కర్ణాటకలో అమ్ముతున్న పెట్రోల్ 30 శాతానికి పైగా ఇథనాల్ కలిగి ఉందని అక్కడి ప్రభుత్వ పరీక్షల్లో తేలటం సామాన్యులను షాక్ కి గురిచేస్తోంది. కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికీ తమ రిపోర్ట్స్ సరైనవేనని బలంగా నిలబడుతోంది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలోని భారత్ పెట్రోలియం తమ పెట్రోల్ E20 నిబంధనలకు అనుగుణంగా ఉందంటూ చేసిన ట్వీట్ నిమిషాల వ్యవధిలోనే డిలీట్ చేయటం ఆసక్తికరంగా మారింది. అయితే ప్రజలకు తెలియకుండానే ఒకవేళ E30 పెట్రోల్ అమ్మటం నిజమైతే కార్లు, బైకులకు దీనివల్ల వచ్చే రిపేర్లకు ఇన్సూరెన్స్ వస్తుందా రాదా అనే ఆందోళనలు పెరిగిపోయాయి.
అయితే ఇథనాల్ కలిపిన పెట్రోల్ పై దేశంలోని ఇన్సూరెన్స్ కంపెనీలు గతంలో ఏం చెప్పాయి.. కర్ణాటకలో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులతో వాహనాల యజమానులకు ఎలాంటి నష్టం జరుగుతుందనే వివరాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. దీనిపై కర్ణాటక ప్రభుత్వ వాదనను కూడా విందాం..
E20 పెట్రోల్ అంశంపై కర్ణాటక సర్కార్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం వల్ల తలెత్తుతున్న సమస్యలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిశ్రమలు, ఆటోమొబైల్ దిగ్గజాలపై కేంద్రం తీవ్రమైన ఒత్తిడి తెస్తోందని కర్ణాటక ప్రభుత్వం ఆరోపించింది. విధానాన్ని ప్రశ్నించే వారి గొంతును కేంద్రం నొక్కుతోందని, ఎంతటి ఒత్తిళ్లు వచ్చినా తాము మాత్రం వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రెస్ నోట్ ప్రస్తుతం దేశ రాజకీయాల్లో, ఆటోమొబైల్ రంగంలో హాట్ టాపిక్‌గా మారింది.
E20 పెట్రోల్‌లో క్లోరైడ్, సల్ఫర్ అవశేషాలు ఉంటున్నాయని, దీనివల్ల వాహనాల ఇంజిన్ భాగాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని 'సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్' (SIAM) గతంలో ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు జూలై 28, 2026 న కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖకు సియామ్ ఒక లేఖ కూడా రాసింది. కేవలం వారంలోపే కేంద్రం నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిళ్ల కారణంగా ఆ లేఖను వారు వెనక్కి తీసుకున్నారని కర్ణాటక ప్రభుత్వం తన ప్రకటనలో ప్రస్తావించింది. కేవలం పరిశ్రమలే కాకుండా, ఆటోమొబైల్, ఇన్సూరెన్స్ రంగాలు కూడా ఈ ఇంధన ప్రభావంపై భిన్నమైన ప్రకటనలు చేసి.. ఆ తర్వాత మాట మార్చాల్సి వచ్చిందని ఆరోపించింది.
ఈ సందర్భంగా కొన్ని కీలక ఉదాహరణలను కర్ణాటక ప్రభుత్వం బయటపెట్టింది. "తప్పుడు ఇంధనం వాడటం" వల్ల జరిగే ఇంజిన్ నష్టాలకు ఇన్సూరెన్స్ వర్తించదని ACKO ఇన్సూరెన్స్ సంస్థ తన కస్టమర్‌కు స్పష్టం చేసిందని గుర్తుచేసింది. అంటే కస్టమర్లు తమకు తెలియకుండా కర్ణాటకలో E30 పెట్రోల్ వాడుతున్నట్లయితే వాహనాలు అంటే కార్లు, బైకులకు వచ్చే రిపేర్లకు ఇన్సూరెన్స్ కంపెనీలు బాధ్యత వహించకపోవచ్చు. అంటే ఇన్సూరెన్స్ ఉన్నా ప్రయోజనం జీరో.
అలాగే ఓనర్స్ మాన్యువల్‌లో సూచించినదాని కంటే భిన్నమైన ఇంధనం వాడితే వాహన వారంటీ రద్దవుతుందని Toyota కస్టమర్ కేర్ సైతం స్పష్టం చేసిన విషయాన్ని కర్ణాటక ప్రభుత్వం E30 వివాదం సమయంలో ప్రస్తావించటం వెహికల్ ఓనర్లకు చెమటలు పట్టిస్తోంది. అప్పట్లో రెండు సంస్థలు తమ ప్రకటనలను వెనక్కి తీసుకోవడం వెనుక పెద్ద తతంగమే నడిచిందని ఆరోపించింది. ఇప్పుడు కంపెనీలు E30 పెట్రోల్ వల్ల వచ్చే రిపేర్ల విషయంలో క్లెయిమ్స్ ఎలా ప్రాసెస్ చేస్తాయనే అనుమానాలు చాలా మందిని వెంటాడుతున్నాయి.
సుప్రీంకోర్టులో అటార్నీ జనరల్ మాట్లాడుతూ.. ఈ-20 అనేది ఇప్పటికీ ఒక ప్రయోగం దశలోనే ఉందని చెప్పడం, ఆ తర్వాత ఆయన కార్యాలయం నుంచి దానిపై సవరణ రావడం వంటి పరిణామాలను కర్ణాటక ప్రభుత్వం ప్రస్థావించింది. ఈ విషయాలన్నింటినీ బట్టి చూస్తే ఒక స్పష్టమైన కుట్ర కనిపిస్తోందని విమర్శించింది. "పాలసీని ప్రశ్నిస్తే మీ గొంతు నొక్కేస్తారు. పరిశ్రమలు, కార్పొరేట్ కంపెనీలు కేంద్రం ఒత్తిడికి తలొగ్గి వెనకడుగు వేయవచ్చు.. కానీ కర్ణాటక ప్రభుత్వం మాత్రం ప్రజల పక్షాన నిలబడటంలో వెనక్కి తగ్గేది లేదు" అని విడుదల చేసిన ప్రెస్ నోట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
