వెలుగు స్పెషల్: ఇది ఎల్‌‌‌‌‌‌‌‌నిన్‌‌‌‌తో యుద్ధం..కావాలి మనమంతా సిద్ధం

వెలుగు స్పెషల్: ఇది ఎల్‌‌‌‌‌‌‌‌నిన్‌‌‌‌తో యుద్ధం..కావాలి మనమంతా సిద్ధం

యుద్ధం వచ్చినప్పుడు హద్దులన్నీ చెరిగిపోతాయి. అందరూ ఏకమై ప్రత్యర్థిని ఎదుర్కొంటారు.  నువ్వు, నేను అనే భేదభావం ఉండదు. నీటి ఎద్దడి విషయంలో ఇప్పుడు మనకు ఎదురవుతున్న పరిస్థితి అదే!  వాతావరణ మార్పుల ఫలితంగా వచ్చిన ఎల్‌‌‌‌నినో మనపై ఒక రకంగా యుద్ధమే ప్రకటించింది.  వర్షాలు లేవు.  దీర్ఘకాలం వర్షాభావ పరిస్థితుల వల్ల తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విద్యుదుత్పత్తికీ సమస్యే.  పట్టణ, నగర ప్రాంతాల్లో తాగునీటి సమస్య రోజురోజుకూ  జటిలమవుతోంది. రిజర్వాయర్లు సరిగ్గా నిండలేదు. పైగా మనం రాజధాని హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు కృష్ణా,  గోదావరి, మంజీరా ఇలా దూర ప్రాంతపు  నదుల నుంచి తాగునీరు తెచ్చుకుంటున్నాం. ఈ వ్యవస్థ అంతా ఎల్‌‌‌‌నినో వల్ల ప్రతికూలంగా ప్రభావితమవుతోంది. 

దీనికి తోడు భూగర్భ జలాలు రోజురోజుకూ అడుగంటుతున్నాయి. ఫలితంగా రానున్న ఏడెనిమిది మాసాల కాలం మనమంతా కఠినమైన పరిస్థితుల గుండా పయనించాల్సి ఉంటుంది.  ప్రభుత్వం, పరిశ్రమలు, కంపెనీలు, కార్పొరేట్లు, పౌరసమాజం,  ప్రజా సంఘాలు, ప్రజలు... ఇలా మనమంతా సమష్టిగా,  ప్రకృతి విసిరిన ఈ సవాల్‌‌‌‌ను సమర్థంగా ఎదుర్కోవాలి.  ఇది మనందరి ముందున్న తక్షణ కర్తవ్యం.

రెండు సంవత్సరాలకు సరిపడా ఆహారముంది. అందుకవసరమైన తిండి గింజలున్నాయి.  కానీ, నీళ్లే లేవు.  ప్రాణాధారమైన నీటి ఎద్దడితో పశుపక్ష్యాదులకు కూడా కష్టమొచ్చింది.  మోట బావులు లేవు. బోర్లు, ఎత్తిపోతల పథకాలు వచ్చాక బహిరంగ నీటి వనరులు తగ్గడం పశువులకు, వన్యమృగాలకు, పక్షులకు ఎంతో ఇబ్బందిగా ఉంది. చెరువులు కుంటలు ఎండిపోతున్న క్రమంలో వాటిగురించి ఆలోచించాల్సిన పరిస్థితులొచ్చాయి. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 21,500 చెరువులకుగాను 17,677 చెరువుల్లోకి వచ్చిన నీళ్లతో మట్టాలు సగంకన్నా తక్కువే నిండాయి. అందులోనూ12,944 చెరువులు, కుంటలు ఖాళీగా  ఉన్నాయి లేదా పావుకన్నా తక్కువ మట్టాల వరకే నీరొచ్చి చేరింది.  

వర్షాభావానికి తోడు సెప్టెంబర్– -అక్టోబర్ మాసాల్లో కాసిన తీవ్ర ఎండలకు, చెరువులు, కుంటల్లో పోగైన అరకొర నీరు కూడా ఆవిరయింది. మొత్తం చెరువులు, కుంటల సామర్థ్యం 254 టీఎంసీలుంటే అక్టోబర్ మాసాంతం నాటికి 94 టీఎంసీలకు పడిపోయింది. సూపర్ ఎల్-నినో ప్రభావం వచ్చే జనవరి-– ఫిబ్రవరి నాటికి తీవ్రస్థాయికి చేరవచ్చని నిపుణుల అంచనాలున్నాయి. రాష్ట్రంలోని 365 మండలాల్లో కరువున్నట్టు ప్రభుత్వం అక్టోబర్ 24న ప్రకటించింది. అప్పటికి తెలంగాణలో సగటున 17 శాతం వర్షపాతం లోటు నమోదయింది. రిజర్వాయర్లలో మొత్తం 585 టీఎంసీల నిలువ నీటి సామర్థ్యం ఉంటే, 179.63 టీంఎసీల నీరే అందుబాటులో ఉంది. గ్రామీణ తెలంగాణతో పోల్చి చూస్తే రాజధాని రేపటి కష్టాలు ఇంకా అధికం. ఇప్పట్నుంచే జాగ్రత్తపడకుంటే ఇబ్బందులు తీవ్రమవుతాయి.

