ఆత్మకథ ద్వారా తన జీవితంలో ఎదురైన కష్టాల గురించి సోనియా తొలిసారిగా బహిరంగంగా పంచుకున్నారు. యూపీఏ రెండో విడత పాలనా కాలంలో ఆమె తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. అప్పట్లో ఆమెకు రెండుసార్లు క్యాన్సర్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. 2010లో ఆమెకు రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు వైద్యులు అనుమానించారు. ఆ వార్త ఆమెను, ఆమె కుటుంబ సభ్యులను ఆందోళనకు గురిచేసింది. మీడియా తన వ్యక్తిగత గోప్యతలోకి ప్రవేశించకూడదనే ఉద్దేశంతో సోనియా ట్రీట్మెంట్ కోసం ఇటలీలోని మిలన్కు వెళ్లారు.
అక్కడ విజయవంతంగా సర్జరీ చేయించుకున్నారు. ఆ ఆపరేషన్ జరిగిన ఏడాదికే ఆమెకు మరో షాక్ తగిలింది. ఫాలో-అప్ పరీక్షల్లో భాగంగా ఆమె క్లోమం (పాంక్రియాస్) లో మరో కణితి ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఈసారి ఆమెను నెదర్లాండ్స్‌లోని రోటర్‌డ్యామ్‌కు తరలించి, ప్రసిద్ధ పాంక్రియాటిక్ సర్జన్ డాక్టర్ కాస్పర్ వాన్ ఐజ్క్ తో శస్త్రచికిత్స చేయించారు. అలా ప్రాణాంతక వ్యాధి నుంచి పూర్తిగా కోలుకోగలిగారు. అయితే, 2016 ఆగస్టులో వారణాసిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆమె మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఎండలో 5 గంటల పాటు సాగిన రోడ్‌షోలో అలసట కారణంగా కుప్పకూలిపోయారు. స్పృహ కోల్పోతున్న క్షణాల్లో తన భర్త రాజీవ్ గాంధీ తనను ఓదారుస్తున్నట్లు తనకు కనిపించిందని సోనియా భావోద్వేగంతో రాశారు.
