న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీతో పాటు ముంబై సిటీలు తీవ్రమైన వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. దీపావళి వేడుకల అనంతరం ఈ రెండు మెట్రో నగరాల్లో గాలి నాణ్యత ఒక్కసారిగా పడిపోవడంపై సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే తీవ్రంగా స్పందించారు. ప్రజల తీరుపై ఆయన విసుగు ప్రదర్శిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఉదయం ప్రజలు నిద్రలేచేసరికి ఢిల్లీ, ముంబై నగరాలు దట్టమైన పొగమంచు, కాలుష్యపు దుప్పటిలో కప్పబడి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ‘ప్రజలు తమ జీవితాలను తామే స్వయంగా దుర్భరంగా మార్చుకోవడంలో ఇంతటి పట్టుదలగా ఉండటాన్ని నేను ఎన్నడూ చూడలేదు’ అని అభిజీత్ దీప్కే ఎద్దేవా చేశారు. దీపావళి పండుగ ఆనందాన్ని, ప్రేమను పంచడానికే కానీ, ఇటువంటి నష్టాలను కొనితెచ్చుకోవడానికి కాదని దీప్కే హితవు పలికారు.
