- సహజీవనం మాటున డ్రగ్స్ బిజినెస్
- నకిలీ ఆధార్, పాన్‌కార్డుతో భారతీయురాలిగా చలామణి
- అదే పేరుతో బ్యాంక్ అకౌంట్ ఓపెన్
హైదరాబాద్, వెలుగు: వ్యభిచారంతో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్న బంగ్లాదేశ్ మహిళను, ఆమెతో సహజీవనం చేస్తున్న టెకీని ఈగల్ ఫోర్స్ అధికారులు సోమవారం అరెస్టు చేశారు. షేక్‌పేట పోచమ్మబస్తీలో సైబరాబాద్ రాయదుర్గం పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఈమేరకు ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్యా వివరాలు వెల్లడించారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు చెందిన ఆల్ఫా(30)..2021లో టూరిస్ట్ వీసాపై భారత్‌కు వచ్చింది. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన యూపీకి చెందిన నూర్ అనే వ్యక్తి ఆమెకు ఉద్యోగం ఆశచూపాడు. ఈ క్రమంలో మహిళను వ్యభిచార కార్యకలాపాల్లోకి దించాడు. చెన్నైకి చెందిన రాహుల్, హైదరాబాద్‌కు చెందిన జయ్, జేకే అనే బ్రోకర్ల ద్వారా నాగ్‌పూర్, కాన్పూర్, విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్, గోవా, ముంబై తదితర నగరాల్లో దందా నిర్వహించారు.
‘జియా శ్యామ్‌రావు’ పేరుతో..
2021లో హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శ్యామ్‌రావుతో ఆల్ఫాకు పరిచయం ఏర్పడింది. 2022 నుంచి ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. ‘జియా శ్యామ్‌రావు’ పేరుతో నకిలీ ఆధార్, పాన్ కార్డు తయారు చేసుకుని భారతీయురాలిగా చలామణి అవుతోంది. అదే పేరుతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసింది. ఈ క్రమంలో గోవాకు చెందిన ఆకాష్ పరిచయంతో డ్రగ్స్‌కు బానిసగా మారింది. అతడి నుంచి సింథటిక్ డ్రగ్స్ తీసుకొచ్చి తన వద్దకు వచ్చే కస్టమర్లకు విక్రయిస్తున్నది.శ్యామ్‌రావు కూడా డ్రగ్స్‌కు అలవాటు కాగా, ఇద్దరూ కలిసి వ్యభిచారం, డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆల్ఫా గోవా నుంచి డ్రగ్స్‌తో హైదరాబాద్‌కు వచ్చినట్లు సమాచారం అందడంతో రాయదుర్గం పోలీసులతో కలిసి షేక్‌పేట పోచమ్మబస్తీలోని ఆమె నివాసంపై దాడి చేశారు. ఆల్ఫా, శ్యామ్‌రావును అదుపులోకి తీసుకుని.. ఇంట్లో ఒక గ్రాము సింథటిక్ డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు.
