దీపావళి తెచ్చిన కష్టం.. హైదరాబాద్ లో గాలి కాలుష్యం ఫుల్లు.. చెవులకు చిల్లు

దీపావళి తెచ్చిన కష్టం.. హైదరాబాద్ లో  గాలి కాలుష్యం ఫుల్లు.. చెవులకు చిల్లు
  •     పండుగకు ముందు ఏక్యూఐ  60 నుంచి 76 మాత్రమే 
  •     దీపావళి రాత్రి సగటు ఏక్యూఐ 509
  •     మసీద్‌బండలో 995, ప్రకాశ్‌నగర్‌లో 828,  పీఎం 2.5 స్థాయి 392 మైక్రోగ్రాములు.. 
  •   ఊపిరి పీల్చుకోలేక పిల్లలు,వృద్ధుల నరకయాతన..
  •     డబుల్​ అయిన శబ్ధ కాలుష్యం 


హైదరాబాద్ సిటీ వెలుగు : దీపావళి వేళ హైదరాబాద్‌ నగరాన్ని వాయు, శబ్ధ కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేసింది. టైమింగ్​తో సంబంధం లేకుండా సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు పటాకుల మోత మోగడంతో ఆ ప్రభావం తీవ్రంగా కనిపించింది. గాలి విషతుల్యమైపోయింది. మామూలు రోజుల్లో ఎయిర్​క్వాలిటీ ఇండెక్స్​60 నుంచి 76 వరకు ఉంటే పది నుంచి పదిహేను రెట్లు పెరిగి శ్వాస తీసుకోవడం కూడా కష్టమయ్యే పరిస్థితిని తీసుకువచ్చింది. ఇక శబ్ధ కాలుష్యం కూడా అదే రేంజ్​లో నమోదైంది. ఇంట్లో తలుపులు, కిటికీలు మూసుకుని ఉన్నా కూడా చెవులకు చిల్లులు పడే సౌండ్​వచ్చింది. సాధారణంగా నివాస ప్రాంతాల్లో రాత్రి వేళ 45 డెసిబుల్స్ ఉండాల్సి ఉంటే ఈ దీపావళి రోజు అది ఏకంగా 89.6 డెసిబెల్స్ కి చేరుకుంది. దీంతో చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు సమస్యలు ఎదుర్కొన్నారు 

 కూకట్‌పల్లిలో 628 ఏక్యూఐ

పండుగకు ముందు వరకు సిటీలో ఎయిర్​క్వాలిటీ ఇండెక్స్​(వాయు నాణ్యత సూచీ) 60 నుంచి 76 మధ్య ఉండగా.. దీపావళి రాత్రి 9.30 గంటలకు 509కు చేరింది. కొన్ని ప్రాంతాల్లో ఈ లెక్కలు మరీ దారుణ స్థితికి చేరుకున్నాయి. మసీద్‌బండ సమీపంలోని రవి కాలనీలో ఏక్యూఐ ఏకంగా 995గా నమోదైంది. ప్రకాశ్‌నగర్‌లో 828, కూకట్‌పల్లిలో 628, బిక్షపతినగర్‌లో 625, జనార్దన్‌ హిల్స్‌లో 532కి చేరింది. ఇక గాజులరామారంలో 487, ప్రగతి నగర్ లో 486, కేపీహెచ్‌బీ ఫేజ్ 1 లో 486గా నమోదైంది. 11.30 గంటలకు నగర సగటు 442గా నమోదైనా.. కాలుష్య తీవ్రత మాత్రం కొనసాగింది. 

నాలుగున్నర రెట్లు పెరిగిన పీఎం 2.5  

సోమవారం ఉదయానికి ఎయిర్​క్వాలిటీ ఇండెక్స్​178కి తగ్గినప్పటికీ గాలిలో ధూళి కణాల ప్రభావం పూర్తిగా తొలగిపోలేదు.  పీఎం 2.5 స్థాయి (గాలిలోని అత్యంత సన్నని కంటికి కనపడని ధూళి కణాలు) సాధారణ రోజుల్లో క్యూబిక్‌ మీటరుకు 37 మైక్రోగ్రాములుగా ఉంటుంది. కానీ, ఈసారి ఏకంగా క్యూబిక్‌ మీటరుకు 392 మైక్రోగ్రాములకు చేరింది. ఇది గత ఏడాది అంటే 2025 దీపావళి రోజున 69 మైక్రోగ్రాములు మాత్రమే.. ఈ లెక్కన గత ఏడాదితో పోలిస్తే సుమారు ఐదు రెట్లు పీఎం 2.5 స్థాయి పెరిగింది. 

పీఎం 10 స్థాయి కూడా పైపైకి...

సాధారణ రోజుల్లో పీఎం 10 స్థాయి  క్యూబిక్ మీటరుకు 70 నుంచి 91 మైక్రోగ్రాములు మాత్రమే ఉంటుంది. గత ఏడాది దీపావళి రోజున ఈ స్థాయి కేవలం 153 మైక్రోగ్రాములు కాగా, ఈసారి నగర సగటు పీఎం10 ఏకంగా 392 మైక్రోగ్రాములకు చేరినట్టు తెలుస్తున్నది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కాలుష్య స్థాయి రెండున్నర రెట్లు అంటే సుమారు 156 శాతం పెరిగింది. 

అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి

గాలిలో పీఎం 2.5  స్థాయి 392 మైక్రోగ్రాములు ఉండటం అనేది ఆరోగ్యపరంగా అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం 24 గంటల సగటున ఇది కేవలం15 మైక్రోగ్రాములు మాత్రమే ఉండాలి. కానీ, దానికి సుమారు 26 రెట్లు ఎక్కువగా ఈ కణాలు గాలిలో పేరుకుపోవడం వల్ల మనుషుల శరీరంపై తీవ్రమైన దుష్ప్రభావాలు పడతాయి. పీఎం 2.5 కణాలు ఎంత చిన్నవి అంటే, మన తలవెంట్రుక మందం కంటే 30 రెట్లు సన్నగా ఉంటాయి. అందువల్ల ఇవి మన ముక్కులోని రోమాలను దాటుకుని నేరుగా ఊపిరితిత్తుల చివరి భాగాల వరకు, అక్కడి నుంచి రక్తప్రవాహంలోకి కూడా కలిసిపోతాయి. చిన్నపిల్లల ఊపిరితిత్తులు ఎదిగే దశలో ఉంటాయి కాబట్టి వీరికి ముప్పు ఎక్కువగా ఉంటుందంటున్నారు. మరోవైపు గర్భిణుల కడుపులోని బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుందని, గుండె జబ్బులు, బీపీ, షుగర్ ఉన్నవారికి ఈ గాలి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుందన్నారు.  

సౌండ్​ కూడా తగ్గలే..

ధ్వని కాలుష్యం కూడా నగరంలో ప్రమాదకర స్థాయికి చేరింది. దీపావళి రాత్రి 9:30 గంటలకు సగటు ధ్వని కాలుష్యం ఏకంగా 89.6 డెసిబెల్స్ గా నమోదైంది. సాధారణంగా నివాస ప్రాంతాల్లో రాత్రి ఉండాల్సిన గరిష్ట పరిమితి 45 డెసిబెల్స్ మాత్రమే. కానీ, ఈసారి పటాకుల మోతతో శబ్ధ కాలుష్యం విపరీత స్థాయికి చేరింది. రెసిడెన్షియల్​ జోన్స్​ అయిన జూబ్లీహిల్స్, తార్నాక, బంజారాహిల్స్, కూకట్‌పల్లిల్లో పగలు సగటున 68.89 డెసిబెల్స్​, అర్ధరాత్రి 65.68 డెసిబెల్స్​ నమోదైంది. కమర్షియల్​ జోన్స్​ అయిన అబిడ్స్, జేఎన్​టీయూ, కూకట్‌పల్లి, సికింద్రాబాద్ లో పగలు 70.69, రాత్రి 68.23 డెసిబెల్స్​ రికార్డయ్యింది. సెన్సిటివ్​ జోన్లయిన దవాఖానలుండే ప్రాంతాల్లో 63.3 డెసిబెల్స్​కు పెరిగింది. ఇక్కడ అసలు పరిమితి రాత్రి పూట 40 డెసిబెల్స్ ​మాత్రమే.. ఈ స్థాయి శబ్ద తీవ్రత రిస్క్​తో కూడుకున్నదని, చిన్నపిల్లలు, పిల్లలు, గర్భిణులు, జంతువులు, పక్షులకు హాని చేస్తుందని నిపుణులు స్పష్టం చేశారు.   

శ్వాస ఆడలే..గొంతులో మంట 

దీని వల్ల సిటీ జనాలు శ్వాస సరిగ్గా ఆడకపోవడం, గొంతులో మంట, ఆగని పొడి దగ్గుతో ఇబ్బందులు పడ్డారు. పలువురు కండ్లు ఎర్రబడి తిప్పలు పడ్డారు. మరికొందరు నీళ్లు కారడం, ముక్కు కారడం, ముక్కు దిబ్బడ వంటి సమస్యలతో సతమతం అయ్యారు. ఇప్పటికే ఆస్తమా, సైనసైటిస్ ఉన్నవారికి ఒక్కసారిగా ఇన్హేలర్స్ వాడాల్సిన పరిస్థితి వచ్చింది. గాలిలో ఆక్సిజన్ శాతం తగ్గి కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ వంటి రసాయనాలు పెరగడంతో కొందరు తీవ్రమైన తలనొప్పి, కళ్లు తిరిగి ఏమవుతుందో తెలియని స్థితికి చేరుకున్నారు. ఇలాగే రెండు మూడు రోజులు ఉంటే విషపూరిత కణాలు ఊపిరితిత్తులలో పేరుకుపోయి వాటి పనితీరు దెబ్బతీస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కూడా దారితీస్తుందంటున్నారు. అలాగే, ఈ సూక్ష్మ కణాలు రక్తంలో కలవడం వల్ల రక్తం గడ్డకట్టే ప్రమాదం పెరుగుతుందని, దీనివల్ల గుండెపోటు లేదా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయన్నారు.