- పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చొరవతో కాంగ్రెస్ పార్టీ లీడర్లను వరించిన పదవులు
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: రాజకీయాల్లో అవమానాలు ఎదురైన చోటే అరుదైన గుర్తింపు దక్కింది. తమకు రాజకీయంగా పెద్దపీట వేసి, సముచిత గౌరవం కల్పించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ శ్రేణులు కృతజ్ఞతలు తెలిపారు. మల్హర్ మండలం కొయ్యూర్లో ఎంపీ గడ్డం వంశీకృష్ణ చిత్రపటానికి స్థానిక నేతలు పాలాభిషేకం నిర్వహించి, మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు జరుపుకున్నారు.
ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలకు ఎంపీ వంశీకృష్ణ రాజకీయ అండగా నిలిచారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ప్రతిష్టాత్మక కమిటీల్లో మల్హర్ మండల నేతలకు స్థానం కల్పించడంపై హర్షం వ్యక్తమైంది. రైల్వే సలహా మండలి సభ్యురాలిగా లకావత్ లక్ష్మి, టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ సభ్యులుగా లకావత్ సవేందర్, మహమ్మద్ కలిముద్దీన్, దేవి భూమయ్య లకు పదవులు లభించాయి.
తమ గిరిజన సమాజానికి రాజకీయంగా సముచిత ప్రాధాన్యత కల్పించడమే కాకుండా కీలక పదవుల్లో అవకాశం కల్పించడంపై ఆనందం వ్యక్తం చేశారు. తమను గుర్తించి గౌరవించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని, రాజకీయంగా ఆయనకు పూర్తి అండగా నిలుస్తామని నాయకులు స్పష్టం చేశారు.
