Hanuman Ansh OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘హనుమాన్ అంశ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

Hanuman Ansh OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘హనుమాన్ అంశ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

సినిమా బడ్జెట్ ఎంత భారీగా ఉంటేనే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తుందనుకుంటే పొరబడినట్లే! కేవలం రూ.2 కోట్లతో తెరకెక్కి.. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.450 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఓ చిన్న సినిమా ఇండియన్ సినీ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవితంలోని అంశాల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం పేరే ‘హనుమాన్ అంశ్’ (Hanuman Ansh). థియేటర్లలో సంచలనం సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఇంతకీ ఈ మూవీ ఎక్కడ, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుందో చూద్దాం.. 

నవంబరు 27 నుంచి స్ట్రీమింగ్..

థియేటర్లలో ఈ స్థాయి విజయాన్ని అందుకున్న ‘హనుమాన్ అంశ్’ ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను పలకరించనుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీలివ్ (SonyLIV) ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. నవంబరు 27 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. అంతేకాదు, ఆ తర్వాత సోనీ మ్యాక్స్‌లో టెలివిజన్ ప్రీమియర్ కూడా కానుంది. హిందీతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ సినిమా అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. 

బాక్సాఫీస్ వద్ద అద్భుతం.. ఎలా సాధ్యమైందంటే?

ఈ సినిమా బాక్సాఫీస్ ప్రయాణం కూడా ఆసక్తికరంగానే సాగింది. మొదట్లో చాలా తక్కువ థియేటర్లు, పరిమిత షోలతో విడుదలైన ఈ చిత్రం.. తొలిరోజు కేవలం రూ.10 లక్షల వసూళ్లనే సాధించింది. మొదటి రెండు వారాల్లోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అయితే క్రమంగా ప్రేక్షకుల నుంచి వచ్చిన పాజిటివ్ టాక్, మౌత్ టాక్‌తో కలెక్షన్లు ఒక్కసారిగా పెరిగాయి. చివరకు ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.452.86 కోట్ల వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. 

తెలుగులో మాత్రం అంతంతమాత్రమే..

హిందీలో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించిన ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులను మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. అక్టోబర్ 9న హోంబలే ఫిల్మ్స్ ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసింది. అయితే భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం తెలుగులో ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ అందుకోలేకపోయింది. ట్రేడ్ లెక్కల ప్రకారం తొలి రోజు సుమారు రూ.60 లక్షల నెట్ వసూలు చేయగా.. తొలి మూడు రోజుల్లో కలిపి రూ.3.10 కోట్ల నెట్ సాధించింది. మొత్తంగా తెలుగులో సుమారు రూ.4–6 కోట్లు రాబట్టిందని సమాచారం. 

కథ:

కథ విషయానికి వస్తే.. తల్లిని కోల్పోయిన లక్ష్మీనారాయణ అనే బాలుడు దేవుడి గురించి తెలుసుకోవాలనే అన్వేషణలో ప్రయాణం మొదలుపెడతాడు. ఆ ప్రయాణంలో ఎదురైన అనుభవాలు, ఆధ్యాత్మిక అన్వేషణ అతడి జీవితాన్ని ఎలా మార్చాయి? చివరకు అతడు నీమ్ కరోలి బాబాగా ఎలా మారాడు? అనే అంశాలను ఈ సినిమాలో చూపించారు. భక్తి, విశ్వాసం, మానవత్వం, సేవాభావం వంటి విలువలకు దర్శకుడు ప్రాధాన్యం ఇచ్చారు. 

ALSO READ : తరాలు మారినా మారని కష్టం.. ఎన్టీఆర్, యశ్ పౌరాణిక గెటప్స్ వెనుక ఇంత శ్రమ ఉందా?

మొత్తానికి.. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో మొదలై రూ.450 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ ఆధ్యాత్మిక చిత్రం థియేటర్లలో చూడలేకపోయిన ప్రేక్షకులకు ఇప్పుడు ఓటీటీలో చూసే అవకాశం దక్కనుంది. మరి డిజిటల్ వేదికపై ‘హనుమాన్ అంశ్’ ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుంటుందో చూడాలి!