- సిరీస్‌పై టీమిండియా గురి
- మ్యాచ్‌కు వర్షం ముప్పు!
- ఉ. 7.30 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో లైవ్
హామిల్టన్: ఓవైపు సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ ఫామ్‌పై విమర్శలు.. మరోవైపు చివరి రెండు మ్యాచ్‌లకు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అందుబాటులో ఉండటం లేదు.. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో మూడో వన్డేకు టీమిండియా రెడీ అయ్యింది. గాయాలతో ఇబ్బందిపడుతున్న కివీస్‌పై మరోసారి ఆధిపత్యం చూపెట్టి ఇక్కడే సిరీస్ పట్టేయాలని ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. అయితే సీమర్లకు అనుకూలించే ఈ పిచ్‌పై పర్యాటక జట్టు టాప్ ఆర్డర్‌కు సవాలుగా మారే అవకాశం ఉంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రస్తుతం టీమిండియా 2–0 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది.
0, 23 రన్స్..
గత ఏడాది కాలంగా రోహిత్ తన ఆటతీరును పూర్తిగా మార్చుకుని పూర్తిస్థాయి ఎదురుదాడికి దిగే ముందు క్రీజులో కుదురుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు. దీనివల్ల వరుసగా ఫెయిలవుతున్నాడు. దాంతో కివీస్‌తో తొలి రెండు మ్యాచ్‌ల్లో 0, 23 రన్సే చేశాడు. వాతావరణ పరిస్థితుల వల్ల జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉన్నా.. హిట్‌మ్యాన్ క్రీజులో అంత సౌకర్యవంతంగా కనిపించలేదు. ప్రస్తుతానికి రోహిత్‌పై వేటు పడే చాన్స్ లేకపోయినా.. కఠినమైన పరిస్థితుల్లోనూ నిలకడగా రన్స్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే టైమ్‌లో రెండో వన్డేలో కోహ్లీ ఎక్కువసేపు క్రీజులో ఉండి అద్భుతమైన ఫామ్‌ను చూపెట్టాడు. మూడో వన్డే కోసం ఇండియా తుది జట్టులో మార్పులు చేసే చాన్స్ కనిపించడం లేదు.
అయినప్పటికీ కేఎల్ రాహుల్‌కు బదులుగా అక్షర్ పటేల్‌ను ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు పంపే ఆలోచనలో గౌతీ ఉన్నట్లు సమాచారం. అయితే బాల్‌కు అదనపు స్వింగ్ సీమ్ లభిస్తూ, బౌన్స్ అస్థిరంగా ఉంటే అక్షర్ ఆటతీరు దీనికి సరిపోదు. టాప్ ఆర్డర్ బ్యాటర్లలో ఒక్కరు కూడా బౌలింగ్ చేసే చాన్స్ లేకపోవడంతో అక్షర్‌ను కొనసాగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. రాహుల్ టెస్ట్ జట్టులోకి వెళ్తే ఇషాన్ కిషన్ కీపింగ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. అకిబ్ నబీ వికెట్లు తీస్తున్నా.. గుర్నూర్ బ్రార్, అన్షుల్ కాంబోజ్, అర్ష్‌దీప్ సింగ్ కూడా అద్భుతంగా రాణిస్తుండటం కలిసొచ్చే అంశం. మరో 10 రోజుల్లో టెస్ట్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో సిరాజ్‌ను ఆడించడంలో పెద్దగా అర్థం లేదు.
బ్యాటింగ్‌పైనే దృష్టి..
సొంతగడ్డపై న్యూజిలాండ్ ఆటతీరుపై చాలా విమర్శలు వస్తున్నాయి. తొలి రెండు మ్యాచ్‌ల్లో శాంట్నర్‌కు అదృష్టం కలిసి రాలేదు. టాస్ ఓడిపోవడం, టాప్ ఆర్డర్ బ్యాటింగ్ తడబడటం ఆందోళన కలిగిస్తోంది. దాంతో బౌలర్లపై తీవ్రమైన ఒత్తిడిని పెంచుతోంది. డేవాన్ కాన్వే కంకషన్‌కు గురి కావడం, రచిన్ రవీంద్రకు గాయం వంటి పరిణామాలు కివీస్‌కు ప్రతికూలంగా మారాయి. టామ్ లాథమ్లాంటి నమ్మదగిన బ్యాటర్ కూడా రన్స్ చేయలేకపోవడం ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తోంది. టాప్–3లో టిమ్ సీఫెర్ట్, విల్ యంగ్, హెన్రీ నికోల్స్ వైఫల్యం జట్టును వెంటాడుతోంది. కంకషన్ కారణంగా పేసర్ బ్లెయిర్ టిక్నెర్ జట్టుకు దూరం కాగా, ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా క్రిస్టియన్ క్లార్క్‌ను టీమ్‌లోకి తీసుకున్నారు. టెస్ట్‌ల నేపథ్యంలో లాథమ్, నికోల్స్ గాడిలో పడాలని భావిస్తున్నారు.
తుది జట్లు (అంచనా)
ఇండియా: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, నమన్ ధీర్, అక్షర్ పటేల్, అన్షుల్ కాంబోజ్, అకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్.
న్యూజిలాండ్: మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), విల్ యంగ్, టిమ్ సీఫెర్ట్, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, టామ్ లాథమ్, నాథన్ స్మిత్, కైల్ జెమీసన్, మ్యాట్ ఫిషర్ / క్రిస్టియన్ క్లార్క్, జాకబ్ డఫీ.
11 న్యూజిలాండ్ తమ సొంత గడ్డపై ఆడిన గత 11 వన్డే ద్వైపాక్షిక సిరీస్‌లను గెలుచుకుంది. కివీస్ చివరిసారి 2019లో భారత్‌తో జరిగిన సిరీస్‌లో ఓటమిని చవిచూసింది.
