చీకట్లను మిగిల్చిన దీపావళి..సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో 74 మందికి చికిత్స

చీకట్లను మిగిల్చిన దీపావళి..సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో 74 మందికి చికిత్స
  • కండ్లలో నిప్పురవ్వలతో దవాఖానలకు పరుగులు
  • సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో 74 మందికి చికిత్స
  • ఇందులో 37 మంది చిన్నారులు.. 12 మంది అడ్మిట్
  • ఇద్దరికి చూపు తిరిగొచ్చే అవకాశం లేదన్న వైద్యులు
  • భాగ్యనగరంలో పది చోట్లకు పైగా అగ్నిప్రమాదాలు
  • కూకట్‌‌‌‌పల్లి ఫైర్ యాక్సిడెంట్​లో రూ.2–3 కోట్ల ఆస్తినష్టం

హైదరాబాద్/మెహిదీపట్నం, వెలుగు: వెలుగుల పండుగ దీపావళి పలు కుటుంబాల్లో చీకట్లను మిగిల్చింది. టపాసులు కాలుస్తుండగా, పక్కన నిలబడి చూస్తుండగా నిప్పురవ్వలు కండ్లలో పడి, పటాకులు పేలి పలువురు గాయపడ్డారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు 74 మంది మెహిదీపట్నంలోని సరోజినీ దేవి కంటి దవాఖానకు వచ్చారు. వీరిలో 37 మంది చిన్నారులే. మరోవైపు హైదరాబాద్​లో పదికి పైగా చోట్ల అగ్నిప్రమాదాలు జరిగి గోదాములు, దుకాణాలు, వాహనాలు కాలిపోయాయి. కూకట్‌‌‌‌పల్లిలో మూడు గోదాములు బూడిదై రూ.2–3 కోట్ల ఆస్తినష్టం వాటిల్లింది. అగ్నిప్రమాదాల్లో ఎక్కడా ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇద్దరికి చూపు పోయినట్టే

కంటి గాయాలతో వచ్చిన 74 మందిలో 12 మందిని అడ్మిట్ చేసుకున్నామని సరోజినీ దేవి కంటి దవాఖాన సూపరింటెండెంట్ మోదిని తెలిపారు. పది మందికి ఇప్పటికే సర్జరీలు చేశామని, వారిలో ఇద్దరికి తిరిగి చూపు వచ్చే అవకాశం లేదని చెప్పారు. బాధితులు ఇంకా వస్తూనే ఉన్నారని, ఈ సంఖ్య 100 దాటొచ్చని అంచనా వేశారు.

రాకెట్ నేరుగా కంట్లోకి..

నారాయణఖేడ్‌‌‌‌కు చెందిన మోహన్ (32) బాలానగర్‌‌‌‌లో భార్య, ఇద్దరు పిల్లలతో ఉంటూ కూలి పనులు చేసుకుంటున్నాడు. ఆదివారం రాత్రి ఇంటి ముందు నిలబడి ఉండగా, పక్కన టపాసులు కాలుస్తున్నవాళ్లు వదిలిన రాకెట్ నేరుగా అతడి కంట్లోకి దూసుకెళ్లింది. ఎడమ కనుగుడ్డు బయటకు వచ్చి వేలాడటంతో వెంటనే సరోజినీ దేవి దవాఖానకు తరలించారు. డాక్టర్లు అతడి కనుగుడ్డును పూర్తిగా తొలగించాల్సి వచ్చింది. మల్లాపూర్‌‌‌‌కు చెందిన సాఫ్ట్‌‌‌‌వేర్ ఇంజనీర్ జగదీశ్ టపాసులు కాలుస్తుండగా చిచ్చుబుడ్డి పేలి కంటికి తీవ్ర గాయమైంది; అతడికి మంగళవారం సర్జరీ చేయనున్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌‌‌‌కు చెందిన అజయ్ (21) ఎడమ కంటికి, జియాగూడకు చెందిన తేజ (26) కుడి కంటికి గాయాలయ్యాయి. మల్కాజిగిరిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న సురేశ్ (40) సుతిలీ బాంబు పేలి కంట్లో రాయి తగిలి గాయపడ్డాడు.

