- 679 బ్రాండ్లపై 50 శాతానికి పైగా డౌన్
- ఒక మందుపై ఏకంగా 96.45% కోత
- ఈ నెల 9 నుంచే అమల్లోకి కొత్త ధరలు
- రోగులకు ఏటా రూ.3,540 కోట్ల ఆదా
- ఎక్కువ ధరలకు అమ్మితే టోల్ ఫ్రీ నంబర్
- 1800-111-255కు ఫిర్యాదు చేయాలన్న కేంద్రం
న్యూఢిల్లీ, వెలుగు: క్యాన్సర్ రోగులకు, వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. ఖరీదైన 137 రకాల మెడిసిన్ ధరలను భారీగా తగ్గించింది. ఈ మేరకు 2026 నవంబర్ 9 (సోమవారం) కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) ఒక ప్రకటన వెలువరించింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సిఫార్సుల ఆధారంగా ఈ 137 క్యాన్సర్ నిరోధక మందుల ఎంఆర్పీపై వాణిజ్య మార్జిన్‌లకు ఈ ఏడాది అక్టోబర్ 17న పరిమితి విధించినట్లు పేర్కొంది. సవరించిన ఎంఆర్పీలు సోమవారం నుంచే అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది.
దాదాపు రూ.3,540.38 కోట్ల ఆదా
నవంబర్ 8న దీపావళి నాటికి 85 ఫార్మా కంపెనీలు 121 రకాల ఔషధాలకు చెందిన 1,364 క్యాన్సర్ నిరోధక ఫార్ములేషన్ల కొత్త ధరలను ప్రకటించినట్లు ఫార్మాస్యూటికల్ డిపార్ట్మెంట్ వెల్లడించింది.
వీటిలో 679 బ్రాండ్లపై ధరలు 50 శాతానికి పైగా తగ్గింపు ప్రకటించాయి. ఇందులో అత్యధికంగా ఒక మందు ధరపై 96.45 % మేర కోత పెట్టాయి. ఈ ధరల తగ్గింపుతో రోగులకు ఏటా సుమారు రూ.3,540.38 కోట్ల ఆదా అవుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది.
ఎక్కువ ధరలకు అమ్మితే కంప్లైంట్ చేయొచ్చు
కొత్తగా నిర్ణయించిన ధరలకంటే ఎక్కువ రేటుకు మెడిసిన్స్అమ్మడానికి మెడికల్ షాపులు, ఆస్పత్రుల ఫార్మసీలకు పర్మిషన్ లేదని కేంద్రం స్పష్టం చేసింది. మందుల ప్యాకెట్లపై ముద్రించిన కొత్త ఎంఆర్పీని పరిశీలించాలని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ సూచించింది.
ఫార్మా సహీదామ్ మొబైల్ యాప్ లేదా ఎన్పీపీఏ అధికారిక వెబ్‌సైట్ ద్వారా మందుల ధరలను తనిఖీ చేసుకోవచ్చని తెలిపింది. ఎవరైనా కొత్త ధరలకంటే ఎక్కువగా మందులు విక్రయిస్తే ఫార్మా జన్ సమాధాన్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయవచ్చని స్పష్టం చేసింది. అలాగే ఫిర్యాదుల కోసం హెల్ప్‌లైన్ నంబర్: 1800-111-255 ను ఎన్పీపీఏ అందుబాటులోకి తెచ్చింది.
