- మూడున్నర కోట్ల మందికి ఏడాదికి సరిపడా స్టాక్
- రైతులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపు
హైదరాబాద్, వెలుగు: ఎల్‌నినో కరువు వచ్చినా రాష్ట్రంలో బియ్యానికి, తిండికి కరువు లేదని.. నీళ్లకే కష్టం ఉందని, అందువల్ల ఈ ఒక్క సీజన్‌లో వడ్లకు బదులు ఆరుతడి పంటలు వేయాలని రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. లగచర్లలో నిర్వహించిన “రైతన్నతో ఆత్మీయ సభ” లో సీఎం మాట్లాడారు. ‘‘ఈనాడు ఎల్ నినో వచ్చింది. కరువు వస్తే తిండికి, నీళ్లకు రెండింటికీ కష్టం ఉంటది.. కానీ మన దగ్గర తిండి గింజల సమస్య లేదు. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకా 12 నెలలకు సరిపోయే బియ్యాన్ని ఖజానాలో దాచిపెట్టిండు. రాష్ట్రంలోని 4 కోట్ల జనాభాలో 3 కోట్ల 50 లక్షల మందికి సరిపడా సన్న బియ్యం స్టాకు మన దగ్గరుంది. ఎవ్వరూ బియ్యం గురించి రంది పడొద్దు, ధర పెరిగిందని చింతించద్దు.. మేమిచ్చే సన్న బియ్యాన్ని మీ సంటి పిల్లలకు కడుపునిండా వండిపెట్టండి.. నీళ్లకు కరువు వచ్చింది కాబట్టి రైతులంతా ఆరుతడి పంటలే వేయాలి. ఒక సీజన్‌లో వడ్లు పండించకపోయినా నష్టం లేదు’’ అని సీఎం స్పష్టం చేశారు.
కొడంగల్‌లో విద్యావిప్లవం
కొడంగల్ నియోజకవర్గంలో రూ.10 వేల కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టామని సీఎం రేవంత్ వెల్లడించారు. గతంలో 10వ తరగతి దాటితే పైచదువుల కోసం తాండూరు, పరిగి, నారాయణపేట, పాలమూరు, హైదరాబాద్ పోవాల్సి వచ్చేదని, బతకడానికి పూణే, ముంబై నగరాలకు వలస పోయేవారన్నారు. పిల్లలను చదివించుకోవాలంటే కుటుంబాలు చెట్టుకొకరు, పుట్టకొకరుగా విడిపోయేవారని, జేబులో రూ.100 ఉండి మంచి భోజనం చేయాలన్నా తాండూరు పోవాల్సిన దుస్థితి ఉండేదన్నారు.
మంచి హోటల్, నాణ్యమైన చదువు చెప్పే బడి లేని కొడంగల్‌ను విద్యా నిలయంగా మారుస్తున్నామన్నారు. ఇప్పటికే మెడికల్ కాలేజ్, ఇంజినీరింగ్ కాలేజ్, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, పాలిటెక్నిక్ కాలేజ్, ఐటీఐ, ఏటీసీ (అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్), సైనిక్ స్కూల్ మంజూరు చేశామని, అన్ని మండలాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. నాణ్యమైన చదువు చదవాలంటే కొడంగల్‌కు వచ్చేలా విద్యా విప్లవం తెస్తున్నామని సీఎం తెలిపారు.