చిన్నారులే ఎక్కువ

బోరబండకు చెందిన తొమ్మిదేండ్ల రహీం, సుతిలి బాంబు పేలకపోవడంతో దగ్గరికి వెళ్లి చూస్తుండగా అది ఒక్కసారిగా పేలి ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. షాద్‌‌‌‌నగర్‌‌‌‌కు చెందిన కిరణ్ కుమార్ (8) చిచ్చుబుడ్డి కాలుస్తుండగా అది పేలి నిప్పురవ్వలు కంట్లో పడ్డాయి. సైదాబాద్‌‌‌‌కు చెందిన సయ్యద్ మహమ్మద్ ఆరిఫ్ (11), భద్రాచలం హర్షపురానికి చెందిన ఆదర్శ్ (9), కందుకూరుకు చెందిన సహస్ (8) కండ్లలోనూ నిప్పురవ్వలు పడి తీవ్ర గాయాలయ్యాయి.

హైదరాబాద్ లో అగ్నిప్రమాదాలు

దీపావళి రాత్రి సిటీలో పదికి పైగా చోట్ల అగ్నిప్రమాదాలు జరిగాయి. చాలాచోట్ల టపాసుల నిప్పురవ్వలే కారణం కాగా, కొన్నిచోట్ల షార్ట్ సర్క్యూట్ కారణమని అనుమానిస్తున్నారు. కూకట్‌‌‌‌పల్లి పాపారాయుడునగర్‌‌‌‌లో ఆదివారం అర్ధరాత్రి దాటాక పేపర్ ప్లేట్లు, గ్లాసుల తయారీ యూనిట్‌‌‌‌లో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న హల్దీరామ్స్, నెయ్యి గోదాములకు వ్యాపించాయి. ఐదు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు.  సుమారు రూ.2–3 కోట్ల ఆస్తినష్టం జరిగిందని, షార్ట్ సర్క్యూటే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. పుత్లిబౌలి చౌరస్తా దగ్గర తారాజువ్వలు ఓ రెండంతస్తుల భవనంపై పడి గోదాంలో మంటలు చెలరేగగా, లోపలి ఫ్రిజ్‌‌‌‌లు, ఏసీల కంప్రెసర్లు భారీ శబ్దాలతో పేలడంతో స్థానికులు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. 

 చేవెళ్ల తహసీల్దార్ ఆఫీసు పక్కనున్న పాత పట్వారీ కార్యాలయంలో మంటలు చెలరేగి పలు పత్రాలు కాలిపోయాయి. అందులో రెవెన్యూ ఫైళ్లు లేవని, ఎన్నికల పుస్తకాలు, కుల, ఆదాయ పత్రాల స్క్రాప్ మాత్రమే ఉన్నాయని తహసీల్దార్ తెలిపారు. ఓల్డ్ కాప్రా చౌరస్తాలో, చిలకలగూడ మైలార్‌‌‌‌గడ్డ దగ్గర పటాకుల దుకాణాలు, నల్లకుంటలో 10 బైకులు, సికింద్రాబాద్ బండిమెట్‌‌‌‌లో ఓ డ్రగ్ మార్ట్, సీతాఫల్‌‌‌‌మండిలో పేపర్ గోడౌన్, జీడిమెట్లలో స్క్రాప్ గోదాం, మీర్‌‌‌‌పేట్‌‌‌‌లో ఓ సూపర్ మార్కెట్ కాలిపోయాయి. బేగంబజార్ పటేల్‌‌‌‌నగర్‌‌‌‌లో టపాసుల విషయంలో మొదలైన గొడవ కత్తులతో దాడికి దారితీసి ముగ్గురు గాయపడ్డారు.