కరీంనగర్: ఆపదలో అండగా ఉండాల్సిన స్నేహితులే ఓ యవకుడిని దారుణంగా హత్య చేశారు. ఫ్రెండ్షిప్ అనే పదానికే కళంకం తెచ్చే ఈ ఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఘన్‌పూర్‌లో జరిగింది. వివరాల ప్రకారం.. శంకరపట్నం మండలం మెట్పల్లి గ్రామానికి చెందిన పల్లె అజయ్ అనే యువకుడు హుజురాబాద్‌లో మెకానిక్‌గా పని చేస్తున్నాడు.
సోమవారం (నవంబర్ 8) ఘనపూర్ గ్రామంలో తోటి మెకానిక్ ఫ్రెండ్స్‌తో కలిసి చిన్న పార్టీ చేసుకున్నారు. ఈ క్రమంలో అజయ్, అతని స్నేహితులకు మధ్య ఏదో విషయంలో వాగ్వాదం జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన తోటి స్నేహితులు అజయ్‌ను సుత్తితో తలపై మోది దారుణంగా హత్య చేశారు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హత్య గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
