పాలమూరు ప్రజల గుండెలపై తన్ని గజ్వేల్ పోయిండు: కేసీఆర్‎పై CM రేవంత్ ఫైర్

పాలమూరు ప్రజల గుండెలపై తన్ని గజ్వేల్ పోయిండు: కేసీఆర్‎పై CM రేవంత్ ఫైర్

హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‎పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. పాలమూరు జిల్లా ప్రజలు కేసీఆర్‎ను గుండెల్లో పెట్టుకుని ఎంపీని చేశారని.. ఎంపీగా గెలిచిన ఆయన పాలమూరు రుణం తీర్చుకుంటారని ఆశించామని అన్నారు. కానీ కేసీఆర్ మన గుండెల మీద తన్ని నట్టేట్లో ముంచి కృష్ణా నదిలో కలిపేశాడని.. పాలమూరు జిల్లా ప్రజల గుండెల మీద తన్ని కేసీఆర్ గజ్వేల్‎కు పోయిండని  విమర్శించారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నప్పటికీ కేసీఆర్‎కు కృతజ్ఞత లేదని.. గుండెల్లో పెట్టుకుని చూసుకున్న పాలమూరు ప్రజలపై ఆయన కక్ష పెంచుకున్నాడని అన్నారు. 

సోమవారం (నవంబర్ 9) వికారాబాద్ లగచర్ల వేదికగా ప్రభుత్వం రైతన్నతో ఆత్మీయ సభ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో ధనిక రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లలో రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించారని అన్నారు. కేసీఆర్ నెత్తిన అప్పు.. చేతిలో చిప్ప పెట్టి ఫామ్‎హౌస్‎లో ప్రశాంతంగా పండుకున్నాడని విమర్శించారు. 

తెలంగాణ వస్తే పాలమూరులో వలసలు ఆగుతాయ్.. మా కష్టాలు తీరుతాయని అనుకున్నాం. కానీ ఎందరు పాలకులు మారిన పాలమూరు ప్రజలు బతుకులు మారలేదు. గతంలో పాలమూరు నుంచి ఎంతో మంది మంత్రులుగా పని చేశారు. ఎంతమంది మంత్రులైనా పాలమూరులో నీళ్లు పారలేదు.. వలసలు ఆగలేదు. దశాబ్ధాలు గడిచిన పాలమూరు ప్రాజెక్ట్ పూర్తి కాలేదన్నారు. 

ఈ జిల్లా ప్రజలు ఎప్పుడూ నీళ్లు, పరిశ్రమల కోసం ఎంతో మందిని అడిగారని కానీ పాలమూరుకు నీళ్లు, నిధులు, పరిశ్రమలు ఇచ్చిన వారేలేరని అన్నారు. పాలమూరు ప్రజల ఆశీస్సులతో సీఎం అయ్యానని.. మంత్రులు, ఎమ్మెల్యేలు నన్ను వారి నాయకుడిగా గుర్తించారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలమూరులో ప్రాజెక్టుల పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు.