నవంబర్ 19న సిద్దిపేటకు సీఎం రేవంత్ .. సభా ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు

నవంబర్ 19న సిద్దిపేటకు సీఎం రేవంత్ .. సభా ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు

సిద్దిపేట జిల్లా:  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  నవంబర్ 19న  సిద్దిపేటలో పర్యటించనున్న నేపథ్యంలో సభా ఏర్పాట్లను మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ చీఫ్ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పరిశీలించారు. సీఎం పర్యటనకు సంబంధించిన సభాస్థలాన్ని పరిశీలించి, ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.

ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. నవంబర్ 19న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన ఖరారైందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో మంచి స్పందన వస్తోందన్నారు. కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, బ్రేక్‌ఫాస్ట్ వంటి పథకాల ద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తున్నామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట వేదికగా అర్హులైన ప్రతి ఒక్కరికీ రూ.5 లక్షల జీవిత బీమా కల్పించే ఇందిరా భీమా పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. నవంబర్ 19న ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా సిద్దిపేట సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా 'ఇంటింటా ఇందిరా కుటుంబం' పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. అలాగే ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు బోనస్, రుణమాఫీ వంటి పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.

ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. నవంబర్ 19న జరిగే సీఎం సభకు దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, సిరిసిల్ల, మానకొండూరు నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.