కరువుతో రాజకీయమా?..ఎల్ నినో కాంగ్రెస్ తెచ్చిందంటున్రు.. మరి కరోనాను బీఆర్ఎస్ తెచ్చినట్టా? : మంత్రి వివేక్ వెంకటస్వామి

కరువుతో రాజకీయమా?..ఎల్ నినో కాంగ్రెస్ తెచ్చిందంటున్రు.. మరి కరోనాను బీఆర్ఎస్ తెచ్చినట్టా? : మంత్రి వివేక్ వెంకటస్వామి
  • కరువును జాతీయ విపత్తుగా ప్రకటించాలి
  • అఖిలపక్షంతో ప్రధాని మోదీ వద్దకు వెళ్తాం 
  • ఎంపీ రఘునందన్‌‌‌‌ చొరవ తీసుకోవాలి
  • వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలే మేలు
  • నర్సాపూర్‌‌‌‌లో మంత్రి వివేక్ వెంకటస్వామి
  • 630 మందికి ఇందిరమ్మ ఇండ్ల పత్రాలు పంపిణీ

మెదక్​/నర్సాపూర్/ పటాన్ చెరు, వెలుగు:కరువుతో రాజకీయం చేయడం మనుకోవాలని శక్తి, మైన్స్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రతిపక్షాలకు హితవు పలికారు. ఎల్‌‌‌‌‌‌‌‌నినో ప్రకృతి వైపరీత్యమని, దానికి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు ఏమి సంబంధమని ఆయన ప్రశ్నించారు. ‘కాంగ్రెస్​వల్లే కరువు వచ్చిందంటూ బీఆర్ఎస్​ నేతలు మాట్లాడుతున్నారు. క్రోసిన్​టాబ్లెట్​తీసుకుంటే కరోనా రాదని అప్పట్లో కేసీఆర్​చెప్పిండు, అంతమాత్రాన కరోనాను బీఆర్ఎస్​తెచ్చినట్టా?’ అని నిలదీశారు. ఎల్‌‌‌‌‌‌‌‌నినోను కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించాలని, కరువుపై ప్రధానిని కలిసేందుకు త్వరలోనే ఢిల్లీకి అఖిలపక్ష ప్రతినిధి బృందంతో వెళ్తామని తెలిపారు. 

ఇందుకు ఎంపీ రఘునందన్​రావు చొరవ తీసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. సోమవారం మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రాంచంద్రాపురంలో నిర్వహించిన సమగ్ర పశుసంవర్ధకశాఖ శిబిరంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డితో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పశువులకు వ్యాధి నివారణ మందులు పంపిణీ చేశారు. అనంతరం ఎల్‌‌‌‌‌‌‌‌నినో అవగాహన సదస్సులో మాట్లాడారు. ఎల్‌‌‌‌‌‌‌‌నినో లాంటి ప్రకృతి వైపరీత్యాలను ఎవరూ నియంత్రించలేరని, కానీ ముందస్తు జాగ్రత్తలతో వాటి ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని మంత్రి చెప్పారు. ఎల్‌‌‌‌‌‌‌‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయని, భూగర్భ జలమట్టాలు పడిపోతున్నాయని పేర్కొన్నారు. విద్యుత్, నీటి లభ్యత తగ్గుతున్నందున వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని రైతులకు సూచించారు. 

రైతులను ఆదుకునేందుకు కేంద్రం ముందుకు రావాలి

ఎల్‌‌‌‌‌‌‌‌నినో  వల్ల నష్టపోతున్న రైతులను  ఆదుకునేందుకు కేంద్రం ముందుకురావాలని మంత్రి వివేక్​వెంకటస్వామి విజ్ఞప్తి చేశారు. అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలిసి సహాయం కోరుతామని పేర్కొన్నారు. ఇందుకు ఎంపీ రఘునందన్​రావు లాంటి వాళ్లు చొరవ తీసుకోవాలని కోరారు. ప్రాణహిత ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతానికి సాగునీరు అందించాలన్నది తన తండ్రి కాకా వెంకటస్వామి  కల అని , దీనిని ముందుకు తీసుకెళ్లేందుకు మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని వెల్లడించారు. 

మహారాష్ట్ర150 మీటర్ల ఎత్తుకు అంగీకరిస్తే ఈ ప్రాంతానికి సాగునీరు అందించే అవకాశాలు మెరుగుపడతాయన్నారు. ఈ విషయంలో తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు  మరమ్మతులకు అవసరమైన సాంకేతిక పరీక్షలు పూర్తయ్యాక తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంటుందన్నారు. సింగూరు జలాల వినియోగంపై స్థానిక ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడతానని మంత్రి హామీ ఇచ్చారు. 

జిల్లా ప్రజలకు తాగునీటి కొరత రాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. వ్యవసాయంతో పాటు పశుపోషణను ఆదాయ వనరుగా అభివృద్ధి చేసుకోవాలని రైతులకు సూచించారు. మెదక్ ఎంపీ  రఘునందన్ రావు మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం పశుసంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోందని, నేషనల్ లైవ్‌‌‌‌‌‌‌‌ స్టాక్ మిషన్ ద్వారా గ్రామాల్లో పశుసంపదను పెంచేందుకు, గాలికుంటు వ్యాధి నివారణకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. 

పేదల జీవితాలకు కొత్త వెలుగు

ఇందిరమ్మ ఇండ్లతో పేదల జీవితాల్లో కొత్త వెలుగులు వచ్చాయని ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్, మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇప్పటికే రెండు లక్షల ఇండ్ల నిర్మాణం చేపట్టామని, మరో రెండు లక్షల ఇండ్లను మంజూరు చేయనున్నామని తెలిపారు. పటాన్ చెరు నియోజకవర్గంలోని చిన్నకంజర్లలో ఆదివారం ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమంలో ఆయన  పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా  ఇందిరమ్మ ఇంట్లో కేక్ కట్ చేసి,  లబ్ధిదారుల కుటుంబంతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. 

అనంతరం వారి ఇంట్లో భోజనం చేశారు.  గత పదేండ్లలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అందిస్తామని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చి ఓట్లు సాధించినప్పటికీ, ఆశించిన స్థాయిలో నిర్మాణాలు చేపట్టలేకపోయిందని విమర్శించారు. రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసి, రూ.46 వేల కోట్ల కాంట్రాక్టర్ల బిల్లులు, రూ.16 వేల కోట్ల ఉద్యోగుల జీతాలు, రిటైర్మెంట్ ప్రయోజనాలు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో పెట్టారని పేర్కొన్నారు. 

గుడిసెల్లో నివసిస్తున్న 630 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు 

నర్సాపూర్ మండలం తుల్జారాం పేట గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని సోమవారం మంత్రి వెంకట స్వామి ప్రారంభించారు. అనంతరం నర్సాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, కలెక్టర్ ప్రతిమా సింగ్‌‌‌‌‌‌‌‌తో కలిసి గుడిసెల్లో నివసిస్తున్న 630 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు, 412 మంది లబ్ధిదారులకు 4,12,47,792 కోట్ల రూపాయల విలువైన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. సొంత ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తోందని, అర్హులైన లబ్ధిదారులు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఇంటి నిర్మాణ పనులు చేపట్టాలని మంత్రి సూచించారు. అనంతరం నర్సాపూర్ మున్సిపల్–3వ వార్డులో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో  నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్ సుహాసిని రెడ్డి , మున్సిపల్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్ లక్ష్మి రాజు యాదవ్ పాల్గొన్నారు.