నెత్తిన అప్పు.. చేతికి చిప్ప.. కేసీఆర్ పాలనపై సీఎం ఫైర్

నెత్తిన అప్పు.. చేతికి చిప్ప.. కేసీఆర్ పాలనపై సీఎం ఫైర్
  • పదేండ్లలో 8 లక్షల కోట్ల అప్పు చేసి ఫాంహౌజ్​లో పన్నడు
  • భుజాన మోసిన పాలమూరు 
  • గుండెలపై తన్ని గజ్వేల్ పారిపోయిండు
  • సంక్రాంతి తర్వాత ‘ప్రజాబలం’తో వస్తా
  • దెబ్బకు మోదీ, కేడీ గుండెల్లో రైళ్లు పరిగెత్తాలె
  • పోలేపల్లి ఎల్లమ్మ మీద ఒట్టేసి చెప్తున్న 
  • 2028 కల్లా కొడంగల్​కు కృష్ణా జలాలు తెస్తం 
  • తుఫాన్ వచ్చినా 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు 
  • కొడంగల్ నియోజకవర్గంలో రూ.9,053 కోట్లతో
  • పలు అభివృద్ధి పనులకు రేవంత్​ శంకుస్థాపన

హైదరాబాద్, వెలుగు:  పదేండ్ల  పాలనలో ప్రజలు కట్టిన పన్నుల రూపంలో రూ.20 లక్షల కోట్ల ప్రజాధనం చేతికి వచ్చినా కేసీఆర్​ మాత్రం దొరికినకాడల్లా అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని ఏకంగా రూ.8 లక్షల కోట్ల రుణాల ఊబిలోకి నెట్టారని  సీఎం రేవంత్​ మండిపడ్డారు. నెత్తిన అప్పు.. చేతిలో చిప్పపెట్టిన కేసీఆర్ ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌లో బోర్లబొక్కల పండుకున్నారని ఎద్దేవా చేశారు. ‘‘కేసీఆర్ తింటే బకాసురుడు.. పంటే కుంభకర్ణుడు! ఫామ్‌‌‌‌హౌస్ దాటి రాడు, అసెంబ్లీకి పిలిచినా పలకడు. కుంభకర్ణుడిలా ఆరు నెలలు నిద్రలేవడు.. బకాసురుడిలా మొదలుపెడితే ఆపడు’’ అని ఫైర్​అయ్యారు. 

కొడంగల్ నియోజకవర్గంలో రూ.9,053 కోట్లతో పలు అభివృద్ధి పనులకు సోమవారం సీఎం శంకుస్థాపన చేశారు.  పోలేపల్లి ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి పాదయాత్రగా  బయలుదేరి వచ్చి లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్ ఆవరణలో ఏర్పాటు చేసిన “రైతన్నతో ఆత్మీయ సభ” బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. కేసీఆర్ చేసిన  అప్పులకు ఈ మూడేండ్లలోనే అసలు, వడ్డీల కింద ఇప్పటికే రూ.2 లక్షల కోట్లకు పైగా చెల్లించామని, తాము పస్తులున్నా సరే ఏటా రూ.80 వేల కోట్ల చొప్పున కేసీఆర్ పాపాలకు చెల్లించాల్సి వస్తోందన్నారు.

ఎన్ని ఆర్థిక సమస్యలున్నా రాష్ట్రంలోని ఐదున్నర లక్షల మంది ఉద్యోగులకు ఒకటో తారీఖునే ఠంచన్‌‌‌‌గా జీతాలు ఇస్తున్నామని సీఎం స్పష్టం చేశారు.  సీఎంగా బాధ్యతలు చేపట్టి సచివాలయానికి వెళ్లిన మొదటి రోజే ఎదురైన చేదు అనుభవాన్ని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ‘‘డిసెంబర్ 7న సెక్రటేరియట్‌‌‌‌కు వెళ్లగానే సీఎస్ వచ్చి ఉద్యోగులు జీతాల కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్, రూ.3 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్ ఉన్న ధనిక రాష్ట్రంలో 7వ తేదీ వచ్చినా జీతాలు ఎందుకు ఇవ్వలేదని అడిగితే.. రాష్ట్రం రూ.8 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని సీఎస్ అన్నారు. 

అబద్ధాలు చెప్పడం, ప్రజలను ముంచే విద్య నాకు తెల్వదు’’ అని రేవంత్ చెప్పారు. వెంటనే ఆర్థిక శాఖను రోశయ్య లాంటి గట్టి మనిషి, పైసలు ఇవ్వాలంటే తూకం వేసి ఇచ్చే భట్టి విక్రమార్కకు అప్పగించామన్నారు. నాటి పాలమూరులో కంపచెట్లు, పల్లేరు గాయలు, పలుగు రాళ్లల్లో నడిచినట్టే ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు కష్టపడి, ఆర్బీఐ, ఆర్థిక నిపుణులతో చర్చించి వ్యవస్థను గాడిలో పెట్టామని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో 5.5 లక్షల రెగ్యులర్ ఉద్యోగులు, 5 లక్షల మంది కాంట్రాక్ట్, ఔట్‌‌‌‌సోర్సింగ్ కలిపి 11 లక్షల మంది పనిచేస్తున్నారని సీఎం తెలిపారు. ఒకటో తేదీన జీతం రాకపోతే వారి ఇంటి అద్దె, బిల్లులు, పిల్లల ఫీజులు, దవాఖాన ఖర్చులు ఎలా గడుస్తాయని ప్రశ్నించారు. 

అందుకే తుఫాను వచ్చినా, భూకంపం వచ్చినా ఒకటో తారీఖునే జీతాలు పడాలని ఆదేశించానని, 2024 జనవరి 1 నుంచి ఒకటో తేదీనే ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు వేస్తున్నామన్నారు. ప్రతినెలా 5వ తేదీ లోపు కాంట్రాక్ట్, ఔట్‌‌‌‌సోర్సింగ్ సిబ్బందికి, 10 లోపు స్కూళ్లు, సంక్షేమ పథకాలకు నిధులు, 10 నుంచి 20వ తేదీ వరకు సర్పంచులు, ఎంపీటీసీలు, కాంట్రాక్టర్ల పనుల బిల్లులు క్లియర్ చేస్తున్నామని షెడ్యూల్‌‌‌‌ను వివరించారు.   

పాలమూరు ప్రజల్ని గుండెల మీద తన్నిండు..

తెలంగాణ వస్తే పాలమూరు కష్టాలు తీరుతాయని, వలసలు ఆగుతాయని నమ్మి నాడు కేసీఆర్‌‌‌‌ను గుండెల్లో పెట్టుకుని గెలిపిస్తే.. ఆయన అధికారంలోకి వచ్చాక ఈ జిల్లా ప్రజల గుండెలపై తన్ని నట్టేట ముంచాడని సీఎం   విమర్శించారు.  ‘‘2009లో కేసీఆర్ ఎంపీగా, నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కొడంగల్ మీటింగ్‌‌‌‌కు ఆయన్ను నేనే తెచ్చాను. అప్పుడు కేసీఆర్ నాతో.. ‘రేవంత్, గుర్తుపెట్టుకో.. మనం రాగానే ఎత్తిపోతల పథకాలన్నీ పూర్తి చేద్దాం’ అన్నాడు. ఎత్తిపోతలంటే కల్వకుర్తి, పాలమూరు ప్రాజెక్టులు అనుకున్నా. కానీ ఆయన ఉద్దేశంలో ఎత్తిపోతలంటే ప్రాజెక్టులు కాదని.. అడ్డగోలుగా ‘ఎత్తుడు.. తాగేందుకు పోసుడే’ అని నాకు తర్వాత అర్థమైంది’’ అని సీఎం ఎద్దేవా చేశారు. 

తెలంగాణ కోసం దర్గాలలో ఛాదర్ కప్పి, దేవాలయాల్లో దండంపెట్టి, చర్చిల్లో ప్రార్థనలు చేసి, కనిపించిన రాయికల్లా మొక్కి కేసీఆర్‌‌‌‌ను గెలిపిస్తే.. ఆయన సీఎం అయ్యాక జిల్లా రుణం తీర్చుకోకపోగా ప్రజలను కృష్ణా నదిలో ముంచి గజ్వేల్, మెదక్‌‌‌‌కు పారిపోయారని సీఎం ధ్వజమెత్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు తాగడానికి గుక్కెడు మంచినీళ్లు ఇచ్చినా గుర్తుపెట్టుకోవడం తెలంగాణ సంస్కృతి అని, కానీ కేసీఆర్ పాలమూరుపై కక్షగట్టారని విమర్శించారు. నాడు తాను గవర్నర్‌‌‌‌ను, సీఎంను అడిగి సాధించుకున్న ‘మక్తల్–నారాయణపేట–కొడంగల్’ ఎత్తిపోతల ప్రాజెక్టును కేసీఆర్ పదేండ్లు తొక్కిపెట్టి నీళ్లివ్వకుండా చేశారన్నారు. 

పాలమూరు ప్రజల ఆక్రందనలను ఆలకించి 2023 డిసెంబర్ 7న ముక్కోటి దేవతలు ఒక్కటై కొడంగల్ బిడ్డను సీఎం పీఠంపై కూర్చోబెట్టారని చెప్పారు. ఎల్బీ స్టేడియంలో సోనియమ్మ ఆశీర్వాదంతో, ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అండతో సీఎంగా ప్రమాణం చేసిన నాటి నుంచి ఒక్క రోజు, ఒక్క గంట కూడా విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నానని స్పష్టం చేశారు. సంక్రాంతి తర్వాత ‘ప్రజాబలం’ కార్యక్రమం తీసుకుని కొడంగల్ గడ్డ నుంచే రాష్ట్రమంతా తిరుగుతానని, ప్రజా బలంతో సృష్టించే సునామీ దెబ్బకు ఢిల్లీలోని మోదీ, ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌లోని కేడీ (కేసీఆర్​) కొట్టుకుపోవాలన్నారు.  ‘ఔర్ ఏక్ బార్ కాంగ్రెస్ సర్కార్’ అని గట్టిగా నినదించి మోడీలు, కేడీల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

కొడంగల్​కు నీళ్లిస్తే కడుపు మంట ఎందుకు?

‘‘కొడంగల్‌‌‌‌కు సాగునీరు వస్తుంటే మీకు కడుపుమంట ఎందుకు? పదేండ్లు మీరు ప్రాజెక్టులను తొక్కిపెట్టి మక్తల్, నారాయణపేట, కొడంగల్‌‌‌‌ను ఎడారిగా మార్చారు. ఇవాళ మా వాకిటి శ్రీహరి, శివకుమార్, కొడంగల్ బిడ్డలంతా కలిసి రైతులను ఒప్పించి, భూసేకరణ పూర్తి చేసి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేసుకుంటుంటే అడ్డుకుంటారా? ఎవడడ్డం పడ్డా తొక్కుకుంటూ పోతాం, కృష్ణా నదిలో ముంచైనా సరే నీళ్లు తెస్తాం. 2028 డిసెంబర్ నాటికి కృష్ణా జలాలను కొడంగల్ బీళ్లకు తీసుకొచ్చి, పంటలు పండించే బాధ్యత నాది. ఇది పోలేపల్లి ఎల్లమ్మ మీద ఆన.. మీ బిడ్డగా నా మాట. ఊరికే ఎల్లమ్మకు దండం పెట్టి రాలేదు.. ఒట్టు తిని బయల్దేరినం’’ అని సీఎం స్పష్టం చేశారు. ఇప్పటికే తాండూరు ప్రజల దాహార్తిని తీర్చేందుకు కాగ్నా నది జలాలను అందించామని, తాండూరు, కొడంగల్ ప్రాంతంలో సుమారు 3 వేల ఎకరాల్లో పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేసి వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.

గడ్డం పెంచినంత మాత్రాన రేవంత్ వి కాలేవు కేటీఆర్

ఎన్ని అడ్డంకులు ఎదురైనా కొడంగల్ ఆత్మగౌరవాన్ని దేశం గర్వించేలా నిలబెడతానని సీఎం తేల్చిచెప్పారు.‘‘నల్లమల అడవిలో పులి బయటకు వస్తే భయంతో, భక్తితో జంతువులన్నీ దండం పెడతాయి. అది చూసి ఓ నక్క.. పులి ఒంటిపై చారలున్నందుకే అందరూ మొక్కుతున్నారని తెలిసి, కర్రు కాల్చి ఒళ్లంతా వాతలు పెట్టుకుందట. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నంత మాత్రాన పులి కానట్టే.. కేటీఆర్ గడ్డం పెంచినంత మాత్రాన రేవంత్ రెడ్డి కాలేడు’’ అని ఎద్దేవా చేశారు. ‘‘కేటీఆర్.. నీకు గడ్డం రావడానికే 50 ఏండ్లు పట్టింది, దేవుడు బుద్ధి ఇవ్వడానికి ఇంకెన్ని ఏండ్లు పడుతుందో. దుబాయ్ పోయి కోట్ల రూపాయల ఫీజులిచ్చి కన్సల్టెంట్లను పెట్టి, రేవంత్ రెడ్డి సభలకు జనం ఎందుకు వస్తున్నారని అడిగితే.. ఆయనకు గడ్డం ఉంది, నీకు లేదని చెప్పారట. 

దాంతో గడ్డమే కదా అని నాట్లు వేయించుకున్నాడు. గడ్డం పెంచితే రేవంత్ అయిపోతారా? కేటీఆర్.. నీ గడ్డం మోకాళ్ల దాకా పెరిగినా, 10 జన్మలు ఎత్తినా, తాటిచెట్టుకు ఉరేసుకున్నా, గండిపేట చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నా నువ్వు రేవంత్‌‌‌‌వి కాలేవు. నీకున్న ఉద్దెర పేరు తారకరామారావువే తప్ప రేవంత్‌‌‌‌వి కాలేవు. రేవంత్ కావాలంటే గుండెధైర్యం, కార్యకర్తలకు కొండంత గుండె, ప్రాణమిచ్చే త్యాగగుణం, నమ్ముకున్నోడి వెంట నడిచే నైజం ఉండాలి. నమ్మినోళ్లను నట్టేట ముంచే లక్షణం ఉన్నోడివి నువ్వెలా రేవంత్‌‌‌‌వి అవుతావు? చంద్రశేఖర్ రావు.. నీ కొడుక్కి చెప్పు, ఆ పోకిరి వేషాలు మానమను, గంజాయి మాటలు బంద్ చేయమను. ఎక్కుతావో, దిగుతావో తేల్చుకో’’ అని అన్నారు.

పదేండ్లలో చంద్రశేఖరరావు చేతికి రాష్ట్ర ప్రజలు పన్నుల రూపంలో 20 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు.. ఆ 20 లక్షల కోట్లు కాకుండా.. దొర్కిన కాడల్లా.. అందిన కాడల్లా అప్పులు తెచ్చిండు.. ఇట్లా 8 లక్షల 11 వేల కోట్ల రూపాయల అప్పు నెత్తిమీద పెట్టి.. చేతిలో చిప్ప పెట్టి అయ్యగారు పోయి ఫాంహౌస్ లో బోర్లా బొక్కల పండుకున్నడు..

– సీఎం రేవంత్​రెడ్డి