మట్టి వాసనను, మనిషి బాధను, ఎదనిండా నింపుకొని తెలంగాణ ఆత్మగౌరవాన్ని, ఈ మట్టిలోని ధిక్కారాన్ని పతాక స్థాయిలో నిలిపిన లోక కవి డా. అందెశ్రీ. తెలంగాణ చరిత్రలో కొన్ని ఉద్యమాలు కేవలం రాజకీయ పరిణామాలుగానే మిగలలేదు. అవి ప్రజల జీవనంలో భాగమయ్యాయి. పాటగా మారాయి. కవితగా మారాయి. నినాదంగా మారాయి. ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచాయి. అలాంటి తెలంగాణ సాంస్కృతిక, సాహిత్య ఉద్యమంలో తనదైన ముద్ర వేసిన కవి అందెశ్రీ.
తెలంగాణ మట్టి వాసనను, పల్లె జీవితపు సహజత్వాన్ని, సామాన్యుడి కష్టాన్ని, ప్రజల ఆకాంక్షలను తన అక్షరాల్లో పలికించిన ప్రజాకవిగా ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. కవిత్వం అంటే కేవలం పదాల కూర్పు కాదని, అది సమాజపు అంతరంగాన్ని పలికించే సాధనమని అందెశ్రీ సాహిత్య ప్రయాణం నిరూపిస్తోంది. ఆయన రచనల్లో తెలంగాణ నేల కనిపిస్తుంది. తెలంగాణ మనిషి కనిపిస్తాడు. పల్లె జీవితం కనిపిస్తుంది. ప్రకృతి కనిపిస్తుంది. సామాజిక వాస్తవికత కనిపిస్తుంది. ముఖ్యంగా మనిషి పట్ల ఆయనకున్న మమకారం కనిపిస్తుంది.
అందెశ్రీ వ్యక్తిత్వంలో నిరాడంబరత ఒక ప్రత్యేక లక్షణంగా చెప్పుకోవాలి. ప్రజల మధ్య తిరుగుతూ వారి జీవితాలను పరిశీలించి, వారి అనుభవాలను తన సాహిత్యానికి వస్తువుగా చేసుకున్న రచయితగా ఆయన కనిపిస్తారు. పల్లె మనిషి మాట్లాడే భాషలోనే జీవిత సత్యాలు దాగి ఉంటాయని ఆయన రచనలు చెబుతాయి. అందుకే ఆయన కవిత్వంలో కృత్రిమమైన భాష కంటే సహజమైన పలుకుబడి ఎక్కువగా కనిపిస్తుంది. తెలంగాణ యాస, భాష, సంస్కృతిని తక్కువగా చూసిన సమైక్య పాలనలో వాటికి సాహిత్య గౌరవాన్ని తీసుకురావడంలో అందెశ్రీ కృషి సదా చిరస్మరణీయం. తెలంగాణ భాషలో ఒక ప్రత్యేకమైన జీవశక్తి ఉంది. ఆ భాషలోని మాధుర్యాన్ని, పదునును, భావోద్వేగాన్ని అందెశ్రీ తన రచనల్లో ఉపయోగించారు. అందువల్ల ఆయన కవిత్వం చదివినప్పుడు పుస్తకంలో రాసిన మాటలు చదువుతున్న అనుభూతి కంటే మనచుట్టూ ఉన్న మనుషులు మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది.
అందెశ్రీ సాహిత్యంలో సామాజిక, ఆధ్యాత్మిక, శాస్త్రీయవాద స్పృహ ప్రధానమైన అంశం. సమాజంలోని పేదలు, బలహీన వర్గాలు, గ్రామీణ ప్రజలు ఎదుర్కొనే సమస్యలు, అసమానతలు, అణచివేత వంటి అంశాలు ఆయన రచనల్లో ప్రతిఫలిస్తాయి. కవికి సమాజం పట్ల బాధ్యత ఉందనే భావన ఆయన సాహిత్యంలో కనిపిస్తుంది. ఆయన పదాల్లో ఒకవైపు ఆవేదన ఉంటే, మరోవైపు ఆశ ఉంటుంది. ఒకవైపు సామాజిక వాస్తవికత ఉంటే, మరోవైపు మెరుగైన సమాజం పట్ల ఆకాంక్ష ఉంటుంది. అందుకే అందెశ్రీ సాహిత్యాన్ని కేవలం తెలంగాణ ప్రాంతీయ సాహిత్యంగా కాకుండా, మానవీయ విలువలను ప్రతిబింబించే సాహిత్యంగా చూడాలి.
