హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సీఎం రేవంత్ సెటైర్ల వర్షం కురిపించారు. సోమవారం (నవంబర్ 9) లగచర్లలో నిర్వహించిన రైతన్నతో ఆత్మీయ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘విదేశీ కన్సల్టెంట్స్ను పెట్టుకుని కేటీఆర్ నాకు పోటీగా మారాలనుకుంటున్నాడు. ఇందుకోసం నాలాగా గడ్డం పెంచుకోవాలని ఆయనకు వాళ్లు సలహా ఇచ్చారట. అందుకే కేటీఆర్ గడ్డం పెంచుతుండు. కానీ ఎన్ని వేషాలు వేసినా పులి పులే నక్క నక్కే. కేటీఆర్ గడ్డం పెంచినా.. పది జన్మలు ఎత్తినా ఎన్నటికీ రేవంత్ రెడ్డి కాలేరు. రేవంత్ రెడ్డి కావాలంటే గుండె ధైర్యం, కార్యకర్తల అండ, నమ్మినవారికి ప్రాణమిచ్చే త్యాగం ఉండాలి. నమ్మినవాళ్లనే నట్టేట ముంచే కేటీఆర్ ఎప్పుడూ రేవంత్ రెడ్డి కాలేడు. కేటీఆర్‌కు గడ్డం రావాలంటే 50 ఏళ్లు పట్టింది.. మరీ బుద్ది రావడానికి ఎన్నేళ్లు పడుతుందో. కేటీఆర్ పోకిరి వేశాలు, గంజాయి మాటలు మానాలని ఆయన తండ్రి కేసీఆర్ అయిన చెప్పాలి’’ అని అన్నారు.
పోలేపల్లి ఎల్లమ్మ మీద ఆన.. కొడంగల్‌కు కృష్ణా నీళ్లు తీసుకొస్తా:
మక్తల్-నారాయణపేట్-కొడంగల్ పథకాన్ని అడ్డుకుంటామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ప్రాజెక్ట్ పనులు చేపడుతుంటే మీకు ఎందుకు అంత కడుపు మంట అని ప్రశ్నించారు. 2028 డిసెంబర్ నాటికి కృష్ణా జలాలతో కొడంగల్ భూములు తడుపుతామన్నారు. కొడంగల్ గడ్డమీద పచ్చని పంటలు పండిస్తామని.. ఇది పోలేపల్లి ఎల్లమ్మ మీద ఆన అని శపథం చేశారు. ఎవరూ అడ్డొచ్చినా కృష్ణా నదిలో ముంచైనా కృష్ణా జలాలను తీసుకొస్తామని తేల్చిచెప్పారు.
►ALSO READ | పాలమూరు ప్రజల గుండెలపై తన్ని గజ్వేల్ పోయిండు: కేసీఆర్‌పై CM రేవంత్ ఫైర్
కొడంగల్ ప్రాంతానికి వేల కోట్ల పెట్టుబడులు తెచ్చి వేలాది మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పారు. గతంలో చదువు, ఉపాధి కోసం పక్క జిల్లాలు, రాష్ట్రాలకు వెళ్లాల్సి వచ్చేది.. కానీ ఇఫ్పుడు చదవుకోవడానికి కొడంగల్‌కే రావాలని అన్నారు. 70 ఏండ్లుగా కొడంగల్‌కు అన్యాయం జరిగిందని.. ఇప్పుడు అభివృద్ధికి అవకాశం వస్తే ఎందుకు చేయకూడదని ప్రశ్నించారు. కొడంగల్‌కు రూ.10 వేల కోట్లు బరాబర్ తెచ్చకుంటామని.. ఇది మా హక్కు అని అన్నారు. కొడంగల్ అండగా ఉంటే ఢిల్లీనైనా ఎదురించి నిలబడతానని.. మోడీ అయినా కేడీ అయినా కొడంగల్ ముందు తలవంచి తీరాల్సిందేనని పేర్కొన్నారు.
