- జనవరి 10 నుంచి 24 వరకు స్వయంగా నమోదు
- జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఇంటింటి సర్వే
- మార్చి 1 నుంచి 5 వరకు సవరణల రౌండ్
- మార్చి 1 అర్ధరాత్రి ప్రామాణిక సమయం
- సెన్సస్–2027 ఫేజ్–2 షెడ్యూల్ నోటిఫై చేసిన సర్కార్
హైదరాబాద్, వెలుగు: జనాభా గణన (సెన్సస్–2027) ఫేజ్-2 షెడ్యూల్ ఖరారైంది. రెండో విడతలో భాగంగా చేపట్టే ‘జనాభా లెక్కింపు’ (పాపులేషన్ ఎన్యూమరేషన్–పీఈ) తేదీలను కేంద్రం ప్రకటించగా, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నోటిఫై చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను సోమవారం రీ-పబ్లిష్ చేస్తూ సీఎస్ సంజయ్ జాజు ఉత్తర్వులు ఇచ్చారు. ఇందులో ఫస్ట్ ఫేజ్‌లో మాదిరిగానే తమ వివరాలను తామే ఆన్లైన్లో నమోదు చేసుకునే సెల్ఫ్ ఎన్యూమరేషన్ అవకాశాన్ని కల్పించారు.
ఇంటింటికీ ఎన్యూమరేటర్లు వచ్చే కంటే ముందే ప్రజలు తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించడంతో పాటు, క్షేత్రస్థాయి పరిశీలన, రివిజన్ రౌండ్లకు స్పష్టమైన గడువులను నిర్దేశించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం జనాభా గణన ప్రక్రియ మొత్తం మూడు దశల్లో సాగనుంది. తొలుత 2027 జనవరి 10 నుంచి జనవరి 24 వరకు పౌరులకు ‘సెల్ఫ్ ఎన్యూమరేషన్’ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది.
ఈ సమయంలో అధికారిక డిజిటల్ పోర్టల్ లో ప్రజలు తమ వివరాలను స్వయంగా ఎంటర్ చేసుకోవచ్చు. ఈ గడువు ముగిసిన మరుసటి రోజు నుంచే అసలైన ఫీల్డ్ సర్వే ప్రారంభం కానుంది. 2027 జనవరి 25వ తేదీ నుంచి ఫిబ్రవరి 28 వరకు ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి జనాభా లెక్కలను సేకరిస్తారు. స్వీయ నమోదు చేసుకున్న వారి వివరాలను పరిశీలించడంతో పాటు మిగిలిన కుటుంబాల పూర్తి వివరాలను నమోదు చేస్తారు.
అనంతరం ఎవరైనా నమోదు కాకుండా తప్పిపోయినా, మార్పులు చేర్పులు ఉన్నా సరిదిద్దేందుకు వీలుగా 2027 మార్చి 1 నుంచి మార్చి 5వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ప్రత్యేక సవరణల రౌండ్ కొనసాగుతుంది. ఈ జనాభా లెక్కల మొత్తానికి 2027z మార్చి 1వ తేదీ అర్ధరాత్రి 12 గంటలను ‘ప్రామాణిక సమయం’ గా తీసుకుంటారని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
కొన్ని ప్రాంతాలకు తాత్కాలిక మినహాయింపు
ఈ జనాభా లెక్కల ప్రక్రియకు బలమైన చట్టబద్ధత కల్పిస్తూ కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు. సెన్సస్ చట్టం 1948లోని సెక్షన్ 3తో పాటు, సెన్సస్ రూల్స్ 1990లోని రూల్స్ 6ఏ, 6డీ కల్పించిన అధికారాల మేరకు కేంద్రం ఈ ఉత్తర్వులను అమల్లోకి తెచ్చింది. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ షెడ్యూల్ వర్తిస్తుండగా.. భౌగోళిక పరిస్థితులు, ఇతర కారణాల దృష్ట్యా కొన్ని ప్రాంతాలకు తాత్కాలిక మినహాయింపు ఇచ్చారు.
ప్రత్యేక ప్రకటన వెలువడే వరకు మణిపూర్ రాష్ట్రంతో పాటు గోవా, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతానికి ఈ షెడ్యూల్ వర్తించదు. వీటితో పాటు తీవ్రమైన మంచు ప్రభావం ఉండే హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలోని సింక్రోనస్ కాని ప్రాంతాలకు ప్రత్యేక షెడ్యూల్ అమలు కానుంది. రాష్ట్రంలో మాత్రం జీవో 155 ప్రకారం నిర్దేశిత తేదీల్లోనే సర్వే నూటికి నూరు శాతం జరగనుంది.
ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్లుగా కలెక్టర్లు
రాష్ట్రంలో జనాభా లెక్కింపునకు పాలనా యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. అన్ని జిల్లాల కలెక్టర్లు ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్లుగా పూర్తి బాధ్యతలు నిర్వర్తించనున్నారు. వీరితో పాటు సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్‌తో పాటు కీలక కార్పొరేషన్లు అయిన జీహెచ్ఎంసీ, వరంగల్ (జీడబ్ల్యూఎంసీ), నిజామాబాద్, కరీంనగర్, రామగుండం, ఖమ్మం, మహబూబ్‌నగర్, మంచిర్యాల, కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్లకు అధికారాలు కేటాయించారు. పట్టణ, గ్రామీణ విభాగాల్లో ఎన్యూమరేటర్ల నియామకం, శిక్షణ, సాంకేతిక ఏర్పాట్లను పూర్తి చేయాలని కలెక్టర్లు, కమిషనర్లను సర్కారు ఆదేశించింది.
