మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు గురై మూడు దశాబ్దాలకు పైగా గడిచింది. కానీ, పేలుడు తర్వాత ఆయన డెడ్ బాడీ ఛిద్రమైన భయానక ఫొటోలను తాను ఇప్పటిదాకా చూడలేదని సోనియా గాంధీ తన ఆత్మకథలో వెల్లడించారు. భర్త రాజీవ్ గాంధీ మరణం తాలూకు దారుణమైన దృశ్యాలేవి తన కంట పడకుండా కొడుకు రాహుల్ గాంధీ, కూతురు ప్రియాంక గాంధీ చాలా జాగ్రత్త పడ్డారని సోనియా తెలిపారు. ఏ న్యూస్ పేపర్, మ్యాగజైన్ ఇంటికి వచ్చినా ముందుగా వాటిని తన పిల్లలిద్దరూ పరిశీలించేవారని వివరించారు.
తమ సిబ్బందికి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి, ఏ న్యూస్ పేపర్ నేరుగా తన చేతికి రాకుండా చూశారని చెప్పారు. ఆనాటి న్యూస్ పేపర్లల్లో పదే పదే వచ్చిన రాజీవ్ భయానక ఫొటో నుంచి తన పిల్లలే తనను ఒక కవచంలా కాపాడుకుంటూ వచ్చారని ఆమె పేర్కొన్నారు. ఆ దుర్ఘటన తర్వాత రాహుల్, ప్రియాంకే తనకు అన్నీ అయి తల్లిదండ్రుల లాగా నిలబడ్డారని సోనియా గాంధీ గుర్తుచేసుకున్నారు.
