పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని సుల్తానాపూర్ ప్రభుత్వ పాఠశాలను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సందర్శించారు. ఈ సందర్భంగా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించి వారి చదువులు, పాఠశాలలో నెలకొన్న సమస్యలు, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పాఠశాలలో తాగునీటి సమస్య ఉందని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా ఉపాధ్యాయుల కొరతను పరిష్కరించాలని టీచర్లు కోరారు. పాఠశాలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు.ఇటీవల జిల్లా స్థాయిలో నిర్వహించిన తెలుగు వ్యాసరచన పోటీల్లో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థిని సాయి విజ్ఞతకు సైకిల్ బహుమతిగా అందజేస్తానని ఎంపీ ప్రకటించారు.
అనంతరం ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ.. ఈ పాఠశాలలో కాక హయాంలో ప్రహరీ గోడ నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. పాఠశాలకు రాగానే కాక పేరును గుర్తు చేసుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. పాఠశాల సీసీ రోడ్డు నిర్మాణానికి తన ఎంపీ లాడ్స్ నిధుల నుంచి నిధులు మంజూరు చేస్తానని తెలిపారు. తాగునీటి ప్లాంట్, అదనపు తరగతి గదుల నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
విద్య అనేది ప్రాథమిక హక్కు అని కాక ఎప్పుడూ చెప్పేవారని గుర్తుచేశారు. ఒకప్పుడు 11 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో ప్రస్తుతం 90 మంది విద్యార్థులు చదువుతున్నారంటే ఉపాధ్యాయుల సేవలు అభినందనీయమని అన్నారు. విద్యార్థులను ఎలక్ట్రిక్ ఆటోలో పాఠశాలకు తీసుకురావడం, తిరిగి ఇళ్లకు చేర్చడం పట్ల ఉపాధ్యాయుల అంకితభావం స్పష్టంగా కనిపిస్తోందని ప్రశంసించారు.
విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదువుకుని తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని ఎంపీ సూచించారు. చదువులో పెద్దపల్లి జిల్లాను అగ్రగామిగా నిలిపి, రాష్ట్ర, జాతీయ స్థాయిలో మంచి ర్యాంకులు సాధించాలని ఆకాంక్షించారు. స్టార్టప్‌లు, వినూత్న ఆలోచనలతో విద్యార్థులు భవిష్యత్తులో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణం చేపడుతోందని, విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తోందని తెలిపారు. కాక గ్రోత్ ఫండ్‌ను కూడా విడుదల చేయడం జరిగిందన్నారు.
