పటాకుల పొగతో ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి.దీపావళి తర్వాత ఏక్యూఐ 373.. ‘వెరీ పూర్’

పటాకుల పొగతో ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి.దీపావళి తర్వాత ఏక్యూఐ 373.. ‘వెరీ పూర్’
  •      స్టేజ్–3 ఆంక్షలున్నా ఆగని బాణసంచా మోత
  •     దట్టమైన పొగతో పడిపోయిన విజిబిలిటీ
  •     మరికొన్ని రోజులు ‘సివియర్’లోనే: ఈడబ్ల్యూఎస్

న్యూఢిల్లీ: దీపావళి పండుగ దెబ్బకు డిల్లీ–ఎన్​సీఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్)లో వాయుకాలుష్యం మరోసారి తీవ్ర ప్రమాదకర స్థాయికి చేరింది. పండుగ ముందు నుంచే ప్రభుత్వం గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ) స్టేజ్-3 ఆంక్షలు అమలు చేసినా ప్రజలు భారీగా టపాసులు కాల్చడంతో ఆదివారం రాత్రి ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) సగటు ఏకంగా 373(వెరీ పూర్) మార్కును తాకింది.

తీవ్ర కాలుష్యం, పటాకుల మోతతో ఢిల్లీ–ఎన్‌‌‌‌‌‌‌‌సీఆర్ ప్రాంతం మొత్తాన్ని దట్టమైన పొగ కమ్మేసింది. ఈ పొగ కారణంగా వివిధ ప్రాంతాల్లో ఉదయం, రాత్రి వేళల్లో విజిబిలిటీ దారుణంగా పడిపోయింది. రోడ్లపై ప్రయాణించే వాహనదారులు ఎదురుగా వస్తున్న వాహనాలు సరిగ్గా కనిపించక అవస్థలు పడ్డారు. నగరంలోని ప్రధాన మార్గాల్లో రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాతావరణంలో గాలుల వేగం పూర్తిగా తగ్గడంతో పటాకుల ద్వారా వెలువడిన విషపూరిత ధూళి కణాలు, సూక్ష్మ కాలుష్య కారకాలు అన్నీ ఎక్కడివక్కడే పేరుకుపోయాయి. గాలిలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోవడంతో చిన్నారులు, వృద్ధులు, ఇప్పటికే ఉబ్బసం (ఆస్తమా), ఇతర శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలామందికి కళ్ల మంటలు, దగ్గు వంటి సమస్యలు కూడా తలెత్తాయి. 

ఎక్కడెక్కడ ఎంత ఏక్యూఐ?

సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ),‘సమీర్’ యాప్ డేటా ప్రకారం.. ఆదివారం రాత్రి 11:05 గంటల సమయానికి ఢిల్లీ మొత్తం సగటు ఏక్యూఐ 373కి చేరి ‘వెరీ పూర్’  కేటగిరీలో నమోదైంది. ఇదే సమయంలో పొరుగునే ఉన్న నోయిడాలో సగటు ఏక్యూఐ 319గా రికార్డు కాగా.. ఘజియాబాద్‌‌‌‌‌‌‌‌లో 360, ఫరీదాబాద్‌‌‌‌‌‌‌‌లో 297, గురుగ్రామ్‌‌‌‌‌‌‌‌లో 280గా నమోదైంది. అయితే, ఢిల్లీలోని పలు ప్రత్యేక ప్రాంతాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. అలీపూర్, బవానా, బురారి, చాందినీ చౌక్, ముండ్కా, పంజాబీ బాగ్, రోహిణి, వివేక్ విహార్ వంటి అనేక ప్రాంతాల్లో ఏక్యూఐ ఏకంగా 400 మార్కును దాటి అత్యంత ప్రమాదకరమైన ‘సివియర్’ కేటగిరీకి చేరుకుంది.

దీపావళి పండుగ ముగిసిన తర్వాత కూడా ఢిల్లీ-ఎన్‌‌‌‌‌‌‌‌సీఆర్ ప్రాంతంలో వాయు కాలుష్యం పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ (ఈడబ్ల్యూఎస్) హెచ్చరించింది. సోమవారం నుంచి రాబోయే కొన్ని రోజుల పాటు గాలి నాణ్యత అత్యంత ప్రమాదకరమైన ‘సివియర్’  కేటగిరీలోనే కొనసాగుతుందని స్పష్టం చేసింది. దీపావళి వేడుకల అనంతరం ఏర్పడిన ధూళి, పొగ కారణంగా ఏక్యూఐ ఏకంగా 401 నుంచి 500 మధ్య ఉంటుందని వెల్లడించింది. ఇది ఢిల్లీ ప్రజల ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావం చూపే ప్రమాదం ఉందని పేర్కొంది.

వాస్తవ పరిస్థితి మరింత భయానకం

సమీర్ యాప్ చూపే సంఖ్యల కంటే ఢిల్లీలో కాలుష్యం వాస్తవ పరిస్థితి చాలా భయంకరంగా ఉందని ప్రముఖ పర్యావరణవేత్త భావ్రీన్ కంథారీ వెల్లడించారు. చాలామంది పౌరులు తమ సొంత మానిటర్లతో కాలుష్య స్థాయిలను పరిశీలిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ డ్యాష్‌‌‌‌‌‌‌‌బోర్డ్‌‌‌‌‌‌‌‌లు చూపుతున్న గణాంకాలకు, క్షేత్రస్థాయిలో ప్రజలు అనుభవిస్తున్న వాస్తవ పరిస్థితులకు పొంతనే లేదని ఆరోపించారు. ఆంక్షలను లెక్కచేయకుండా బాణాసంచా కాల్చడంతో పిల్లల ఆరోగ్యం దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వాలు పారదర్శకమైన చర్యలు తీసుకోవాలని, లేదంటే శీతాకాలపు పర్యావరణ సంక్షోభం తీవ్రరూపం దాలుస్తుందని హెచ్చరించారు.