- రెండెకరాల్లో భారీ గుంతలు, వందలాది చెట్ల నరికివేత
- కనుమరుగవుతున్న నెమళ్లు, వన్యప్రాణుల ఆవాసాలు
- యూనివర్సిటీ ఆఫీసర్ల తీరుపై విమర్శలు
కరీంనగర్, వెలుగు: శాతవాహన యూనివర్సిటీ క్యాంపస్‌లో అభివృద్ధి పనుల పేరుతో భారీగా పర్యావరణ విధ్వంసం జరుగుతోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గ్యాలరీ, లా కాలేజ్, సింథటిక్ ట్రాక్ నిర్మాణాల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు, తరలింపు, చెట్ల నరికివేత చేపడుతున్నారని విద్యార్థులు, అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు నెమళ్లు, అరుదైన పక్షులు, వన్యప్రాణులకు ఆవాసంగా ఉన్న క్యాంపస్‌లో ప్రస్తుతం పచ్చదనం కనుమరుగవుతోందని, తవ్వకాల కారణంగా వాటి సహజ ఆవాసాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా నెమళ్లు, ఇతర పక్షుల సంచారం తగ్గిపోయిందని పేర్కొంటున్నారు.
సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన యూనివర్సిటీ క్యాంపస్‌లో గ్యాలరీ, లా కాలేజీ, సింథటిక్ ట్రాక్ నిర్మాణాల కోసం సుమారు రెండెకరాల విస్తీర్ణంలో 10 అడుగులకు పైగా లోతుతో ప్రొక్లెయినర్ల ద్వారా మట్టి తవ్వకాలు చేపట్టరు. ఈ మట్టిని క్యాంపస్‌తోపాటు బయట ప్రాంతాలకు కూడా తరలిస్తున్నారని, గనులు, భూగర్భ శాఖ అనుమతులు, రాయల్టీ చెల్లింపులు లేకుండానే ఈ వ్యవహారం సాగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
‘వాల్టా’కి తూట్లు..
ఏండ్ల తరబడి క్యాంపస్‌కు పచ్చదనాన్ని అందిస్తున్న వందలాది చెట్లను నరికివేశారు. సుమారు 100కు పైగా చెట్లను తొలగించి, వాటి కలపను దుంగలుగా మార్చి ఐదు డీసీఎంల్లో తరలించినట్లు విద్యార్థులు చెబుతున్నారు. చెట్ల నరికివేతలో వాల్టా చట్టం-2002 నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపిస్తున్నారు. గతంలో ఐదు చెట్ల నరికివేతకు మాత్రమే అటవీ శాఖ అనుమతి తీసుకున్నట్లు తెలిసింది. ఇప్పడు వందలాది చెట్లను తొలగించినా ఫరెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సమగ్ర విచారణ చేపట్టాలి..
క్యాంపస్‌లో జరుగుతున్న తవ్వకాలు, మట్టి రవాణా, చెట్ల నరికివేత పనులపై ఎంక్వైరీ చేయాలి. మైనింగ్, ఫారెస్ట్, పర్యావరణ నిబంధనలు, వాల్టా చట్టం ఉల్లంఘనలు జరిగాయా అనే కోణంలో పరిశీలించాలి. పర్యావరణానికి, వన్యప్రాణుల ఆవాసాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయాలి. నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలిన బాధ్యులపై తగిన చట్టపరమైన, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి.
- కరికె మహేశ్, చైర్మన్
శాతవాహన విద్యార్థి జేఏసీ
