డిసెంబర్ 7 నుంచి మెగా క్లైమేట్ కాంక్లేవ్..హాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులకు ఆహ్వానాలు

డిసెంబర్ 7 నుంచి మెగా క్లైమేట్ కాంక్లేవ్..హాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులకు ఆహ్వానాలు
  • గ్లోబల్ ఎకో వారియర్లతో అంతర్జాతీయ వేదిక
  • ఎల్‌‌‌‌‌‌‌‌నినో ముప్పును ఎదుర్కొనేందుకు పక్కా కార్యాచరణ
  • కరువు నివారణకు నెలకు రూ.1,000 కోట్లు సమీకరించే యోచన
  • గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఎయిర్ రంగాల్లో పెట్టుబడులే లక్ష్యం
  • సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌లో ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి రివ్యూ

హైదరాబాద్, వెలుగు: ‘ఇన్వెస్ట్ తెలంగాణ – గ్లోబల్ సమ్మిట్ 2026’లో భాగంగా డిసెంబర్ 7 నుంచి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ‘మెగా క్లైమేట్ కాంక్లేవ్’ను నిర్వహించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్లు, ఎల్‌‌‌‌‌‌‌‌నినో ముప్పును ఎదుర్కొనే ప్రణాళికలే ప్రధాన అజెండాగా ఈ సదస్సు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు పర్యావరణ పరిరక్షణ కోసం పనిచేసే గ్లోబల్ ఐకాన్ల గళాన్ని ఈ వేదిక ద్వారా ప్రపంచానికి వినిపించనున్నట్లు తెలిపారు. సోమవారం సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌లో సదస్సు సన్నాహకాలపై మంత్రి ఉత్తమ్‌‌‌‌‌‌‌‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పర్యావరణ, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, పీసీసీఎఫ్ వినయ్ కుమార్, టీజీ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌కో ఎండీ డి.కృష్ణ భాస్కర్, ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సదస్సులో నిర్వహించే సెషన్ల సంఖ్య లేదా పాల్గొనే వారి సంఖ్య ముఖ్యం కాదని, చర్చల నాణ్యత, వక్తల స్థాయి, అంతర్జాతీయ ప్రచారం, రాష్ట్రానికి వచ్చే హరిత పెట్టుబడులు, క్షేత్రస్థాయిలో అమలయ్యే ఫలితాలే అసలైన విజయమని పేర్కొన్నారు. సదస్సును రద్దీగా కాకుండా, స్పష్టమైన లక్ష్యాలతో రెండ్రోజుల పాటు ప్రభావవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

ఎల్‌‌‌‌‌‌‌‌నినో ముప్పుపై ముందస్తు వ్యూహం..

భవిష్యత్తులో రాష్ట్రానికి పొంచి ఉన్న ఎల్‌‌‌‌‌‌‌‌నినో ముప్పు తీవ్రతను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తుగానే పక్కా వ్యూహం రచిస్తోందని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. వర్షాభావ పరిస్థితులు, తాగు-, సాగు నీటి కొరత, వ్యవసాయ రంగంలో సంక్షోభం, పెరిగే ఉష్ణోగ్రతలు, విద్యుత్ డిమాండ్‌‌‌‌‌‌‌‌ను సమర్థంగా అధిగమించేందుకు శాస్త్రీయ, దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరమని స్పష్టం చేశారు.

ముఖ్యంగా మార్చి నుంచి మే వరకు ఉండే తీవ్రమైన వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని కరవు నివారణ, ఉపశమన చర్యల కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రతి నెలా దాదాపు రూ.1,000 కోట్ల చొప్పున సమీకరించేందుకు సిద్ధంగా ఉన్నారని గుర్తుచేశారు. ఈ సదస్సు కోసం అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రముఖులను అధికారిక, దౌత్య మార్గాల ద్వారా ఆహ్వానించాలని అధికారులకు మంత్రి సూచించారు.

ప్రముఖ పర్యావరణవేత్తలు రాజేంద్ర సింగ్, సునీతా నారాయణ్, ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్, నార్వే మాజీ పర్యావరణ మంత్రి ఎరిక్ సోల్హీమ్ వంటి వారిని ఆహ్వానితుల జాబితాలో చేర్చినట్లు వివరించారు. పర్యావరణ పరిరక్షణలో ముందుండే సినీ నటి దియా మీర్జాను కర్టన్ రైజర్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌కు ఆహ్వానించే అవకాశాలను పరిశీలించాలన్నారు. వీరితో పాటు కేంద్ర మంత్రులు, నార్వే, డెన్మార్క్, స్వీడన్ దేశాల రాయబారులు, జాతీయ స్థాయి పర్యావరణ, రాజకీయ ప్రముఖులను భాగస్వామ్యం చేయాలని సూచించారు.

హరిత పెట్టుబడులే లక్ష్యం..

ఈ సదస్సు కేవలం ప్రసంగాలకే పరిమితం కాకుండా పర్యావరణ హిత వ్యాపారాలు, పెట్టుబడులను ఆకర్షించే కీలక వేదికగా మారాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆకాంక్షించారు. క్లీన్ ఎయిర్, పునరుత్పాదక ఇంధనం, క్లైమేట్ ఫైనాన్స్, జల సంరక్షణ, గ్రీన్ టెక్నాలజీ, సస్టైనబుల్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్, వ్యర్థాల నుంచి సంపద (వేస్ట్ టు వెల్త్) తయారీ వంటి రంగాల్లో పెట్టుబడులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అమలు అవుతున్న విజయవంతమైన మోడళ్లను ప్రపంచానికి చాటిచెప్పాలని సూచించారు.

ముఖ్యంగా మణికొండ రెసిడెన్షియల్ కమ్యూనిటీ చేపట్టిన భూగర్భ జలాల రీఛార్జ్ విధానం, కన్హా శాంతివనంలో చేపట్టిన ప్లాంటేషన్, నేల పరిరక్షణ చర్యలను సదస్సులో ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన సదస్సు కేవలం నిపుణుల ప్రజెంటేషన్లకే పరిమితం కాకుండా, వాతావరణ మార్పుల వల్ల ప్రత్యక్షంగా నష్టపోయే వర్గాల గళం కూడా ఇందులో ప్రతిధ్వనించాలని సూచించారు. ఇందుకోసం డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో జరిగే అంతర్జాతీయ కాంక్లేవ్‌‌‌‌‌‌‌‌కు ముందే, నవంబర్ 28న వివిధ రంగాలకు చెందిన దాదాపు 100 మంది క్షేత్రస్థాయి ప్రతినిధులతో ప్రత్యేక సన్నాహక సంప్రదింపుల సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.