కోట్లాది ప్రజల గీతం ‘జయ జయహే తెలంగాణ’
తెలంగాణ నేల, ప్రజలు, సంస్కృతి, చరిత్ర, ఆత్మగౌరవం వంటి భావాలను ప్రతిబింబించే గీతం ‘జయ జయహే తెలంగాణ’. రాష్ట్ర ఉద్యమకాలంలో ఈ గీతం వినపడనిదే సభలు ప్రారంభమయ్యేవి కావంటే తెలంగాణ ఉద్యమాన్ని ఎంతగా ప్రభావితం చేసిందో చెప్పనక్కరలేదు. ఒక పాట ప్రజల గుండెల్లోకి వెళ్లాలంటే అందులో వారి జీవితం కనిపించాలి. వారి బాధ, వారి ఆశ, వారి స్వప్నం వినిపించాలి. ‘జయ జయహే తెలంగాణ’లో అలాంటి భావోద్వేగ అనుబంధం యావత్తు తెలంగాణ ప్రజలకు ఏర్పడింది. ఈ పాటకు బాణీ ‘అయిగిరి నందిని’ అనే జగన్మాత స్తోత్రం నుంచి తీసుకోవడమే ఆ పాటకు అంతటి ప్రాబల్యం, ప్రాధాన్యం ఉన్నదని అందెశ్రీ అనేక సందర్భాల్లో ప్రకటించారు.
గత పాలనలో అవమానం, నేటి పాలనలో గౌరవం
పేర్చిన పెద్ద బతుకమ్మలా తలపై మోసిన గద్దర్, అందెశ్రీలాంటి మహా కవులను నిర్లక్ష్యం చేసి అవమానించిన గత పాలకుల చరిత్రను తెలంగాణ సమాజం ఎన్నడూ మరచిపోదు. ఈ క్రమంలో పదేళ్ల గడీల పాలనకు ప్రజలు చరమగీతం పాడారు. అనంతరం ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ‘జయ జయహే తెలంగాణ’కు రాష్ట్ర గీతంగా అధికారిక గుర్తింపు ఇచ్చింది. గద్దర్‌ను అవమానించిన ప్రగతి భవన్‌ను ముఖ్యమంత్రి నివాసంగా రద్దు చేసి, గద్దర్ పేరుతో సినిమా అవార్డ్ ప్రకటించి ఆయనకు గౌరవం ఇచ్చిన ఘనత కూడా సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుంది.
తెలంగాణ భాషకు గౌరవం
అందెశ్రీ రచనల్లో తెలంగాణ భాషకు ఉన్న సహజత్వం, సౌందర్యం ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఆయన పదజాలంలో పల్లె నేల వాసన ఉంటుంది. ఆ భాషలో మనుషుల నవ్వు, వారి కన్నీరు ఉంటుంది. ఆత్మగౌరవం ఉంటుంది. భాషను కాపాడటం అంటే కేవలం పదాలను కాపాడటం కాదు. ఒక సమాజపు జ్ఞాపకాలను, సంస్కృతిని, జీవన విధానాన్ని కాపాడటం. ఈ కోణంలో అందెశ్రీ సాహిత్యాన్ని తెలంగాణ సాంస్కృతిక వారసత్వంలో భాగంగా చూడవచ్చు. కవికి ప్రజలే విశ్వవిద్యాలయం. అందెశ్రీ సాహిత్యాన్ని పరిశీలిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది.
ప్రజలే ఆయనకు ప్రధాన స్ఫూర్తి. పుస్తకాలలో ఉన్న సిద్ధాంతాల కంటే జీవితంలో ఎదురయ్యే అనుభవాలు ఆయన సృజనకు దగ్గరగా ఉన్నాయి. పేద రైతు, కూలీ, గ్రామీణ మహిళ, సామాన్య కుటుంబం, ప్రకృతి, పల్లె జీవితం ఇవన్నీ ఆయన సాహిత్య ప్రపంచంలో భాగాలు. అందుకే ఆయన కవిత్వం సమాజం నుంచి పుట్టి తిరిగి సమాజానికి చేరినప్పుడే దాని ప్రయోజనం నెరవేరుతుందని ఆయన సాహిత్య ప్రయాణం మనకు గుర్తు చేస్తుంది. కవులకు మరణం ఉండదు వారు సృష్టించిన సాహిత్యం వారిని అమరులుగా నిలుపుతుంది. తెలంగాణ నేల ఉన్నంతకాలం, తెలంగాణ భాష పలికినంతకాలం, తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడినంతకాలం ‘జయ జయహే తెలంగాణ’ స్వరం వినిపిస్తూనే ఉంటుంది. ఆ స్వరంలో అందెశ్రీ అక్షరాలు కూడా సజీవంగానే ఉంటాయి.
- దొమ్మాట వెంకటేశ్,
రచయిత, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
[email protected]
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