అడుగంటుతున్న  భూగర్భ జల మట్టాలు 

 రాజధాని హైదరాబాద్ మహానగర నీటి విషయంలో తీవ్ర ఒత్తిడి ఉంది. రోజుకు సగటున 560 మిలియన్ గ్యాలన్ల (ఎంజిడి) నీటిని అందించాల్సి వస్తోంది. 1.3 కోట్ల జనాభా దాహం, రోజువారీ అవసరాలు తీర్చడానికి హైదరాబాద్ మహానగర తాగునీరు, -మురుగునీటి జలమండలి  పద్నాలుగు లక్షలకు పైగా కనెక్షన్ల ద్వారా నిత్యం నీటి సరఫరా చేస్తోంది.  ఉస్మాన్ సాగర్, హిమాయ‌‌‌‌‌‌‌‌త్ సాగర్ జంట జలాశయాలు ఇంకా నగరవాసుల గొంతు తడుపుతూనే ఉన్నాయి. ఈ రెండు రిజర్వాయర్ల నుంచే కాకుండా సింగూర్/మంజీరా ఫేజ్ 1, 2, కృష్ణా ఫేజ్ 1,2,3, గోదావరి ఫేజ్ 1,2, ద్వారా జంట నగరాలకు నీరందుతోంది. అంటే 150 నుంచి 200 కిలోమీటర్ల దూరం నుంచి నదీ జలాలను పైపులైన్ వ్యవస్థద్వారా ఇక్కడివరకు తెచ్చి, జాగ్రత్తగా పంపిణీ చేయాల్సి రావడమే ఒక భగీరథ యత్నం. ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలే చేపట్టాయి.  రోజూ 15 వేల ట్యాంకర్ల డిమాండ్ ఉంది. భూగర్భ జల మట్టాలు కూడా ఎల్-నినో ప్రభావం వల్ల అడుగంటుతున్నాయి. 

నిరుడు సరిగ్గా ఇదే సమయానికి 13.36 మీటర్ల లోతున అందుబాటులోవున్న భూగర్భ జలాలు నగరంలో ఈరోజు కొన్నిచోట్ల 32 మీటర్ల కన్నా దిగువకు జారిపోయాయి.  క్యూర్ పరిధిలో 14 మండలాల్లో కరువుంటే,  అయిదు మండ లాల్లో మరింత తీవ్ర కరువు తాండవిస్తోంది. నగరం కొత్తగా విస్తరిస్తున్న గచ్చిబౌలి, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్, నలగండ్ల, తెల్లాపూర్ వంటి ప్రాంతాల్లో 40, 50 అంతస్తుల స్కై రైజర్స్ వచ్చాయి. నాలుగయిదు ఎకరాల్లోనే రెండు, మూడు ఎత్తయిన టవర్స్ కట్టి వేల కుటుంబాలకు ఆశ్రయమిస్తున్నాయి. ఇటువంటి గేటెడ్ కమ్యూనిటీల తాగునీటి వ్యవస్థ ఎంతో సంక్లిష్టమైంది. ఈ ఒత్తిడి మరిన్ని రెట్లు పెరిగింది. ఇది మనమంతా గ్రహించాలి.

‘పానీ మొబైల్​ యాప్’ వాడండి

 నిబంధ‌‌‌‌‌‌‌‌నలకు విరుద్దంగా నీరు తోడేస్తున్న ప్రయివేటు నీటి వ్యాపారులపై ప్రభుత్వం కన్ను వేసింది. ప్రయివేటుతో సహా నీటి ట్యాంకర్లను మొత్తం ఒక పూల్ చేసి, అందరికీ నీరందేలా న్యాయబద్దమైన పంపిణీ మెరుగుపరిచే వ్యూహరచన చేస్తోంది. ‘పానీ’ మొబైల్ యాప్‌‌‌‌‌‌‌‌ను జలమండలి తయారు చేసి పకడ్బందీగా నిర్వహిస్తోంది. ప్రతి పౌరుడు ఇందులో చేరి తామెదుర్కొనే నీటి సమస్యల్ని జలమండలి దృష్టికి తేవొచ్చు. పరిష్కారాలు పొందవచ్చు, ఏదైనా మంచి ఆలోచన తడితే తగురీతిన సూచించవచ్చు. ఎక్కడైనా నీటి చౌర్యం, నీటివృథా, దుర్వినియోగం వంటివి జరుగుతుంటే తామున్న చోటు నుంచే యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అధికారులు వారి పేర్లు గోప్యంగా వుంచుతారు. ‘నీటి యుద్ధాలు’ (వాటర్ వారియర్స్)గా ఎన్నదగిన కృషి చేసిన  వారిని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రశంసించే ‘ములాఖత్‌‌‌‌‌‌‌‌’లను కూడా అధికారులు ఏర్పాటుచేస్తారు. 

