- మధిర నియోజకవర్గంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం
- ఖమ్మం రూరల్ తోపాటు పలు మండలాల్లో పాల్గొన్న మంత్రి పొంగులేటి
- కోహెడ మండలంలో మంత్రి పొన్నం వేడుకలు
మధిర/ ఎర్రుపాలెం/ఖమ్మం రూరల్/ నేలకొండపల్లి/ కూసుమంచి/ కోహెడ/ వేములవాడ రూరల్/ షాద్‌నగర్, వెలుగు: తెలంగాణలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తోందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, పలువురు ఎమ్మెల్యేలు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లను సందర్శించి కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని బంజర, పెద్దగోపవరం, దెందుకూరు, మల్లారం, రాయనపేట, పొద్దుటూరు, కిష్టాపురం, ముదిగొండ తదితర గ్రామాల్లో భట్టి విక్రమార్క లబ్ధిదారుల ఇళ్లలో పండుగ జరుపుకున్నారు. అలాగే ఖమ్మం రూరల్, నేలకొండపల్లి, కూసుమంచి మండలాల్లోని పలు గ్రామాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గృహప్రవేశ వేడుకల్లో పాల్గొని లబ్ధిదారులను అభినందించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటివరకు 8 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, లబ్ధిదారులకు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం నేరుగా అందిస్తున్నామని తెలిపారు.
ఇప్పటివరకు 2.25 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, మరో 1.75 లక్షల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయని వెల్లడించారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. త్వరలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని కూడా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబానికి సొంతింటి భరోసా కల్పించడమే ప్రజా ప్రభుత్వ సంకల్పమన్నారు. లబ్ధిదారుల కుటుంబాలతో ఆత్మీయంగా ముచ్చటించి, వారి ఆనందంలో పాలుపంచుకున్నారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వింజపల్లిలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు శంకరవ్వ కుటుంబంతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మల్లారంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ లబ్ధిదారు సత్తమ్మ ఇంట్లో దీపావళి వేడుకల్లో పాల్గొని నూతన వస్త్రాలు అందజేశారు. మర్రిపల్లి గ్రామంలో మహిళా సామాఖ్య సంఘ భవనాన్ని ప్రారంభించారు. సొంతింటి కల నెరవేరడంతో తొలిసారిగా తమ ఇంట్లో దీపావళి జరుపుకుంటున్న లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు తండా, ఫరూక్నగర్ మండల కేంద్రంలోని 14వ వార్డులో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల వద్ద టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలతో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.
