- ఏపీ సీఎం చంద్రబాబు సంచలన ప్రతిపాదన
- రూ.100, రూ.200 నోట్లే చలామణిలో ఉండాలె
- అవినీతిని కట్టడి చేసేందుకు డిజిటల్ కరెన్సీయే మార్గం
- త్వరలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాస్తా
- ఏపీ స్థానిక ఎన్నికల్లో కూటమికి 58.9% ఓట్లు: బాబు
అమరావతి, వెలుగు: దేశంలో అవినీతిని అరికట్టాలంటే రూ.500 నోట్లను కూడా రద్దు చేయాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రతిపాదించారు. రోజువారీ లావాదేవీలకు రూ.100, రూ.200 నోట్లు మాత్రమే చలామణిలో ఉండాలని సూచించారు. అవినీతి నియంత్రణకు డిజిటల్ కరెన్సీని విస్తృతంగా ప్రోత్సహించడమే మార్గమని అభిప్రాయపడ్డారు. ఈ ప్రతిపాదనలపై త్వరలో ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తానని వెల్లడించారు. సోమవారం అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో రూ.1,000, రూ.2,000 నోట్ల రద్దును డిమాండ్ చేసిన విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు.
ప్రస్తుతం ప్రధానంగా చలామణిలో ఉన్న రూ.500 నోటును కూడా ఉపసంహరించాలని కేంద్రాన్ని కోరారు. పెద్ద నోట్ల రద్దుతో అవినీతికి అడ్డుకట్ట వేయవచ్చని పేర్కొన్నారు. డిజిటల్ లావాదేవీలతో అక్రమ చెల్లింపులను సులభంగా గుర్తించే అవకాశం ఉంటుందని చెప్పారు. గతంలో డిజిటల్ కరెన్సీపై తాను ఇచ్చిన నివేదిక, చేసిన సూచనలను ప్రస్తావించారు. సాంకేతికతను సమర్థంగా వినియోగించుకుంటే రాష్ట్రం, దేశం ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందుతాయని చంద్రబాబు అన్నారు. టెక్నాలజీ ఆధారిత వ్యవస్థలతో సంపద సృష్టి జరిగి, పేదరిక నిర్మూలనకు మార్గం సుగమమవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
స్థానిక ఎన్నికల్లో కూటమికి 58.9 శాతం ఓట్లు
ఏపీలో పట్టణ, పరిషత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు ఘన విజయం సాధించాయని చంద్రబాబు తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే కూటమికి ప్రజాదరణ మరింత పెరిగిందన్నారు. పట్టణ, పరిషత్ ఎన్నికల్లో కలిపి కూటమికి 58.9 శాతం ఓట్లు వచ్చాయని వెల్లడించారు. 2024 ఎన్నికల్లో వచ్చిన 55.3 శాతంతో పోలిస్తే 3.6 శాతం పెరిగిందన్నారు. వైసీపీ ఓట్ల శాతం 39.81 నుంచి 33.56కు పడిపోయిందని, ఆ పార్టీకి 6.25 శాతం ఓట్లు తగ్గాయని చెప్పారు. రెండు పార్టీల మధ్య ఓట్ల శాతం వ్యత్యాసం 25.34 శాతంగా ఉందని తెలిపారు. పట్టణ స్థానిక సంస్థల్లో కూటమికి 59.9 శాతం, వైసీపీకి 34.3 శాతం ఓట్లు వచ్చాయని చంద్రబాబు వెల్లడించారు.