నగరంతో నా అనుబంధం

విద్యార్థిగా, విద్యార్థి రాష్ట్ర నాయకుడిగా ‘మార్క్‌‌‌‌‌‌‌‌ఫెడ్‌‌‌‌‌‌‌‌’ చైర్మన్‌‌‌‌‌‌‌‌గా, ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీల కన్వీనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేసిన దశాబ్దాల కాలం నుంచి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌తో నాకు విడదీయరాని అనుబంధముంది.  ఇప్పుడు హైదరాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రిగా నాకు ఎంతో బాధ్యత ఉంది.  ఎల్-నినో  వల్ల ముంచుకు వచ్చిన నీటి ఎద్దడి సమస్యను దీటుగా ఎదుర్కొని, మనమంతా సురక్షితంగా వచ్చే వర్ష రుతువులోకి సాగిపోవాలని నా హృదయం క్షణక్షణం తలపిస్తోంది. పరిశ్రమలు, కంపెనీలు, కార్పొరేట్లు, ఇతర అన్ని వర్తక-వాణిజ్య సంస్థలు, ప్రజా సంఘాలు, పౌర సమాజం, వ్యక్తులుగా ప్రజలు ఈ యజ్ఞంలో సంపూర్ణంగా సహకరించాలి. 

ఉమ్మడి కృషితో గట్టెక్కుదాం

ప్రతి నీటి చుక్కనూ కాపాడుకోవాలి.  నీటి వృథాను నివారించాలి. బాధ్యతతో ప్రతి కుటుంబం కూడా తన సాధారణ నీటి వినియోగంలో కనీసం 20 శాతం తగ్గించుకోవాలి. వాన నీటిని ఒడిసిపట్టాలి. ఎల్-నినో ప్రభావకాలంలో నవంబర్-–డిసెంబర్ మాసాల్లో అల్ప పీడనాలు,- తుపానులు పెరిగే అస్కారముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.  ప్రతి ఇంటి ఆవరణలో,  వీధి పక్కన ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి. దానివల్ల నీరు భూమిలోకి ఇంకి ఎక్కడికక్కడ భూగర్భ జలమట్టాలు పెరుగుతాయి. ఎండిపోయిన బోర్లు మళ్లీ వినియోగంలోకి వస్తాయి. జంట నగరాలు, ముఖ్యంగా శివారుల్లో విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలల్లో విస్తారంగా నీటి సంరక్షణకు అవకాశం ఉంటుంది.   

పౌర సమాజం నడుం కట్టాలి

మానవ ప్రమేయ కాలుష్యాల వల్ల భూగ్రహం అసాధారణంగా వేడెక్కుతోంది. కర్భన ఉద్గారాలను వాతావరణంలోకి వదులుతున్నాం. దానివల్ల గ్లోబల్ వార్మింగ్ పెరిగి, వాతావరణ మార్పు సంక్షోభం తలెత్తింది. ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాల్ ఈ వాతావరణ మార్పే! అందులోంచి పుట్టిందే ఈ ఎల్‌‌‌‌నినో!  దీన్ని ఉమ్మడిగా ఎదుర్కోకుంటే తప్ప ముంచుకువస్తున్న నీటి ఎద్దడి సమస్యకు పరిష్కారం దొరకదు.  నీటి వృథాను నివారించి పొదుపుగా వాడుకోవాలి. వాన నీటిని సంరక్షించుకోవడం వంటి అంశాల్లో విస్తృతంగా ప్రచారం చేపట్టాలి. పౌర సమాజం స్వచ్ఛందంగా ముందుకురావాలి.  మురుగునీటి శుద్ధి ప్లాంట్‌‌‌‌‌‌‌‌ల  పనితీరును  గమనించాలి. 

అలా శుద్ధి చేసిన నీటిని భవన నిర్మాణాలు, పార్కుల నిర్వహణ, క్లీనింగ్ వంటి అవసరాలకు వినియోగించడం ద్వారా తాగునీటిపై ఒత్తిడి తగ్గించాలి. ఇది ఒక్క రాజధాని నగరంలోనే కాకుండా చిన్న నగరాలు, పట్టణాలు, పెద్ద గ్రామపంచాయతీలు.. ఇలా అన్ని స్థాయిలకు విస్తరించాలి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా నీటి వనరుల్ని సంరక్షిస్తూ నీటి పొదుపు చర్యలు ముమ్మరం చేయాలి.  ఎల్‌‌‌‌‌‌‌‌నినోతో యుద్ధాన్ని వ్యూహాలతోనే  ఎదుర్కొందాం. కలిసికట్టుగా నిలిచి గెలుద్దాం. 

- పొన్నం ప్రభాకర్, రవాణా, బీసీ  సంక్షేమశాఖల మంత్రి 

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ 
[email protected] 
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. 
స్వీయ రచన అయి ఉండాలి. 
రచన 700 పదాలకు మించరాదు.