172 బడుల్లో వెయ్యి అడిషనల్ క్లాసు రూములు..నాబార్డ్ నిధులతో తరగతి గదుల నిర్మాణం..

172 బడుల్లో వెయ్యి అడిషనల్ క్లాసు రూములు..నాబార్డ్ నిధులతో తరగతి గదుల నిర్మాణం..

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సర్కారు బడుల్లో అవసరమైన చోట అడిషనల్ క్లాసు రూములను నిర్మించాలని విద్యాశాఖ నిర్ణయించింది. నాబార్డ్ స్కీము కింద 172 గవర్నమెంట్ స్కూళ్లలో మొత్తం 1,005 అదనపు తరగతి గదుల నిర్మాణానికి అడ్మిషనిస్ర్టేషన్ సాంక్షన్ ఇచ్చింది. దీనికి మొత్తం రూ.141.15 కోట్లు ఖర్చు చేయనున్నది. గతంలో మంజూరై ఇప్పటివరకు ప్రారంభం కాని పనులను రద్దు చేసి, వాటి స్థానంలో నాబార్డ్ ఆమోదించిన గైడ్ లైన్స్ ప్రకారం విద్యార్థుల రద్దీ ఎక్కువగా ఉన్న స్కూళ్లను ఎంపిక చేశారు. రంగారెడ్డి జిల్లాలో 202, మేడ్చల్ మల్కాజిగిరి  195, సూర్యాపేట 157, సిద్దిపేట 143, మహబూబాబాద్‌‌‌‌ 76, రాజన్న సిరిసిల్ల 59, నారాయణపేట 51, కామారెడ్డి 33, నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌ జిల్లాలో 29 తరగతి గదులతో పాటు ఖమ్మం, సంగారెడ్డి, జగిత్యాల, జనగామ, ములుగు, వరంగల్ జిల్లాల్లోని ప్రైమరీ, హైస్కూళ్లు, కేజీబీవీ, పీఎంశ్రీ బడుల్లో ఈ నూతన గదులను నిర్మించనున్నారు.

పైఅంతస్తుల్లోనే నిర్మాణాలు

స్కూల్ ఆవరణలోని ఆట, ఖాళీ స్థలాలు వృథా కాకుండా ఉండేందుకు కొత్త క్లాసు రూముల నిర్మాణంలో ప్రత్యేక నిబంధనలను విధించారు. ప్రస్తుతం ఉన్న స్కూల్ భవనాలపై మొదటి లేదా రెండో అంతస్తుల్లోనే ఈ అదనపు గదులను నిర్మించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.141.15 కోట్లకు మించకుండా, నిర్ణీత బడ్జెట్‌‌‌‌లోనే పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు.  ఈ నిర్మాణ బాధ్యతలను టీజీఈడబ్ల్యూఐడీసీకి ప్రభుత్వం అప్పగించించింది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోగా అందుబాటులోకి తీసుకురావాలని డెడ్‌‌‌‌లైన్ విధించించింది.