ఈ దేశానికి వెళ్లొద్దు.. అమెరికా వార్నింగ్ ! ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర దేశాల లిస్టు విడుదల..

 ఈ దేశానికి వెళ్లొద్దు.. అమెరికా వార్నింగ్ ! ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర దేశాల లిస్టు విడుదల..

ఆఫ్రికా దేశమైన ఉగాండాకు వెళ్లే విషయంలో అమెరికా ప్రభుత్వం దేశ పౌరులను అప్రమత్తం చేసింది. ఆఫ్రికా  దేశంలో భద్రతాపరమైన సమస్యలు, ఉగ్రవాద దాడుల ముప్పు, నేరాలు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నాయని పేర్కొంటూ హై లెవెల్  ప్రయాణ హెచ్చరిక జారీ చేసింది. ఉగాండాకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లవద్దని అమెరికన్లకు సూచించింది.

అమెరికా విదేశాంగ శాఖకు చెందిన కాన్సులర్ వ్యవహారాల బ్యూరో నవంబర్ 9, 2026న ఈ హెచ్చరికను విడుదల చేసింది. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన దేశాల లిస్టులో ఉగాండాను కూడా చేర్చింది. ఈ లిస్టులో సోమాలియా, దక్షిణ సూడాన్, సూడాన్, రష్యా, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, ఉత్తర కొరియా, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో వంటి దేశాలు కూడా ఉన్నాయి.

లెవల్-4 హెచ్చరిక అంటే ఏమిటి?
విదేశాలకు వెళ్లే అమెరికా పౌరుల భద్రతను దృష్టిలో పెట్టుకుని అక్కడి పరిస్థితుల ఆధారంగా అమెరికా ప్రభుత్వం నాలుగు రకాల ప్రయాణ హెచ్చరికలు జారీ చేస్తుంది.

లెవల్-1: సాధారణ జాగ్రత్తలు తీసుకుంటూ ప్రయాణించవచ్చు.

లెవల్-2: మరింత చాల అప్రమత్తంగా ఉండాలి.

లెవల్-3: ఆ దేశానికి వెళ్లే ప్రయాణాన్ని మరోసారి ఆలోచించాలి.

లెవల్-4: ఆ దేశానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణించవద్దు.

వీటిలో లెవల్-4 అత్యంత ప్రమాదకరమైన హెచ్చరిక. అంటే ఆ దేశంలో ప్రయాణికులకు తీవ్రమైన ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉందని అర్థం. అక్కడ చిక్కుకుపోయిన అమెరికా పౌరులకు అత్యవసర సహాయం అందించడం కూడా తమకు కష్టమవుతుందని అమెరికా ప్రభుత్వం తెలిపింది.

ఉగాండాను ప్రమాదకర దేశంగా ఎందుకు గుర్తించారు?
ఉగాండాలో ప్రధానంగా నాలుగు రకాల ప్రమాదాలు ఉన్నాయని అమెరికా ప్రభుత్వం పేర్కొంది. అవి నేరాలు, ఆరోగ్య సమస్యలు, ఉగ్రవాద ముప్పు, పౌర అశాంతి. ముఖ్యంగా ఆ దేశంలోని ప్రధాన నగరాలు, కరమోజా ప్రాంతం, పశ్చిమ, ఉత్తర సరిహద్దు ప్రాంతాల్లో ఎప్పుడు ఎలాంటి హింసాత్మక ఘటనలు జరుగుతాయో చెప్పలేని పరిస్థితి ఉందని హెచ్చరించింది.

గతంలో ఉగాండాలో జరిగిన కొన్ని దాడుల్లో స్థానికులతో పాటు విదేశాల నుంచి వచ్చిన పర్యాటకులు కూడా ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేసింది. మతపరమైన ప్రార్థనా స్థలాలు, స్కూల్స్, ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లు, రవాణా కేంద్రాలు, జాతీయ పార్కులు కూడా ఉగ్రవాదుల లక్ష్యంగా మారే అవకాశం ఉందని తెలిపింది. అలాగే రాజకీయ పరిణామాలు, ఎన్నికల సమయంలో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే నిరసనలు, ఆందోళనలు జరిగే ప్రమాదం ఉందని అమెరికా పేర్కొంది.

ఎబోలా వైరస్ వ్యాప్తితో మరింత ఆందోళన
ఉగాండాకు ప్రయాణించవద్దని హెచ్చరించడానికి ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఒక కారణంగా ఉన్నాయి. ముఖ్యంగా ఎబోలా వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోందని అమెరికా తెలిపింది. 2026 మే 17న డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని ఇటూరి ప్రావిన్స్‌లో బుండిబుగ్యో ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఉగాండాకు జారీ చేసిన ప్రయాణ హెచ్చరికను లెవల్-3 నుంచి లెవల్-4కు పెంచినట్లు అమెరికా ట్రావెల్ అడ్వైజ్ లో  పేర్కొంది. ఆ తర్వాత జూన్ 4న కూడా ఈ హై లెవెల్  వార్నింగ్  కొనసాగించింది.

ఎబోలా వ్యాప్తి కారణంగా ఆఫ్రికాలోని గ్రేట్ లేక్స్ ప్రాంతంలో ఆరోగ్య భద్రతపై ఆందోళనలు పెరిగాయి. దీంతో పక్క దేశాలు కూడా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు చర్యలు చేపడుతున్నాయి. కెన్యాలోనూ బుండిబుగ్యో ఎబోలా వైరస్‌కు సంబంధించిన తొమ్మిది కేసులు నమోదైనట్లు అక్కడి ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్ మరింత వ్యాపించకుండా నిఘా, ల్యాబ్ పరీక్షలు, వైద్య చికిత్సల ఏర్పాట్లను బలోపేతం చేసేందుకు కెన్యా ప్రభుత్వం ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి పనిచేస్తోంది.

రోడ్డు ప్రయాణాల విషయంలోనూ జాగ్రత్త
ఉగాండాలో భద్రతతో పాటు రోడ్డు ప్రమాదాల ముప్పు కూడా ఎక్కువగా ఉందని అమెరికా హెచ్చరించింది. ముఖ్యంగా రాత్రి సమయాల్లో ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త పడాలని సూచించింది. 2024లో ఉగాండాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 25,808 మంది గాయపడగా, 5,144 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అమెరికా విదేశాంగ శాఖ  పేర్కొంది.

ముఖ్యంగా ఎంటెబ్బే అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాజధాని కంపాలాకు వెళ్లే రహదారితో పాటు ఇతర హైవేలపై రాత్రిపూట ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కంపాలా-ఎంటెబ్బే విమానాశ్రయ రహదారి మినహా, ప్రధాన నగరాలు, పట్టణాల బయట ఉన్న రోడ్లపై చీకటి పడిన తర్వాత అమెరికా రాయబార కార్యాలయ ఉద్యోగులు వాహనాలు నడపకూడదని ఆంక్షలు విధించింది.

మొత్తంగా చూస్తే.. నేరాలు, ఉగ్రవాద ముప్పు, ఎబోలా వైరస్ వ్యాప్తి, రోడ్డు ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని ఉగాండాకు ప్రయాణించవద్దని అమెరికా దేశ  పౌరులకు హై  లెవెల్ వర్కింగ్  జారీ చేసింది.
 

మరిన్ని వార్తలు