- చమురు కంపెనీల వాదనను తోసిపుచ్చిన సర్కార్
- స్వతంత్ర ల్యాబ్‌లలో టెస్టులు చేయించాలని డిమాండ్
బెంగళూరు/తిరువనంతపురం: బంకుల్లో అమ్ముతున్న ఈ20 పెట్రోల్‌లో ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఇథనాల్ కలుపుతున్నారన్న వివాదం ముదురుతోంది. 20 శాతం ఇథనాల్ ఉండాల్సిన పెట్రోల్‌లో కొన్నిచోట్ల ఏకంగా 31.2 శాతం దాకా ఇథనాల్ ఉన్నట్లు తమ టెస్టుల్లో తేలిందని కర్నాటక ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఆరోపణలను ఖండిస్తూ ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీలు ఇచ్చిన సంయుక్త ప్రకటనను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం తోసిపుచ్చింది.
బంకుల్లో అమ్ముతున్న పెట్రోల్‌లో అసలు ఇథనాల్ ఎంత ఉందో కంపెనీలు చెప్పాలని నిలదీసింది. తమ టెస్టుల ఫలితాలకు కట్టుబడి ఉన్నామని కర్నాటక ఆహార, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రిజ్వాన్ అర్షద్ స్పష్టం చేశారు. కంపెనీల ప్రకటనలో సాంకేతిక వివరణలు చాలా ఉన్నా, పెట్రోల్‌లో అసలు ఇథనాల్ శాతం ఎంతో మాత్రం లేదని విమర్శించారు. కర్నాటక ఫలితాలతో అప్రమత్తమైన కేరళ ప్రభుత్వం కూడా తమ రాష్ట్రంలోని బంకుల్లో టెస్టులకు దిగింది.
ఐదింట నాలుగు శాంపిళ్లలో ఎక్కువ
కర్నాటకలోని ఏడు జిల్లాల్లో వివిధ చమురు కంపెనీల బంకుల నుంచి 63 శాంపిళ్లు సేకరించి టెస్టులు చేయించగా, చాలా శాంపిళ్లలో ఇథనాల్ 20 శాతాన్ని మించిందని, అత్యధికంగా 31.2 శాతం నమోదైందని మంత్రి రిజ్వాన్ అర్షద్ ఈ నెల 6న వెల్లడించారు. దాదాపు ప్రతి ఐదు శాంపిళ్లలో నాలుగింట్లో ఇథనాల్ 20 శాతం కంటే ఎక్కువగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మొదట ఈ శాంపిళ్లను ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్ సొంత ల్యాబ్‌లకు పంపితే, ఆ నివేదికల్లో ఇథనాల్ శాతాన్నే వెల్లడించలేదని మంత్రి చెప్పారు.
దాంతో తదుపరి టెస్టులను ఎన్ఏబీఎల్ గుర్తింపు, ఐఎస్వో ప్రమాణాలున్న ల్యాబ్‌లలో చేయించామన్నారు. కంపెనీలు సొంత ల్యాబ్‌లలో టెస్టులు చేసుకుని నాణ్యతను నిర్ధారించుకోవడం స్వీయ పర్యవేక్షణ కిందకే వస్తుందని, ఇంధన నాణ్యతపై స్వతంత్ర సంస్థల టెస్టులే కీలకమని స్పష్టం చేశారు. శాంపిళ్ల సేకరణలో నిబంధనలు ఉల్లంఘించారన్న కంపెనీల ఆరోపణలను కర్నాటక ప్రభుత్వం తోసిపుచ్చింది. 2005 నాటి మోటార్ స్పిరిట్, హైస్పీడ్ డీజిల్ నియంత్రణ ఉత్తర్వుల ప్రకారమే టెస్టులు చేశామని తెలిపింది. అధికారులు, డీలర్లు లేదా వారి ప్రతినిధుల సమక్షంలో శాంపిళ్లు సేకరించి, వారి సంతకాలతోనే సీల్ వేశామని, డెన్సిటీ వివరాలనూ నమోదు చేశామని వివరించింది.
కలిపే బాధ్యత కంపెనీలదే
రిఫైనరీలు, డిపోల్లో ఆటోమేటిక్ వ్యవస్థ ద్వారా ఇథనాల్ కలుపుతున్నామని కంపెనీలే చెబుతున్నందున, సరైన మోతాదులో కలిపే బాధ్యత కూడా వాటిదేనని కర్నాటక ప్రభుత్వం స్పష్టం చేసింది. ట్యాంకర్ల ద్వారా వచ్చిన ఇంధనాన్ని డీలర్లు అమ్ముతారే తప్ప కలపరని, తేడాలకు వాళ్లను బాధ్యులను చేయొద్దని పేర్కొంది. ఈ20 పెట్రోల్‌పై గతంలో ఆటోమొబైల్ కంపెనీలు, బీమా సంస్థలు, పరిశ్రమల సంఘాలు వ్యక్తం చేసిన అభ్యంతరాలను ఒత్తిడితో వెనక్కి తీసుకునేలా చేశారని మంత్రి ఆరోపించారు. త్వరలో అన్ని చమురు కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి, టెస్టుల ఫలితాలు, వినియోగదారుల రక్షణపై చర్చిస్తామని చెప్పారు. ఇంధన టెస్టులను కంపెనీల చేతుల్లోంచి తీసి స్వతంత్ర, పారదర్శక వ్యవస్థకు అప్పగించాలని డిమాండ్ చేశారు.
కేరళలోనూ టెస్టులు
కర్నాటక ఫలితాల నేపథ్యంలో కేరళ ప్రభుత్వం తిరువనంతపురం, ఎర్నాకుళం, కోజికోడ్, కన్నూర్ జిల్లాల్లోని పెట్రోల్ బంకుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టి శాంపిళ్లు సేకరించింది. వీటిని పరీక్షించేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్‌లు సిద్ధమని, 10 రోజుల్లో ఫలితాలు వస్తాయని అధికారులు తెలిపారు. పెట్రోల్‌లో అనుమతించిన 20% కంటే ఇథనాల్ ఎక్కువున్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని కేరళ ప్రభుత్వం హెచ్చరించింది.
ఆరోపణలు తప్పు: ఆయిల్ కంపెనీలు, కేంద్రం
కర్నాటక ఆరోపణలను చమురు కంపెనీలు తోసిపుచ్చాయి. నిర్దేశిత విధానాల ప్రకారం చేసిన టెస్టులు ఈ ఆరోపణలను సమర్థించడం లేదని, తాము అమ్ముతున్న ఈ20 పెట్రోల్ బీఐఎస్ నిర్దేశించిన ఐఎస్ 17021 ప్రమాణాలకు అనుగుణంగానే ఉందని కేంద్రం, ఆయిల్ కంపెనీలు పేర్కొన్నాయి. కర్నాటక టెస్టుల పద్ధతిపైనా ప్రశ్నలు లేవనెత్తాయి. పెట్రోలియం శాఖ కూడా కర్నాటక ఫలితాలను ఖండించింది. 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సేకరించిన 893 శాంపిళ్లలో ఇథనాల్ 19 నుంచి 21% మధ్యే ఉందని, ఇందులో కర్నాటకకు చెందిన 56 శాంపిళ్లు కూడా ఉన్నాయని తెలిపింది.
