సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు విజిటర్స్ క్యూ..

సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు విజిటర్స్ క్యూ..
  • మంత్రుల దగ్గరే సమస్యలు పరిష్కారమవుతాయని తరలివస్తున్నరు
  • ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ విజిటర్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ సిస్టమ్ ప్రకారం 4 నెలల్లో 42,155 మంది రాక
  • మంత్రులు వివేక్ ​వెంకటస్వామి, ఉత్తమ్, శ్రీధర్​బాబు పేషీలకే ఎక్కువ మంది

హైదరాబాద్, వెలుగు:వివిధ వినతులు, సమస్యల పరిష్కారం కోసం డాక్టర్ బీఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయానికి విజిటర్స్​పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో సెక్రటేరియట్ సందర్శకులపై ఆంక్షలు ఉండగా.. కాంగ్రెస్​అధికారంలోకి వచ్చాక ప్రజా సందడి కనిపిస్తోంది. గత జులై 1 నుంచి అక్టోబర్ 28 వరకు(4 నెలల్లో) రాష్ట్ర నలుమూలల నుంచి ఏకంగా 42,155 మంది విజిటర్స్ సెక్రటేరియట్​కు వచ్చారు.

అధికారిక ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ విజిటర్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ సిస్టమ్ గణాంకాలను పరిశీలిస్తే.. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం పరిపాలనా విభాగాల(అధికారుల) కంటే ప్రజాప్రతినిధులైన మంత్రుల పేషీలకే అత్యధిక ప్రాధాన్యతనిచ్చినట్లు స్పష్టమవుతోంది.

సందర్శకుల సంఖ్య పరంగా చూస్తే.. నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేషీ 3,189 మందితో మొదటి స్థానంలో నిలిచింది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు పేషీ 2,561 మందితో రెండో స్థానంలో, శక్తి, గనుల శాఖ మంత్రి జి.వివేక్ వెంకటస్వామి పేషీ 2,019 మంది విజిటర్లతో మూడో స్థానంలో నిలవడం విశేషం.

సాధారణంగా అత్యధిక రద్దీ ఉండే ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) 1,930 మంది సందర్శకులతో నాలుగో స్థానానికి పరిమితమైంది. ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కార్యాలయానికి 1,794 మంది, రోడ్లు-, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేషీకి 1,684 మంది, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేషీకి 1,488 మంది, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పేషీకి 1,454 మంది విజిటర్స్​వచ్చారు. 

ప్రభుత్వ విభాగాలకు ఇలా..

ఇక, ప్రభుత్వ విభాగాల(డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లు)ను పరిశీలిస్తే.. పట్టణ సమస్యలు, మౌలిక వసతుల దరఖాస్తులతో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ శాఖ 1,639 మంది విజిటర్స్​తో ముందు వరుసలో ఉంది. వ్యవసాయ, -సహకార శాఖ 1,600 మంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం 1,557 మంది, విద్యుత్ శాఖ 1,517 మంది, గిరిజన సంక్షేమ శాఖ 1,346 మంది, వైద్యారోగ్య విభాగం 1,335 మంది, రెవెన్యూ-హౌసింగ్ విభాగం 1,297 మందితో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 

ప్రభుత్వ సలహాదారుల విషయానికొస్తే.. 

క్షేత్రస్థాయి నుంచి వినతులు స్వీకరించడంలో ప్రోటోకాల్ అండ్ పీఆర్ సలహాదారు పేషీకి 768 మంది, బీసీ సంక్షేమ సలహాదారు పేషీకి 671 మంది, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ సలహాదారు పేషీకి 331 మంది సందర్శకులు వచ్చారు. మరోవైపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఆఫీస్​కు ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ ద్వారా ఒకే ఒక్క పాస్ నమోదైనప్పటికీ.. సీఎస్, కీలక శాఖల కార్యదర్శుల వద్దకు వచ్చే సందర్శకులంతా నేరుగా అధికారిక ప్రోటోకాల్ లేదా మధ్యాహ్నం వేళ ఇచ్చే స్పాట్ పాసుల ద్వారానే వెళ్తున్నారని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ పోర్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు గేటు బయట జారీ చేసే మాన్యువల్ పాసులను కూడా పరిగణనలోకి తీసుకుంటే రోజూ వచ్చే వారి సంఖ్య ఇంకా భారీగానే ఉంటుందని అధికారులు అంటున్నారు.

ఆ రెండు గంటలు వందలాది మంది..

ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ అనుమతులే కాకుండా, సచివాలయంలో ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాధారణ విజిటర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అనుమతించే సమయంలోనూ రద్దీ ఊహించని రీతిలో ఉంటోంది. ఈ రెండు గంటల వ్యవధిలో నిత్యం వందలాది మంది ప్రధాన గేటు వెలుపల ఉండే రిసెప్షన్ కౌంటర్ల వద్ద మాన్యువల్ పాసులు తీసుకుని లోపలికి ప్రవేశిస్తున్నారు.

ఇలా వచ్చేవారిలో సింహభాగం నిత్యం సెక్రటేరియేట్​లో అందుబాటులో ఉండే రెవెన్యూ మినిస్టర్​ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి వద్దకు వెళ్తున్నారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కతోపాటు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని కలిసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆర్థిక శాఖ, డిప్యూటీ సీఎం పేషీలకు ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సాధారణ పాసులు జారీ చేయకపోవడంతో.. నిధుల మంజూరు, బిల్లుల చెల్లింపులు, ఆర్థిక అనుమతుల కోసం వచ్చే ప్రజాప్రతినిధులు, సంఘాల నేతలు గేటు వద్ద పాసులు తీసుకునే లోపలికి వెళ్లాల్సి వస్తోంది. విద్య, వైద్యారోగ్య, సాంఘిక సంక్షేమ శాఖల  ఉన్నతాధికారులు, ముఖ్య కార్యదర్శులను కలిసేందుకే మధ్యాహ్నం వేళ జనం పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

స్థానిక అధికారులు స్పందించకపోవడంతోనే..

రాష్ట్ర ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమం ద్వారా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ప్రజా భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు జిల్లా, మండల కేంద్రాల్లోనూ దరఖాస్తులు స్వీకరిస్తోంది. అయినప్పటికీ సచివాలయానికి వచ్చే వారి సంఖ్య తగ్గడం లేదు. ప్రజావాణికి వచ్చే సమస్యలకు ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో వేగంగా పరిష్కారం లభించేదని, ఇప్పుడు క్షేత్రస్థాయి అధికారులు స్పందించకపోవడంతోనే తాము సెక్రటేరియట్​కు రావాల్సి వస్తోందని విజిటర్స్​పేర్కొంటున్నారు. మరోవైపు, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు మీటింగ్స్​పేరుతో చాంబర్లలో అందుబాటులో ఉండటం లేదన్న విమర్శలున్నాయి.