హైదరాబాద్: సంక్రాంతి తర్వాత ప్రజాబలం పేరుతో ప్రజల్లోకి వస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజాబలంతో సునామీ సృష్టిస్తానని.. ఆ సునామీలో మోడీ, కేడీ కేసీఆర్ కొట్టుకుపోతారని కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం (నవంబర్ 9) కొడంగల్ నియోజకవర్గంలోని హకీంపేట వేదికగా రైతన్నతో ఆత్మీయ బహిరంగ సభ నిర్వహించారు. సీఎం భలో పారేవంత్ ఈ సల్గొని ప్రసంగించారు.
కేసీఆర్ మన గుండెలపై తన్ని పోయిండు
‘‘బూర్గుల రామకృష్ణారావు నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది పాలమూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించినా ఈ ప్రాంతంలో వలసలు ఆగలేదు. మన ప్రాజెక్టులు పూర్తి కాలేదు.. మన పొలాలకు నీళ్లు అందించలేదు. ఈ 75 ఏండ్లలో ఒకరిని అడిగే పరిస్థితే తప్ప కావాల్సింది చేసే సమయం రాలేదు. ఆనాడు పార్లమెంటు ఎన్నికల్లో గెలిపించిన కెసీఆర్ పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేస్తారని నమ్మాం. తెలంగాణ రావాలని.. కష్టాలు తీరాలని కనిపించిన దేవుడికల్లా దండం పెట్టాం. తెలంగాణ వచ్చినా.. ముఖ్యమంత్రిగా బాధ్యత ఇచ్చినా పాలమూరు జిల్లా గుండెలపై తన్ని గజ్వేల్‌కు పోయిండు. భుజాలపై మోసిన పాలమూరు జిల్లా ప్రాజెక్టులను పదేళ్లు పడావు పెట్టాడు. కక్షగట్టి పాలమూరు అభివృద్ధిని అడ్డుకున్నాడు. ఇన్నేండ్లు ఏ దేవుడు మన కష్టాలు వినలేదు’’ అని అన్నారు.
కేసీఆర్ తింటే కుంభకర్ణుడు.. పంటే బకాసురుడు
2023లో ముక్కోటి దేవతల ఆశీస్సులతో కొడంగల్ బిడ్డల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే అవకాశం తనకు దక్కిందని సీఎం రేవంత్ అన్నారు. ‘‘ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచి ఏ ఒక్కరోజైనా సెలవు తీసుకోలేదు. పదేళ్లలో కేసీఆర్ 8 లక్షల 11 వేల కోట్లు అప్పు పెట్టి ఫామ్ హౌస్‌లో పడుకున్నాడు. నాకు అప్పు చేసే అలవాటు లేదు.. అబద్ధాలు చెప్పే అలవాటు అసలే లేదు.
ప్రభుత్వం ఉద్యోగుల కష్టాలు చూసి 11 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖున జీతాలు ఇవ్వాలని ఆలోచన చేశాం.
2024, జనవరి 1 నుంచి ప్రతీ నెల మొదటి తారీఖున జీతాలు పడుతున్నాయ్. ప్రతీ సంవత్సరం కేసీఆర్ చేసిన అప్పులకు 80 వేల కోట్లు చెల్లిస్తున్నాం. కేసీఆర్ అప్పులకు ఈ 34 నెలల్లో 2 లక్షల కోట్లకుపైగా చెల్లించాం. దీనిపై మాట్లాడుదాం అసెంబ్లీకి రమ్మంటే కేసీఆర్ రాడు. ఆయన తింటే కుంభకర్ణుడు.. పంటే బకాసురుడు’’ అని విమర్శించారు.
పోలేపల్లి ఎల్లమ్మతల్లిపై ఆన..
మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పనులు మేం మొదలు పెడితే కెసీఆర్, కేటీఆర్ అడ్డుకుంటామంటున్నారని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్‌కు గడ్డం రావడానికి 50 ఏండ్లు పట్టింది.. బుద్ది రావడానికి ఎన్నేండ్లు పడుతుందోనని ఎద్దేవా చేశారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఎన్నటికీ నక్క పులి కాదన్నారు. కేటీఆర్ నువ్ గడ్డం పెంచుకున్నా.. గడ్డం మోకాల్ల వరకు పెంచుకున్నా ఎన్నటికీ రేవంత్ కాలేవని అన్నారు. రేవంత్ రెడ్డి కావాలంటే గుండె ధైర్యం ఉండాలి.. నమ్ముకున్న వారి కోసం నిలబడే తెగువ కావాలని చెప్పారు.
►ALSO READ | ఎన్ని వేషాలు వేసినా పులి పులే.. నక్క నక్కే.. కేటీఆర్‌పై CM రేవంత్ సెటైర్లు
పది జన్మలు ఎత్తినా నువ్వు రేవంత్ రెడ్డి కాలేవని అన్నారు. మేం లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేసుకుంటే మీకు కడుపుమంట ఎందుకని ప్రశ్నించారు. పోలేపల్లి ఎల్లమ్మతల్లిపై ఆన వేసి చెప్తున్నా.. 2028, డిసెంబర్ నాటికి కృష్ణా జలాలు తెచ్చి కొడంగల్ బీడు భూములను తడుపుతామన్నారు. కొడంగల్ భూముల్లో పచ్చని పంటలు పండేలా చేసే బాధ్యత నాదన్నారు. ఎవరు అడ్డమొచ్చినా.. అడ్డు వచ్చిన వారిని తొక్కుకుంటూ కొడంగల్‌కు కృష్ణా జలాలు తీసుకొస్తామని పేర్కొన్నారు.
ఎడ్యుకేషన్ హబ్‌గా కొడంగల్
ఆనాడు కొడంగల్ బిడ్డలు చదువుకోవాలంటే పక్క జిల్లాలకు, పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సి ఉండేదని.. ఇవాళ కొడంగల్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా చేస్తున్నామన్నారు. ఉన్నత చదువులకు కొడంగల్ వచ్చేలా చేసుకుంటున్నామని తెలిపారు. కొడంగల్ అభివృద్ధి జరుగుతుంటే కొందరు ఏడుపులు మొదలు పెట్టారని విమర్శించారు. ఇవాళ 9 వేల కోట్లతో కొడంగల్‌లో అభివృద్ధి పనులు ప్రారంభించుకున్నామని.. రాబోయే రోజుల్లో వేల కోట్ల పెట్టుబడులు తెచ్చి అభివృద్ధి పథంలో నడిపిస్తామని చెప్పారు. కొడంగల్ ప్రజలు అండగా ఉంటే ఢిల్లీలో మోడీనైనా, గల్లీలో కేడీనైనా ఎదిరిస్తానని పేర్కొన్నారు. నిరంతరం పనిచేసి తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్‌గా తీర్చిదిద్దే బాధ్యత నాదన్నారు. జర్నలిస్టులు అధైర్యపడొద్దని.. మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత నాదని హామీ ఇచ్చారు.
