయాలని అధికారులు స్పష్టం చేశారు. మంజూరైన నిధులను కేవలం లైబ్రరీ అవసరాలకే వాడాలని, జీతాలు, ఇతర ఖర్చులకు ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లించకూడదని హెచ్చరించారు. అభివృద్ధి పనులకు ముందు, తర్వాత తీసిన ఫొటోలతో పాటు యూసీలు అధికారులకు సమర్పించాలని, క్షేత్రస్థాయి విద్యాశాఖ అధికారులు పాఠశాలల్లో లైబ్రరీల పనితీరును నిరంతరం తనిఖీ చేస్తూ పర్యవేక్షించాలని డీఈవోలను ఆదేశించారు.
 
న్యూస్ పేపర్లకు నెలనెలా రూ.వెయ్యి.. 

రాష్ట్రంలో ఎంపిక చేసిన 1,138 బడుల్లో విద్యార్థులకు దినపత్రికలు, విజ్ఞానదాయక మేగజైన్లు అందించేందుకు ఒక్కో స్కూల్​కు ప్రతి నెలా రూ.వెయ్యి చొప్పున కేటాయించారు. స్కూల్ అవసరాలు, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా తెలుగు, ఇంగ్లిష్ దినపత్రికలతోపాటు కరెంట్ అఫైర్స్, సైన్స్, టెక్నాలజీ, సాహిత్యం, క్రీడలు, పర్యావరణం, జనరల్ నాలెడ్జ్ తదితర అంశాలకు సంబంధించిన విద్యా మేగజైన్లు, జర్నల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ మేగజైన్లు, పత్రికలన్నీ విద్యార్థులు, టీచర్లకు లైబ్రరీలో నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి.