తరతరాలుగా తమ శ్రమను, నైపుణ్యాన్ని సమాజ అభివృద్ధికి అంకితం చేసిన వృత్తి సమూహాల్లో విశ్వబ్రాహ్మణుల పాత్ర విశిష్టమైనది. వడ్రంగులు, కమ్మరులు, కంచరులు, స్వర్ణకారులు, శిల్పకారుల వంటి వృత్తులతో అనుబంధం కలిగిన ఈ సమాజం భారతీయ సంస్కృతికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు విలువైన సేవలందించింది. దేవాలయాల నిర్మాణం నుంచి వ్యవసాయ పనిముట్ల తయారీవరకు, ఆభరణాల రూపకల్పన నుంచి గృహ నిర్మాణం వరకు వారి నైపుణ్యం విస్తరించింది. వీరి వృత్తులు కేవలం ఉపాధి మార్గాలు మాత్రమే కాదు.. మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలు. అయితే మారుతున్న కాలం, యాంత్రీకరణ, పారిశ్రామికీకరణ, ఆధునిక మార్కెట్ పోటీ మధ్య ఈ సంప్రదాయ వృత్తులు మనుగడ కోసం పోరాడుతున్నాయి. సమాజానికి అవసరమైన వస్తువులను సృష్టించిన చేతులే నేడు ఆర్థిక భద్రత కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడటం ఆందోళనకరం.
పారిశ్రామికీకరణ, యాంత్రీకరణ చేతివృత్తుల స్వరూపాన్నే మార్చేశాయి. యంత్రాల ద్వారా తక్కువ సమయంలో భారీగా తయారయ్యే వస్తువులు మార్కెట్‌ను ఆక్రమించడంతో చిన్న వృత్తిదారులు పోటీలో వెనుకబడుతున్నారు. ముడిసరుకుల ధరలు పెరగడం, పెట్టుబడుల కొరత, తయారైన వస్తువులకు గిట్టుబాటు ధర లభించకపోవడం, మధ్యవర్తుల ఆధిపత్యం వారి ఆదాయాన్ని దెబ్బతీస్తున్నాయి. ఒకప్పుడు కుటుంబానికి గౌరవప్రదమైన జీవనాధారంగా ఉన్న వృత్తులు నేడు కనీస అవసరాలను తీర్చలేని స్థితికి చేరుకోవడం విచారకరం. ఫలితంగా యువత పూర్వీకుల వృత్తులను కొనసాగించడానికి ఆసక్తి చూపడం లేదు. నైపుణ్యం వారసత్వంగా వస్తున్నా, దానితో గౌరవప్రదమైన జీవనం సాగించే పరిస్థితులు మాత్రం కరువవుతున్నాయి.
పథకంతో లబ్దిదారుల ఆదాయం పెరగాలి
ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు చేపడుతున్న చర్యల్లో ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం ప్రస్తావనీయమైనది. 2023 సెప్టెంబర్ 17న ప్రారంభమైన ఈ పథకం కోసం 2023–-24 నుంచి 2027–-28 వరకు రూ.13 వేల కోట్ల నిధులను కేటాయించారు. వడ్రంగి, కమ్మరి, స్వర్ణకారుడు, శిల్పకారుడు తోపాటు13 సంప్రదాయ వృత్తులకు చెందిన అర్హులైన చేతివృత్తిదారులకు శిక్షణ, ఆధునిక పనిముట్లు, రుణ సదుపాయం, మార్కెటింగ్ సహాయం అందించడం దీని ప్రధాన లక్ష్యం. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2026 సెప్టెంబర్ 15 నాటికి ఈ పథకం కింద 30 లక్షల మంది నమోదు లక్ష్యం పూర్తయింది.
24.37 లక్షల మందికి ప్రాథమిక నైపుణ్య శిక్షణ అందించగా, 18.16 లక్షల మందికి ఆధునిక పనిముట్ల సహాయం లభించింది. 6.19 లక్షలకు పైగా రుణాలు మంజూరుకాగా, వాటి విలువ సుమారు రూ.5,316 కోట్లు. డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహకంగా 8.11 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు రూ.42 కోట్లకు పైగా అందించారు. ఈ గణాంకాలు సంప్రదాయ వృత్తిదారుల అభివృద్ధికి ప్రభుత్వ పథకాల ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయి. అయితే నమోదు సంఖ్యలు పెరగడమే విజయానికి కొలమానం కాదు. లబ్ధిదారుల ఆదాయం ఎంత పెరిగింది? ఎంతమంది వృత్తులను కొనసాగించగలుగుతున్నారు? అనే అంశాలే అసలైన ఫలితాలను నిర్ణయిస్తాయి.
ఈ పథకం కింద అర్హులైన వృత్తిదారులకు ఐదు నుంచి ఏడు రోజుల ప్రాథమిక శిక్షణ, తదుపరి ఉన్నత శిక్షణ, రోజుకు రూ.500 స్టైపెండ్, పనిముట్ల కొనుగోలుకు గరిష్ఠంగా రూ.15 వేల ప్రోత్సాహకం కల్పిస్తున్నారు. అలాగే రెండు విడతల్లో గరిష్టంగా రూ.3 లక్షల వరకు పూచీకత్తు లేని రుణాన్ని ఐదు శాతం రాయితీ వడ్డీతో అందించే అవకాశం ఉంది. ఇవి చిన్న వృత్తిదారులకు ఉపయోగపడే చర్యలే. అయినప్పటికీ అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ ప్రయోజనాలు చేరుతున్నాయా? రుణాల మంజూరులో బ్యాంకుల నుంచి ఎదురవుతున్న ఇబ్బందులు తొలగుతున్నాయా? శిక్షణ అనంతరం ఉపాధి, మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తున్నారా? అనే అంశాలపై నిరంతర పర్యవేక్షణ అవసరం. ఈ వృత్తులపై ఆసక్తి ఉన్నవారికి కంప్యూటర్ ఆధారిత డిజైనింగ్, ఆధునిక తయారీ పద్ధతులు, వ్యాపార నిర్వహణ, డిజిటల్ మార్కెటింగ్‌లో శిక్షణ కల్పించాలి.
తెలంగాణలో..
తెలంగాణలోనూ ఈ అంశంపై ప్రత్యేక దృష్టి అవసరం. కేంద్ర పథకం అమలుకు సంబంధించి 2024 సెప్టెంబరులో వెల్లడించిన గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 2,89,431 నమోదులు జరిగాయి. అయితే అప్పటికి మూడు దశల పరిశీలన పూర్తి చేసుకున్నవారు 55,824 మంది మాత్రమే. ఆ సమయంలో 26 జిల్లాల్లో శిక్షణ కేంద్రాలు పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఇవి అప్పటి గణాంకాలే అయినప్పటికీ నమోదు నుంచి వాస్తవ ప్రయోజనాల వరకు ఉన్న అంతరాన్ని సూచిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాల వారీగా ఎంతమంది శిక్షణ పొందారు? ఎంతమందికి రుణాలు అందాయి? ఎంతమంది స్వయం ఉపాధి యూనిట్లు ప్రారంభించారు? అనే తాజా వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉంచాలి. విశ్వబ్రాహ్మణుల సంప్రదాయ వృత్తులకు ప్రత్యేక శిక్షణ కేంద్రాలు, ఆధునిక పనిముట్ల పంపిణీ, మార్కెట్ అనుసంధానం వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.
దేశ సాంస్కృతిక వారసత్వం.. విశ్వబ్రాహ్మణుల వృత్తులు..
సంప్రదాయ వృత్తులను పూర్తిగా వదులుకోవడమే అభివృద్ధి కాదు. పూర్వీకుల నుంచి సంక్రమించిన కళానైపుణ్యాన్ని ఆధునిక సాంకేతికతతో అనుసంధానించాలి. చేతితో తయారుచేసిన ఆభరణాలు, చెక్క శిల్పాలు, లోహకళాఖండాలకు ప్రత్యేక గుర్తింపు కల్పించి దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు అనుసంధానం చేయాలి. ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు కంపెనీలు, విద్యాసంస్థలు సమన్వయంతో పనిచేస్తే ఈ వృత్తులు ఆధునిక వ్యాపారాలుగా ఎదిగే అవకాశం ఉంది. విశ్వబ్రాహ్మణుల జీవనపోరాటం ఒక సమాజానికి సంబంధించిన సంక్షేమ సమస్య మాత్రమే కాదు.. దేశ సంప్రదాయ చేతివృత్తుల మనుగడ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణతో ముడిపడిన అంశం. తరతరాలుగా సమాజానికి అవసరమైన వస్తువులను సృష్టించిన చేతులకు ఆర్థిక భద్రత కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. వారి నైపుణ్యానికి గుర్తింపు, శ్రమకు గిట్టుబాటు, కుటుంబాలకు భద్రత, యువతకు మెరుగైన భవిష్యత్తు కల్పించినప్పుడే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుంది. సంక్షేమ పథకాల కోసం ఎదురుచూసే స్థితి నుంచి స్వయం సమృద్ధి సాధించే స్థాయికి విశ్వబ్రాహ్మణ సమాజం ఎదగాలి. పథకాల లెక్కలకంటే పేదల జీవితాల్లో వచ్చిన మార్పే అభివృద్ధికి అసలైన కొలమానం.
- తిప్పర్తి శ్రీనివాస్, సోషల్ ఎనలిస్ట్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
[email protected]
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
