హైదరాబాద్, వెలుగు: స్కూల్ విద్యార్థుల్లో పరిశోధనాత్మక ఆలోచనలు, విమర్శనాత్మక దృక్పథం, సమస్యల పరిష్కార నైపుణ్యాలను వెలికితీసేందుకు సోషల్ సైన్స్ ఎగ్జిబిషన్లు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. కేంద్ర విద్యాశాఖ బడ్జెట్ ఆమోదంతో సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో ఈ నెల 30న జిల్లా స్థాయిలో, డిసెంబర్ 10న హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సోమవారం ప్రకటించారు.
ప్రతి బడి నుంచి ఒక ప్రాజెక్ట్‌ను మాత్రమే అనుమతిస్తారని, గరిష్టంగా ఇద్దరు విద్యార్థులు దీనిని ప్రదర్శించాల్సి ఉంటుందని తెలిపారు. జిల్లా స్థాయిలో ఎంపికైన ఉత్తమ టాప్–2 ప్రాజెక్టులను డిసెంబర్ 10న హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపాలని అన్ని జిల్లాల డీఈవోలను ఆదేశించారు. ప్రాజెక్టుల తయారీలో థర్మాకోల్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్, హానికర రసాయనాల వినియోగాన్ని అధికారులు పూర్తిగా నిషేధించారు.
విద్యార్థులు తమ మోడల్‌ను జ్యూరీ ఎదుట 3 నిమిషాల్లో వివరించాలని, అనంతరం జ్యూరీ అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని సూచించారు. విద్యార్థులు తమ ప్రాజెక్టులను చారిత్రక వారసత్వం ,- సాంస్కృతిక వైవిధ్యం, సహజ వనరులు, పర్యావరణం - సుస్థిర అభివృద్ధి, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం - పాలన, సామాజిక న్యాయం, సమానత్వం - సమ్మిళితత్వం, ఆర్థికాభివృద్ధి - జీవనోపాధులు, తెలంగాణ: సమాజం, సంస్కృతి - అభివృద్ధి అనే థీమ్స్‌పై మాత్రమే మోడల్స్ సిద్ధం చేయాలి. 3 పేజీల సమగ్ర నివేదికను హార్డ్, సాఫ్ట్ కాపీల్లో జ్యూరీకి తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది.
