వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ సమీపంలో హైటెన్షన్ నెలకొంది. ట్రంప్ లోపల ఉన్న సమయంలోనే వైట్ హౌస్ ఉత్తర భాగంలోని లాఫాయెట్ స్క్వేర్ దగ్గర ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చిన కారు ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లి ఓ సెక్యూరిటీ సైన్పోస్ట్ను ఢీకొట్టింది. ప్రమాదం తర్వాత కారు ఇంజిన్ నుంచి తెల్లటి పొగ వెలువడింది. వెంటనే అప్రమత్తమైన వైట్ హౌస్ భద్రతా సిబ్బంది కారు డ్రైవర్ అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు.
కారు డ్రైవర్ భద్రతా సిబ్బందితో ఘర్షణకు దిగడంతో కాసేపు హైడ్రామా నెలకొంది. చివరకు భద్రతా సిబ్బంది కారు డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. కారును స్వాధీనం చేసుకున్న భద్రతా దళాలు.. కారులో ఏవైనా పేలుడు పదార్థాలు ఉన్నాయా అనే అనుమానంతో బాంబ్ స్క్వాడ్, స్నిఫర్ డాగ్స్‌ను రంగంలోకి దించింది. ఇదే సమయంలో లాఫాయెట్ పార్క్ వాయువ్య మూలలో బారికేడ్‌ను దాటి దూకడానికి ప్రయత్నించిన మరో వ్యక్తిని కూడా సీక్రెట్ సర్వీస్ పోలీసులు అరెస్ట్ చేశారు.
►ALSO READ | మాకు స్పై చేయాల్సిన అవసరం లేదు.. ఆ పిల్లతో సంబంధం లేదన్న చైనా
ట్రంప్ లోపల ఉండగానే వైట్ హౌస్ వెలువల చోటుచేసుకున్న ఈ ఘటనలతో యూఎస్ సీక్రెట్ సర్వీస్ అధికారులు అలర్ట్ అయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా వైట్ హౌస్‌ను తాత్కాలికంగా లాక్డౌన్ చేశారు. తనిఖీల అనంతరం ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారించిన తర్వాత లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేశారు. ఈ ఘటనపై యూఎస్ సీక్రెట్ సర్వీస్ దర్యాప్తు చేపట్టింది. కారు యాక్సిడెంట్ ప్రమాదవశాత్తూ జరిగిందా లేక దీని వెనక ఏదైనా కుట్ర ఉందా అన్న కోణంలో ఆరా తీస్తు్న్నారు. నిందితుల వివరాలు, వారి ఉద్దేశాలపై వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు.
